KCR : మెదక్‌ నుండి లోక్‌సభ బరిలో కేసీఆర్‌ ?

0

  • సామాన్య ఎమ్మేల్యే కంటే ఎంపీగా ఉండేందుకు ఆసక్తి !
  • కుదిరితే దిల్లీలో చక్రంతిప్పే ప్యూహంతో కేసీఆర్‌.
  • రాష్ట్ర రాజకీయ వ్యవహారాలన్నీ కేటీఆర్‌, హరీశ్‌​ కే 
  • ప్రతిపక్ష నేతగా కడియంకూ చాన్స్‌ ?
  • త్వరలోనే బీఆర్‌ఎస్‌ ఎల్పీ మీటింగ్‌ ? ఆ రోజే డెసిషన్‌

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మెదక్‌ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో గజ్వేల్‌లో గెలవగా, కామారెడ్డిలో ఓడిపోయారు. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ కేవలం 39 సీట్లకే పరిమితమైంది. గజ్వేల్‌లో గెలిచిన సీఎం కేసీఆర్‌ శాసన సభ్యుడిగా కొనసాగుతారా..? ముఖ్యమంత్రిగా అధికారం చలాయించిన వ్యక్తి మళ్ళీ ఓ సామాన్య ఎమ్మేల్యేలా సభలో అడుగుపెడతారా ? అసెంబ్లీ మెట్లెక్కి ప్రతిపక్ష స్థానంలో కూర్చొని ‘అధ్యక్షా..!’ అంటూ గళం వినిపిస్తారా ? అంటే లేదనే మాట వినిపిస్తోంది. పదేండ్ల పాటు సీఎంగా కొనసాగిన కేసీఆర్‌ ఓటమితో డీలా పడినట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యవహారాలను బీఆర్‌ఎస్‌  నేతలు హరీశ్‌​ రావు, కేటీఆర్‌కు అప్పగించి తాను లోక్‌ సభ బరిలో నిలుస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 

సొంత జిల్లా మెదక్‌ కావడంతో

తెలంగాణ ఏర్పడిన తర్వాత  2014లో జరిగిన జమిలీ ఎన్నికల్లో కేసీఆర్‌ మెదక్‌ నుంచి ఎంపీగా, గజ్వేల్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. రెండు చోట్ల విజయం సాధించారు. మెదక్‌ ఎంపీగా ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థి పీ శ్రవణ్‌​ కుమార్‌ రెడ్డిపై  3,97,029 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ తర్వాత మెదక్‌ ఎంపీ స్థానానికి రాజీనామా చేసి, గజ్వేల్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతూ  ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో మెదక్‌ స్థానం నుంచి కొత్త ప్రభాకర్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి సమీప ప్రత్యర్థి గాలి అనిల్‌ కుమార్‌ పై విజయం సాధించారు. 2009 నుంచి ఇక్కడ గులాబీ పార్టీ గెలుస్తూ వస్తోంది. 2009లో విజయశాంతి, 2014తో కేసీఆర్‌, అదే సంవత్సరం జరిగిన ఉప ఎన్నికలో కొత్త ప్రభాకర్‌ రెడ్డి గెలిచారు.  2019 పార్లమెంటు ఎన్నికల్లో మరో మారు కొత్త  ప్రభాకర్‌ రెడ్డి విజయం సాధించారు. తన సొంత జిల్లా కూడా మెదక్‌ కావడంతో బాగా కలిసి వస్తుందని కేసీఆర్‌ భావిస్తున్నట్టు సమాచారం. 

బీఆర్‌ఎస్‌ ఎల్పీ నాయకుడెవరు?

39 స్థానాలు గెలిచిన ప్రధాన ప్రతిపక్ష భూమిక పోషించాల్సిన బీఆర్‌ఎస్‌కు ఎల్పీ నాయకుడెవరన్న చర్చ జోరుగా సాగుతోంది. కేటీఆర్‌ లేదా హరీశ్‌ రావుకు ఇవ్వొచ్చన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే అంచనాలకు మించి ఈ పదవిని సీనియర్‌ రాజకీయ వేత్త, అపారమైన అనుభవం ఉన్న స్టేషన్‌ ఘన్‌ పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఇవ్వొచ్చన్న చర్చ కూడా నడుస్తోంది. 2004లో టీఆర్‌ఎస్‌ ఎల్పీ నేతగా విజయరామారావు శాసన సభా పక్ష నేతగా వ్యవహరించారు. 2009లో టీఆర్‌ఎల్పీ నేతగా ఈటల రాజేందర్‌ ఉన్నారు. ఈ రెండు పర్యాయాలు సీఎం కరీంనగర్‌, మహబూబ్‌ నగర్‌ ఎంపీగా కొనసాగారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా కడియం శ్రీహరికి అప్పగించవచ్చన్న వాదన ఉంది.  అప్పుడు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు రాజకీయ అనుభవం లేకపోవడమే కారనమనే వాదన మరో వైపు నుంచి వస్తోంది. ఏది ఏమైనా బీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత ఎవరనేది క్లారిటీ రావాల్సి ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !