RK : మంగళగిరి ఎమ్మేల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా !

0

  • వైఎస్సార్‌సీపీకి ఊహించని షాకిచ్చిన ఆర్కే
  • ఎమ్మెల్యే పదవితో పాటూ పార్టీకి రాజీనామా
  • కొంతకాలంగా అధిష్టానంపై అసంతృప్తి

గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్సార్‌సీపీకి షాకిచ్చారు. ఎమ్మెల్యే పదవితో పాటుగా పార్టీకి రాజీనామా చేశారు..స్పీకర్‌ తమ్మినేని సీతారాంకి తన రాజీనామా లేఖను పంపారు. అలాగే పార్టీకి రాజీనామా చేసిన లేఖను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపారు. స్పీకర్‌కు పంపిన లేఖలో ఎలాంటి కారణాలను ప్రస్తావించలేదు.. కేవలం పదవికి రాజీనామా చేసినట్లు మాత్రమే చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలో కొంతకాలంగా వైఎస్సార్‌సీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నట్లు తెలుస్తోంది. కొంత కాలంగా ఈ వర్గపోరు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇటీవల పోటాపోటీగా కార్యాలయాలు సైతం ప్రారంభించారు. అయితే నియోజకవర్గంలో మొత్తం రెండు, మూడు గ్రూపులు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. టీడీపీ నుంచి వచ్చి గంజి చిరంజీవి టికెట్‌ ఆశిస్తున్నారు.. అలాగే కాండ్రు కమల, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. దొంతి వేమారెడ్డి కూడా నియోజకవర్గంలో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా, మంగళగిరి తాడేపల్లి నగర అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి పార్టీ పేరుతో కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇప్పటికే మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ కార్యాలయం ఉండగా.. వేమారెడ్డి కార్యాలయం ఓపెన్‌ చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక ఆ తరువాత కూడా విభేదాలను సమసిపోయేలా చేసేందుకు సీఎం జగన్‌ ఏమాత్రం ప్రయత్నించలేదు సరికదా.. ఆళ్లను దూరం పెడుతూ వచ్చారు. ఆ విభేదాలన్నీ పెరిగిపోయి చివరకు ఆయన రాజీనామా చేశారనే టాక్‌ వినిపిస్తోంది.

గంజి చిరంజీవికి మంగళగిరి టికెట్‌ ?

2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన నారా లోకేష్‌పై ఆళ్ల రామకృష్ణా రెడ్డి గెలిచారు. ఐతే.. కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాల విషయంలో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గ నేతకు టికెట్‌ ఇస్తారనే ప్రచారం జరుగుతుండటంతో.. ఆళ్ల కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. తాజాగా మంగళగిరిలో వైసీపీ పార్టీ కార్యాలయం ప్రారంభమైంది. ఐతే.. ఈ విషయం ఆళ్లకు తెలియదు. ఆయనకు ఆహ్వానం అందలేదు. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా ఇలాంటివి చేస్తుండటంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఐతే.. పార్టీ హైకమాండ్‌ ఆయన విషయంలో కొంత వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన వైఎస్‌ షర్మిలకు అనుకూలమైన వ్యక్తి అనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలు.. వైరుధ్యాన్ని పెంచినట్లు కనిపిస్తున్నాయి.మంగళగిరి అసెంబ్లీ ఇంచార్జిగా గంజి చిరంజీవిని నియమించడంతో ఆళ్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. అంతేకాదు ఆదివారం మంగళగిరిలో వైసీపీ కార్యాలయాన్ని కూడా గంజి చిరంజీవి ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆర్కే రాజీనామా చేశారని ప్రచారం జరుగుతోంది.

అధిష్టానం ఏం చేయబోతోంది 

మంగళగిరిలో బీసీ నాయకుడికి టికెట్‌ ఇచ్చి బీసీ ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు ఆళ్ళ రామకృష్ణారెడ్డిని పొమ్మనకుండా పొగబెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పార్టీ అధిష్టానం కూడా ఎలా స్పందిస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. అధిష్టానం ఆదేశించకుండా వైఎస్‌ఆర్‌సీపీలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసే ప్రసక్తే ఉండదు. ఆ ధైర్యం కూడా ఎవరూ చేయలేరు. కాబట్టి ఇది అధిష్టానం అనుమతితోనే గంజి చిరంజీవి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇక ఎన్నికలు దగ్గర పడటంతో అసంతృప్తి జ్వాలలు మరికొన్ని ప్రాంతాలకు వ్యాపించకుండా ఆళ్ళరామకృష్ణారెడ్డితో మాట్లాడి ఎమ్మేల్సీ లేదా ఇతర పార్టీ పదవులు ఆశచూపి అసంతృప్తిని చల్లార్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !