తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ జరిగింది. పదోన్నతుల బదిలీలుగా పేర్కొంటూ పలువురిని తన పేషీలో చేర్చుకుంది ప్రభుత్వం. ఊహించినట్లుగానే యువ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి బాధ్యతలు దక్కాయి. హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా ఆమెను నియమించింది. మహా నగరాభివృద్ధికి ప్రణాళికలు రూపకల్పన చేయడంలో గుండెకాయలాంటి హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మొత్తం ఏడు జిల్లాలు 7200 చదరపు కిలోమీటర్ల పరిధిలో హెచ్‌ఎండీఏ విస్తరించి ఉంది. దాదాపు కోటిన్నర జనాభా ఈ పరిధిలో నివసిస్తున్నారు. భవిష్యత్తులో హెచ్‌ఎండీఏ పరిధి వరకు నగరం విస్తరించనుంది. దీంతో 3 కోట్ల వరకు జనాభా పెరగనుందని అంచనా వేస్తున్నారు. హెచ్‌ఎండీఏకు ఉన్నత పరిపాలనాధికారిగా కమిషనర్ మాత్రమే కొనసాగుతుండగా.. తాజాగా సంయుక్త కమిషనర్‌గా ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలిని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. 2019 నుంచి హెచ్‌ఎండీఏకు కమిషనర్‌గా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ కొనసాగుతున్నారు. వేలం ద్వారా రూ. వందల కోట్ల విలువైన భూముల అమ్మకాలు, అవుటర్ రింగ్ రోడ్ లీజు ఇతర ప్రాజెక్టులు ఆయన హయాంలోనే జరిగాయి.
బ్రాండ్ వ్యాల్యు పెంచటంపైనే దృష్టి !
హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్లు ప్రకటించిన కొత్త ప్రభుత్వం ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. అవుటర్ రింగ్‌రోడ్డు చుట్టూ టౌన్‌షిప్‌లు, శంషాబాద్ వరకు మెట్రో రైలు నిర్మాణం ఇతరత్రా ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొంది. దీంతో మహా నగరాభివృద్ధిలో ప్రణాళికల రూపకల్పనలో కీలకమైన హెచ్‌ఎండీఏ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు అడుగులు వేస్తోంది. ఫలితంగా పూర్తి స్థాయి కమిషనర్‌ను పోస్టును కొనసాగిస్తూనే కొత్తగా జాయింట్ కమిషనర్ పోస్టులో అదనంగా మరో ఐఏఎస్ అధికారిని నియమించినట్లు సమాచారం. ఇప్పటివరకు కమిషనర్‌గా ఉన్న అర్వింద్ కుమార్‌ను హెచ్‌ఎండీఏలో కొనసాగిస్తారా.. ఆ స్థానంలో నూతన అధికారిని నియమించనున్నారా.. అనేది ఒకటిరెండు రోజుల్లో స్పష్టత రానుంది. సంయుక్త కమిషనర్‌గా ఒకటిరెండు రోజుల్లో ఆమ్రపాలి బాధ్యతలు తీసుకోనున్నారు. మరోవైపు త్వరలో హెచ్‌ఎండీఏను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయనున్నట్లు అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. అవసరం లేకపోయినా.. ఓఎస్డీ పేర్లతో హెచ్‌ఎండీఏలో కొనసాగుతున్నవారిని సైతం బయటకు పంపనున్నట్లు తెలుస్తోంది.