Chandramohan : హీరోయిన్లకు లక్కీహీరో...చంద్రమోహన్‌ కన్నుమూత !

0

సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ అనారోగ్యంతో కన్నుమూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. చంద్రమోహన్‌ మరణంతో చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. గత నాలుగేళ్లగా చంద్రమోహన్‌ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కిడ్నీ సమస్య కూడా తలెత్తింది. ఈ రోజు ఉదయం సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించారని వైద్యులు నిర్దారించారు. ఆయన ఇద్దరు కూతుర్లలో ఒకరు చెన్నై నుంచి, మరొకరు అమెరికా నుంచి రావాల్సి ఉంది. వారు వచ్చిన తర్వాత.. సోమవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు అని తెలిపారు. 

కొత్త హీరోయిన్లకు లక్కీ హీరో !

ఇప్పటి వరకు చంద్రమోహన్‌ మొత్తం 932 పైగా సినిమాల్లో నటిస్తే అందులో 175 సినిమాల్లో హీరోగా నటించారు. కొత్త హీరోయిన్లకు లక్కీ హీరోగా ఆయనను చెప్పుకునేవారు. అప్పట్లో ఆయన పక్కన నటించిన హీరోయిన్లంతా టాప్‌ పొజిషన్‌కి చేరడమే అందుకు కారణం. అందుకే అప్పట్లో కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే హీరోయిన్లంతా ఆయన పక్కన నటించాలని సెంటిమెంటుగా భావించేవారట. ‘చంద్రమోహన్‌ పక్కన నటించే ఛాన్స్‌ వస్తే బాగుండును’.. అని కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న హీరోయిన్లు ఎదురుచూసేవారు అంటే అతిశయోక్తి కాదు. నిజంగానే అప్పట్లో చంద్రమోహన్‌ పక్కన నటించిన హీరోయిన్లంతా స్టారో హీరోయిన్లుగా వెలుగొందారు. చంద్రమోహన్‌ 1996 లో వచ్చిన ‘రంగులరాట్నం’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే ఉత్తమ నటన కనబరిచి నంది అవార్డును అందుకున్నారు. ఆ తరువాత వైవిధ్యమైన పాత్రల్లో నటించారు. కె.విశ్వనాథ్‌ డైరెక్షన్‌లో 1976 లో వచ్చిన ‘సిరిసిరిమువ్వ’ సినిమాతో నటి జయప్రద హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. చంద్రమోహన్‌ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది. ఆ తర్వాత జయప్రద తిరుగులేని స్టార్‌డమ్‌ సొంతం చేసుకున్నారు. అడవిరాముడు, యమగోల సినిమాలతో ఎన్టీఆర్‌ పక్కన నటించారు.1978 లో వచ్చిన ‘పదహారేళ్ల వయసు’ సినిమాతో శ్రీదేవి ఒక్కసారిగా టాప్‌ హీరోయిన్‌ అయిపోయారు. ఈ సినిమాలో చంద్రమోహన్‌, శ్రీదేవి జంటగా నటించారు. ఈ సినిమా తర్వాత శ్రీదేవి వేటగాడు, కొండవీటి సింహం, జస్టిస్‌ చౌదరి వంటి సినిమాల్లో నటించి మంచి పొజిషన్‌కి రీచ్‌ అయ్యారు. ఇదే సంవత్సరంలో చంద్రమోహన్‌కి జోడిగా జయసుధ నటించిన ‘ప్రాణం ఖరీదు’ సినిమా జయసుధను స్టార్‌ హీరోయిన్‌ చేసింది. 1983 లో వచ్చిన ‘పెళ్లి చూపులు’ సినిమాలో చంద్రమోహన్‌ విజయశాంతి నటించారు. ఈ సినిమా తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ప్రతిఘటన’ ఎంత సూపర్‌ హిట్టో మీకందరికీ తెలిసిందే. ఆ తర్వాత విజయశాంతి శోభన్‌ బాబు, నాగేశ్వరరావు, చిరంజీవి వంటి స్టార్‌ హీరోలతో నటించారు.దాదాపుగా చంద్రమోహన్‌తో 60 కి పైగా హీరోయిన్లు నటించారు. శ్రీదేవి, మంజుల, రాధిక, జయప్రద, జయసుధ, విజయశాంతి, తాళ్లూరి రామేశ్వరి.. వీరంతా టాప్‌ పొజిషన్‌కి చేరుకున్నారు. ఇదంతా అనుకోకుండా జరిగింది కానీ తన ప్రమేయం లేదని చాలాసార్లు చంద్రమోహన్‌ చెప్పారు. 932 సినిమాల్లో నటించడం అంటే ఆషామాషీ విషయం కాదు. సుదీర్ఘ సినిమా ప్రయాణంలో చంద్రమోహన్‌ ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు. ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్నారు. సినీ వినీలాకాశంలో తిరుగులేని నటుడిగా తన స్ధానం పదిలం చేసుకున్న నటుడు దీపావళి పండుగ వెలుగులు చూడకుండానే అస్తమించడం వెండితెర ప్రముఖులతో పాటు ఆయన అభిమానుల్ని విషాదంలో నెట్టేసింది.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !