నాలుగు నెలలు వేచి ఉన్నా కాంగ్రెస్ నుండి స్పందన రాలేదని చెప్పి తెలంగాణ ఎన్నికల్లో పోటీ దిగుతున్నానని ఆర్భాటంగా ప్రకటించిన వైఎస్ షర్మిల నేడు ఎన్నికల నామినేషన్ల నాటికి మాట మార్చారు. ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని.. కాంగ్రెస్‌కు బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదన ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని.. రాష్ట్ర ప్రజల కోసమే ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. తన నిర్ణయంతో ఏకీభవించని పార్టీ నేతలు..తనను క్షమించాలని కోరారు. పాలేరు ప్రజల కూడా అర్థం చేసుకోవాలని భావోద్వేగానికి లోనయ్యారు. వ్యతిరేక ఓటు చీలితే కేసీఆర్ తిరిగి సీఎం అవుతారని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి రాకుండా చూసేందుకు కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు షర్మిల వెల్లడిరచారు. గెలిచే అవకాశాలున్నాయి, ఈ పరిస్థితుల్లో అడ్డుపడొద్దని కాంగ్రెస్ పార్టీ తనను కోరిందని షర్మిల అన్నారు. పార్టీ పెట్టినప్పటి నుండి ప్రజలతో నమ్మకంగా ఉన్నామని తెలిపారు.కేసీఆర్ ప్రభుత్వం మహిళ అని కూడా చూడకుండా జైల్లో పెట్టిందన్నారు. ప్రతి వర్గానికి మేలు చేయడానికి వైఎస్సార్ టీపీ చూసిందన్నారు. తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు అందలేదన్నారు. 3,800 కిలోమీటర్లు పాద యాత్ర చేశామని తెలిపారు. ప్రతి అంశంపై కేసీఆర్ ను ప్రశ్నించామని, ప్రజల పక్షాన ఉన్నామని చెప్పారు. అక్రమాల గురించి మాట్లాడిన పార్టీ వైఎస్సార్ టీపీ అని అన్నారు.
ఏమి హామీ లభించిందో...
ఒంటరిగా పోరాటం చేసినా ఎలాంటి ప్రభావం లేకపోవటంతో కాంగ్రెస్‌తో కలిసి సాగేందుకు షర్మిల తలొగ్గారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యసభ సీటు ఇస్తామని హామీ లభించిందని అంటున్నారు. దీంతోనే నమ్ముకున్న నాయకులను, కార్యకర్తలను నట్టేట ముంచి తన రాజకీయ స్వలాభం కోసం కాంగ్రెస్‌కు బేషరతుగా మద్దతు తెలిపారని కార్యకర్తలు వాపోతున్నారు.