మిచౌంగ్ ( Michaung Cyclone) తీవ్ర తుఫాన్ బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. కాసేపట్లో తుఫాను తీరాన్ని దాటనుంది. తుఫాను ప్రభావంతో ప్రస్తుతం ప్రకాశం, గుంటూరు, కృష్ణ, వెస్ట్ గోదావరిలో, విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, నెల్లూరు జిల్లాలో గాలుల తీవ్రత కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ వర్షాలు కొనసాగనున్నాయి. తుఫాను ఉత్తర దిశగా నెమ్మదిగా ముందుకు కదులుతోంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుండి 100 కిలోమీటర్లు కొన్నిసార్లు 110 కిలోమీటర్లు గాలులు వీచనున్నాయి. ముంపు ప్రాంతాల్లో సముద్రం కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని హెచ్చరించారు. ఇటు రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో కూడా వర్షాలు ఓ మోస్తారుగా కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు వర్షాలు కొనసాగనున్నాయి.
ఎడతెరపిలేని వర్షం !
మిచౌంగ్ ( Michaung Cyclone) ఎఫెక్ట్‌తో కోస్తాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. విజయవాడ నగరంతో పాటు ఉమ్మడి గుంటూరు, జిల్లా, కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి వర్షం పడుతోంది. నాగాయలంక మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల తీవ్రతకు నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లోకి వరదనీరు చేరింది. ఆ జిల్లాలో తీర ప్రాంతంలోని 9 మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. తిరుమలలోని గోగర్భం, పాపవినాశనం జలాశయాల గేట్లను తితిదే అధికారులు ఎత్తివేశారు. భారీగా చేరిన వరదనీటితో జలాశయాలు పూర్తిగా నిండిన కారణంగా ఒక్కో గేటును ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. వర్షం, గాలుల తీవ్రతకు బాపట్ల జిల్లాలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చినగంజాం మండలంలో 15 గంటలుగా సరఫరా లేదు. తుపాను ప్రభావంతో వీస్తున్న గాలుల తీవ్రతకు కొన్నిచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. భారీ వర్షాలతో పంటపొలాల్లోకి వరదనీరు చేరింది. దీంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈదురుగాలులకు వేలాది ఎకరాల్లో వరి, ఇతర పంటలకు నష్టం కలిగింది. పలుచోట్ల ధాన్యం బస్తాలు తడిసిపోయాయి.