అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన వారికి ఎమ్మెల్సీ, నామినేటెడ్ పోస్టులు ఇవ్వొద్దని పీసీసీ, ఏఐసీసీ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వారికి పదవులు ఇస్తే నియోజకవర్గాన్ని పట్టించుకోరని, పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టరని అధిష్టానం భావిస్తున్నది. దీంతో ఐదేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ వారికే టికెట్లు ఇస్తామని, గెలిచేలా ప్రణాళిక తయారు చేసుకోవాలని వారికి అర్థం అయ్యేలా చేయాలని భావిస్తోంది. ఆ లక్ష్యాన్ని వారికి అప్పగిస్తే వచ్చే ఎన్నికల్లో గెలవడానికి మరింత కసిగా పనిచేస్తారన్నది పీసీసీ, ఏఐసీసీ నేతల భావనగా తెలుస్తోంది.
ప్రజల మధ్యే ఉండేలా...
ఎమ్మెల్యేలుగా గెలవకపోయినా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో నియోజకవర్గానికి అవసరమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెప్పించి నిత్యం ప్రజల మధ్య ఉండేలా పార్టీ వారికి బాధ్యతలు అప్పగించనున్నది. ఇందుకోసం ఆ జిల్లా మంత్రులు సైతం ఇలాంటి సెగ్మెంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పార్టీ నాయకత్వం సూచనప్రాయంగా తెలిపింది. జిల్లా పర్యటన సందర్భంగా ఓడిన అభ్యర్థులను వెంట పెట్టుకుని తిప్పాలని, ప్రజల్లో లీడర్‌గా వారికి ఎక్స్‌పోజర్ ఇవ్వాలని సూచించనున్నది. పక్క నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు సైతం వారి వంతు సహకారాన్ని అందించాలని చెప్పనున్నది. నియోజకవర్గ సమస్యలపై ప్రభుత్వం కూడా స్పెషల్ ఫొకస్ పెట్టాలనుకుంటున్నది. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించలేకపోయామనే చర్చ ప్రజల్లో జరిగేలా ఆ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చదిద్దడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని పార్టీ నాయకత్వం సూచిస్తున్నది. ఆ నియోజకవర్గ పరిధిలో ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ గెలుపునకు దోహదపడేలా ఆలోచిస్తున్నది.
ఊహాగానాలకు చెక్ పడేలా..
కొద్దిమంది నేతలు ఓడిపోయినా వారిని మంత్రివర్గంలోకి తీసుకోవడానికి ఎమ్మెల్సీ చేసే ఆలోచన ఉన్నట్లు గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరికొద్దిమందికి ప్రభుత్వం ద్వారా ఏదైనా ఒక నామినేటెడ్ పోస్టు వస్తుందనే ఆశలూ ఉన్నాయి. వాటి కోసం ప్రయత్నాలను కూడా మొదలుపెట్టారు. అధికారంలో ఉన్నందున ఇలాంటి పోస్టులు ఇవ్వడానికి చిక్కులేమీ లేకపోయినప్పటికీ ఓడినవారు ఆయా నియోజకవర్గాల్లో ప్రజల తలలో నాలుకలా మారేలా, యాక్టివిటీస్‌ను ముమ్మరం చేసి పార్టీని బలోపేతం చేయడం ఉత్తమం అని నాయకత్వం భావిస్తున్నది. తప్పనిసరి పోస్టులను మాత్రమే సమర్థులైన వారితో భర్తీ చేయాలని భావిస్తున్నది.
పార్లమెంట్ ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు..
లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంతవరకూ నామినేటెడ్ పోస్టుల విషయంలో పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు వద్దనే భావనలో ఉన్నది. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినప్పటికీ లోక్‌సభ ఎన్నికల సమయంలో వారి నియోజకవర్గాల పరిధిలో పార్టీకి గణనీయంగా ఓట్లు పడేందుకు కృషి చేయాలనే పని అప్పగించనున్నట్లు సమాచారం. ఎక్కువగా ఏయే నియోజకవర్గాల్లో ఫోకస్ పెట్టాలనే అంశాన్ని కూడా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో వ్యూహాన్ని ఖరారు చేసిన తర్వాత ఓడిన అభ్యర్థులకు వివరించనున్నట్లు గాంధీ భవన్ వర్గాల సమాచారం.