hyd Metro Project : రాయదుర్గం - శంషాబాద్‌ మెట్రో టెండర్ల నిలిపివేత !

0

  • మరో మార్గంపై అన్వేషణ 
  • ఎంజీబీఎస్‌`శంషాబాద్‌ వైపు మొగ్గు
  • హైద్రాబాద్‌కు దూరంగా ఫార్మసిటీ 
  • మారుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రాధాన్యాలు 

హైదరాబాద్‌ నగరంలో మెట్రో రైలు మార్గాల విస్తరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టుపై ఆరా తీశారు. ఓఆర్‌ఆర్‌ వెంట జీవో 111 ప్రాంతంలో మెట్రో ఎలైన్‌మెంట్‌ను రూపొందించడంపై అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికే అక్కడ ఓఆర్‌ఆర్‌ ఉన్న నేపథ్యంలో.. రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు నిర్మించాల్సిన మెట్రో టెండర్లను నిలిపివేయాలని ఆదేశించారు. దానికి ప్రత్యామ్నాయంగా ఎంజీబీఎస్‌-ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, ఎయిర్‌పోర్టు మీదుగా ఎలైన్‌మెంట్‌ రూపొందించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా రెండు మార్గాలను పరిశీలించాలని సూచించారు. చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, జల్‌పల్లి, విమానాశ్రయం పీ7 రోడ్డు ఒక మార్గం కాగా.. చాంద్రాయణగుట్ట, బార్కాస్‌, పహాడీషరీఫ్‌, శ్రీశైలం రోడ్డు మార్గాన్నీ అధ్యయనం చేయాలని, ఇందులో ఏదీ తక్కువ ఖర్చు అయితే దానికి ప్రాధాన్యం ఇచ్చి కొత్త ఎలైన్‌మెంట్‌ రూపొందించాలని సూచించారు. తద్వారా తూర్పు, మధ్య, పాత నగరంలోని అధిక జనాభాకు రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు మెట్రో లైను నిర్మాణం కోసం గత భారాస ప్రభుత్వం ఎలైన్‌మెంట్‌ను ఖరారు చేసి.. టెండర్లను కూడా పిలిచింది. వాటిని ఆమోదించే దశలో ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో వాటి ఖరారుపై నిర్ణయం తీసుకోలేదు. ఈ లైనుకు దాదాపు రూ.6,250 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. ఈ మార్గానికి హెచ్‌ఎండీఏ నుంచి రూ.600 కోట్లు ఇస్తున్నట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం కొలువుదీరగా.. ఈ లైన్‌ విషయంలో సర్కారు వైఖరిలో మార్పు వచ్చింది. శంషాబాద్‌ నుంచి విమానాశ్రయానికి ఓఆర్‌ఆర్‌ ఉండటంతో ఈ కారిడార్‌లో మెట్రో లైను అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌ భావిస్తున్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో బుధవారం మెట్రోపై ఆయన సమీక్ష చేశారు.

పాతబస్తీ మెట్రో పూర్తి చేయకపోవడంపై అసంతృప్తి

మెట్రో మొదటి దశలో ఒప్పందం మేరకు పాతబస్తీలోని ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల మార్గాన్ని ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ పూర్తి చేయకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేసి పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. విమానాశ్రయం మెట్రోపైనా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలన్నారు. మూసీ కారిడార్‌లో నాగోలు నుంచి గండిపేట వరకు ఎంజీబీఎస్‌ను కలుపుతూ ఈస్ట్‌, వెస్ట్‌ రోడ్డు కమ్‌ మెట్రో రైలును మాస్టర్‌  ప్లాన్‌లో చేర్చాలని సూచించారు.

కందుకూరు ఫార్మాసిటీ రద్దు ! 

కందుకూరు సమీపంలోని పార్మా సిటీ కోసం సేకరించిన భూమిలో పర్యావరణహిత మెగా టౌన్‌షిప్‌ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. కాలుష్యకారకమైన ఫార్మా సిటీ హైదరాబాద్‌కు సమీపంలో ఉండకూడదని, నగరానికి దూరంగా ఏర్పాటు చేయాలని చెప్పారు. విమానాశ్రయం నుంచి శ్రీశైలం రోడ్డులోని తుక్కుగూడ మీదుగా కందుకూరు మెగా సిటీకి మెట్రోను అనుసంధానించాలన్నారు. నగరాన్ని అన్ని దిశల్లో అభివృద్ధి చేయాలన్నారు. భౌగోళిక పరిమితులు లేని ప్రపంచ నగరంగా ఎదిగేందుకు హైదరాబాద్‌కు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయన్నారు. తెలంగాణలో ఇప్పటికే 40 శాతం పట్టణీకరణ ఉందని, మరింత వేగవంతంగా పట్టణీకరణ చెందుతున్న దృష్ట్యా ఓఆర్‌ఆర్‌ చుట్టూ శాటిలైట్‌ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. భవిష్యత్తులో ఇక్కడ 2-3 కోట్ల జనాభా నివసించేందుకు అనుగుణంగా ప్రణాళికలకు రూపకల్పన చేయాలన్నారు. ఈ సమీక్షలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి, పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌కుమార్‌, సీఎంవో కార్యదర్శి వి.శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !