బీజేపీలో ప్రాధాన్యం దక్కకపోవడంతో విజయశాంతి ఆ పార్టీని వీడి నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె శుక్రవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇటీవల విజయశాంతి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలి పదవితోపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపించారు. కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బీజేపీపై ఆమె తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఆ సమయంలో తెలంగాణ వ్యతిరేకులతో వేదిక పంచుకోవాల్సి వచ్చిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి ఆమె ట్వీట్ చేయటం కలకలం రేపింది. అప్పట్లోనే పార్టీ మార్పుపై వార్తలు రాగా.. శుక్రవారం ఆమె కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.
కీలక బాధ్యతలు !
కాంగ్రెస్ పార్టీలో చేరిన గంటల వ్యవధిలోనే ఆమెకు కీలకమైన ప్రచార కమిటీ కోఆర్డినేటర్, కన్వీనర్ పదవి ఇవ్వటం పొలిటికల్ సర్కిల్‌లో చర్చనీయాంశమైంది. సినీ గ్లామర్ ఉన్న విజయశాంతికి రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయశాంతితో క్యాంపెయినింగ్ చేయిస్తే కలిసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రచార కమిటీ కన్వీనర్లుగా సమరసింహారెడ్డి, పుష్పలీల, మల్లు రవి, కోదండరెడ్డి, నరేందర్‌రెడ్డి, యరపతి అనిల్, రాములు నాయక్, పిట్ల నాగేశ్వరరావు, ఒబేదుల్లా కొత్వాల్, రమేష్, పారిజాతరెడ్డి, సిద్దేశ్వర్, రామ్మూర్తి నాయక్, అలీ బిన్ ఇబ్రహీం, దీపక్ జాన్‌ను నియమించింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన కొన్ని గంటల్లోనే ఆమెకు కీలక పదవి దక్కడంతో అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. బడంగ్‌పేట్ మేయర్ పారిజాత మహేశ్వరం టికెట్ ఆశించారు. అది దక్కకపోవడంతో ఒకింత నిరాశకు గురయ్యారు. దీంతో ఆమెకు ప్రచార, ప్లానింగ్ కమిటీ కన్వీనర్‌గా నియమించి కూల్ చేసింది.
మరో 12 రోజుల్లో పోలింగ్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో 12 రోజుల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో దీంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. రాష్ట్ర అవిర్భావం తర్వాత తొలిసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్విలూరుతోంది. డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీలతో ప్రజల్లోకి వెళ్లిన కాంగ్రెస్ శుక్రవారం ఎన్నికల మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసింది. మొత్తం 66 హామీలతో అభయహస్తం పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రతి పార్టీ ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తోంది. బీఆర్‌ఎస్‌కు అన్నీ తానై సీఎం కేసీఆర్ వరుసగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇటు కేటీఆర్ కూడా ముఖ్యమైన నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక బీజేపీ అయితే ఇప్పటికే ఎన్నికల క్యాంపెయిన్ జాబితాను విడుదల చేసింది. మన్నటి వరకూ మోదీ, అమిత్ షాలు వరుసగా తెలంగాణలో సభలు ఏర్పాటు చేశారు. ఈరోజు సాయంత్రం బీజేపీ అమిత్ షా చేతుల మీదుగా తెలంగాణ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేయనుంది