తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనా వ్యవహారాల్లో స్పీడు పెంచారు. వరుస రివ్యూలతో వివిధ శాఖలను రివ్యూ చేస్తూ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలో యువతను పట్టిపీడిస్తున్న మత్తు మాఫియాపై ఉక్కుపాదం మోపాలంటూ నార్కోటిక్స్ అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్, గంజాయి ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవడానికి అదనపు టీమ్‌లను రంగంలోకి దించాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ నియంత్రణపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. తాజాగా నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులతో ఆయన రివ్యూ మీటింగ్ నిర్వహించారు. తెలంగాణలో డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా నివారణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
డ్రగ్స్ వినియోగంపై ప్రజల్లో ఆందోళన !
డ్రగ్స్ ముఠాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలంటూ సిఎం అధికారులను ఆదేశించారు. అవసరమైతే టీమ్ స్ట్రెంగ్త్‌ను పెంచి అదనంగా బడ్జెట్ కేటాయించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో డ్రగ్స్ నియంత్రణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డ్రగ్స్ సరఫరా, వాడకంపై గతంలో పలువురు సినిమా ప్రముఖులకు నోటీసులు ఇచ్చారు. డ్రగ్స్ వ్యవహారంలో గతంలో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు అదే డ్రగ్స్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేయడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ వినియోగం పెరుగుతున్నదంటూ ప్రజల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో నార్కోటిక్ అధికారులతో ముఖ్యమంత్రి ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్, గంజాయి ముఠాలపై నమోదైన కేసులను పరిగణనలోకి తీసుకుని పూర్తి స్థాయిలో మత్తు మాఫియాను నియంత్రించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. సంబంధిత అధికారులతో, పోలీసు విభాగాల ఆఫీసర్లతో చర్చించిన తర్వాత ప్రస్తుతం హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియాను నియంత్రించడం కోసమే పనిచేస్తున్న నార్కోటిక్స్ వింగ్ పనితీరు, సాధించిన ఫలితాలు, ఎదురవుతున్న సవాళ్ళు, తీసుకోవాల్సిన కఠిన నిర్ణయాలు తదితరాలపై కూడా అధికారులతో సీఎం చర్చించారు. రేవంత్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఇక మత్తు ముఠాలను పూర్తి స్థాయిలో చిత్తు చేసేందుకు నార్కోటిక్స్ అధికారులు రంగంలోకి దిగనున్నారు.
కంట్రోల్ చేయగలరా ? లేదా వత్తిళ్ళకు లొంగిపోతారా ?
సినీ, రాజకీయ రంగాల్లోని ప్రముఖులు, వారి పిల్లలే ఎక్కువగా డ్రగ్స్ వినియోగిస్తూ పట్టుబడిన సందర్భాలు కోకొల్లలు. కానీ ఎవరిపైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. రాజకీయ వత్తిడులకు తలొగ్గి, కేవలం వారిపై విచారణ మాత్రమే జరిపి వదిలివేయటం జరిగింది. డ్రగ్స్ వినియోగిస్తున్న వారిపై ఎలాంటి చర్యలు లేకపోగా, డ్రగ్స్ సప్లై చేస్తున్న కొందరు నైజీరియన్లను అరెస్ట్‌లు చూపి తూతూ మంత్రంగా చర్యలు చేపడుతున్నారు. డ్రగ్స్ ఉన్నతవర్గాలకు మాత్రమే అందుబాటులో ఉండగా, గంజాయి ఇంజినీరింగ్ కాలేజీల్లో విద్యార్థుల వరకు చేరింది. విద్యార్థులు మత్తులో ఊగుతున్నారు అంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఊహించవచ్చు. చాపకింద నీరులాగే గంజాయి అమ్మకాలు ప్రతి వీధికి చేరిపోయాయి. ఇలాంటి మత్తు మాఫియాలను కంట్రోల్ చేయగలిగితే అంత కన్నా సంతోషం ఇంకేముంటుంది.