DEVIL : కళ్యాణ్‌రామ్‌ డెవిల్‌ ట్రైలర్‌ లాంఛ్‌ !

0

కళ్యాణ్‌రామ్‌ కొత్త సినిమా ‘డెవిల్‌’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. పీరియాడికల్‌ స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో కల్యాణ్‌రామ్‌ బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌గా నటించారు. సంయుక్త, మాళవిక నాయర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. స్వీయ నిర్మాణంలో అభిషేక్‌ నామా తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం.. హైదరాబాద్‌లో ఈవెంట్‌ నిర్వహించి, అభిమానుల సమక్షంలో ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. ‘బింబిసార’కు సీక్వెల్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందో నందమూరి కల్యాణ్‌ రామ్‌ తెలిపారు. అనంతరం, ‘దేవర’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

అభిమానులు కోరుకునే అన్ని హంగులు ఉన్నాయి.

వేడుకనుద్దేశించి కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ.. ‘‘కథ బాగున్న సినిమాలను ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని ‘బింబిసార’ సమయంలో చెప్పా. దాన్ని మీరంతా నిజం చేశారు. ‘డెవిల్‌’ కూడా మంచి కథ, కథనం, విజువల్స్‌తో కూడిన సినిమా. దీనినీ ఆదరిస్తారని ఆశిస్తున్నా. అభిమానులు కోరుకునే అన్ని హంగులు ఈ చిత్రంలో ఉన్నాయి. ట్రైలర్‌ చూసి కొంతమంది ఇది నా ‘వన్‌మ్యాన్‌ షో’ అని అంటున్నారు. ఏ చిత్రమైనా సమృష్టి కృషితో రూపొందేదే తప్ప ఒక్కరి వల్ల కాదు’’ అని పేర్కొన్నారు. గతేడాది విడుదలైన ‘బింబిసార’ సినిమా సీక్వెల్‌పై స్పందిస్తూ.. వచ్చే ఏడాది వేసవిలో ప్రారంభమవుతుందని తెలిపారు. ట్రైలర్‌ ప్రకారం బ్రిటీష్‌ పాలనలో ఓ నగరంలో జరిగే హత్యలు, ఎవరికీ అంతు చిక్కని ఓ రహస్యాన్ని ఓ బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌గా నందమూరి కళ్యాణ్‌ రామ్‌ ఎలా చేధించాడనే ఇతివృత్తంలో సినిమా ఆద్యంతం సస్పెన్స్‌తో, థ్రిల్లింగ్‌,యాక్షన్‌ సన్నివేశాలతో ఉండనున్నట్లు తెలుస్తోంది

దేవర త్వరలో గ్లింప్స్‌ రాబోతుంది.

ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘దేవర’ గురించి మాట్లాడుతూ.. ‘‘తమ్ముడు అప్‌డేట్స్‌ చెప్పొద్దన్నాడు. కానీ, ఓ మాట చెప్పాలనుకుంటున్నా. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లాంటి సినిమా చేసిన తర్వాత నటులు, దర్శకుడు, నిర్మాతలకు తదుపరి చిత్రాల విషయంలో ఎక్కువ బాధ్యత ఉంటుంది. కథ, విజువల్స్‌.. ఇలా ఎందులోనైనా ఒకవేళ తప్పు జరిగితే మీరు ఊరుకుంటారా? మేం తెలిసి తప్పు చేయం. బాధ్యతగా తీసుకుని మిమ్మల్ని అలరించేందుకు ఎంతో కష్టపడతాం. త్వరలో గ్లింప్స్‌ రాబోతుంది. సంబంధిత పనులు జరుగుతున్నాయి. ‘దేవర’తో మీకో కొత్త ప్రపంచం చూపించబోతున్నాం. మేమంతా చర్చించుకుని గ్లింప్స్‌ రిలీజ్‌ డేట్‌ త్వరలో ప్రకటిస్తాం. అప్పటి వరకు ఓపిక పట్టండి’’ అని విజ్ఞప్తి చేశారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ‘దేవర’కు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, కల్యాణ్‌రామ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్‌ నటి జాన్వీకపూర్‌ టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడు. తొలి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న  ప్రేక్షకుల ముందుకు రానుంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !