నాగ చైతన్యకు థియేట్రికల్‌గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. బంగార్రాజు ఓకే అనిపిస్తూ సంక్రాంతి బరిలో కలెక్షన్లను బాగానే రాబట్టింది. థాంక్యూ, కస్టడీ చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి. అయితే థాంక్యూ టైంలోనే దూత అనే వెబ్ సిరీస్ సైతం ప్లాన్ చేశారు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. కానీ డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్‌లోకి అందుబాటులోకి వచ్చింది. మరి ఈ దూత కథాకమామీషు ఏంటో ఓ సారి చూద్దాం.
కథ
సాగర్ వర్మ అవధూరి (నాగ చైతన్య) ఫేమస్ జర్నలిస్ట్. సమాజంలో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. సొంతంగా సమాచార్ అనే పత్రికాసంస్థను ప్రారంభిస్తాడు. అతని వెనకాల రాజకీయ నాయకుడు చక్రపాణి (రఘు కుంచె) ఉంటాడు. ఈ ఇద్దరూ ఒకరికొకరు సాయంగా ఉంటారు. సాగర్ భార్య ప్రియ (ప్రియా భవానీ శంకర్) కూడా జర్నలిస్టే. అవినీతి పరుడు, నిజాయితీ లేని జర్నలిస్ట్ అయిన సాగర్.. తనకు పోటీగా వచ్చిన తోటి జర్నలిస్ట్ చార్లెస్ (శ్రీకాంత్ మురళి)ని సైడ్ చేస్తాడు. చార్లెస్ దక్కాల్సిన కుర్చీని సాగర్ లాక్కుంటాడు. చార్లెస్‌కు మతిస్థిమితం లేదని, పిచ్చోడయ్యాడని చెబుతాడు సాగర్. సాగర్‌కు ఓ సారి ఓ పేపర్ ముక్క కనిపిస్తుంది. ఆ పేపర్‌లో తనకు జరగబోయే ప్రమాదం గురించి ముందే రాసి కనిపిస్తుంది. ఆ పేపర్ కనిపించినప్పుడల్లా.. అందులో ఉన్నట్టుగానే ప్రమాదాలు జరుగుతాయి. అలా తన పెంపుడు కుక్క, కూతుర్ని కూడా పోగొట్టుకుంటాడు. సాగర్ వర్మకు ఎస్సై అజయ్ ఘోష్ (రవీంద్ర విజయ్), డీసీపీ క్రాంతి (పార్వతి)లతో ఈ కథలో ఉన్న లింక్ ఏంటి? అసలు ఆ పేపర్ సాగర్ కంట ఎందుకు పడుతుంది? ఆ పేపర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ అతేంద్రియ శక్తి ఏంటి? సాగర్ చివరకు ఏం చేశాడు? అన్నది కథ.
విక్రమ్‌కుమార్ టాలెంట్ !
దూత సినిమాకు ఇదీ కథ అని క్లియర్‌గా చెప్పలేం. కథ ముందుకు వెళ్తున్న కొద్దీ.. ఎపిసోడ్లు గడుస్తున్న కొద్దీ లేయర్లు లేయర్లుగా కథ బయటకు వస్తుంటుంది. ఏదో సూపర్ న్యాచురల్ పవర్ ఉందనే విషయం చూసే ప్రేక్షకుడికి అర్థం అవుతుంది. అది జర్నలిస్టులనే ఎందుకు పగబడుతుంది.. ఫ్యామిలీ మొత్తాన్ని ఎందుకు కబలించాలని చూస్తుందన్న విషయం ఓ పట్టాన అంతు చిక్కదు. ఆ శక్తి ఏంటి? ఆ శక్తి వెనుక ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అన్నది ఎంతో ఆసక్తికరంగా మారుతుంది. అలా మొదటి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకు అలా ఫోన్‌కు అతుక్కుపోయి చూసేలా ఉంటుంది ఈ దూత వెబ్ సిరీస్. విక్రమ్ కే కుమార్ అంటే ఇలాంటివి ఆశిస్తుంటారు జనాలు. 13బీ, మనం, 24 వంటి విభిన్న కాన్సెప్టులతో సినిమాలు తీసిన విక్రమ్ కే కుమార్ మేధస్సు మళ్లీ ఈ దూతలో కనిపిస్తుంది. ఎక్కడా లాజిక్ తప్పినట్టుగా అనిపించదు. గ్రిప్పింగ్‌గా సాగుతుంది. ప్రతీ సీన్‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. చిన్న చిన్న సీన్లకు కూడా కంటిన్యుటీ ఉంటుంది. ఒక సీన్‌కు ఇంకో సీన్‌కు ఎక్కడో లింక్ కలిపి ఉంటాడు. ఒక షాట్ కూడా వేస్టే అనిపించదు. దానికి కూడా ఏదో కారణం ఉండే ఉంటుందనేలా చూపించాడు విక్రమ్ కే కుమార్. భూమి గుండ్రం అన్నట్టుగా.. తిరిగి తిరిగి అందరినీ ఒకే చోటుకు తీసుకొచ్చి అల్లిన కథనం అదిరిపోతుంది. చివరకు ట్విస్టులు రివీల్ అవుతూ ఉంటే.. గూస్ బంప్స్ వచ్చేస్తుంటాయి. అప్పటి వరకు చూసిన పాత్రలన్నింటినికీ గతంతో ఒకే రకమైన సంబంధం ఉందని తెలియడం, అలా కథనాన్ని రాసుకోవడం బాగుంటుంది. దీన్ని సాధారణ రివేంజ్ డ్రామాలా కూడా రాసుకోవచ్చు. కానీ దర్శకుడు మాత్రం కొత్తగా ఆలోచించాడు. దానికి సూపర్ న్యాచురల్ అని యాడ్ చేశాడు. సస్పెన్స్, థ్రిల్లర్‌ను యాడ్ చేశాడు.
చాలా గ్రిప్పింగ్‌గా !
పోలీస్ ఇన్వెస్టిగేషన్‌ను చాలా డీటైలింగ్‌గా, ఎంతో గ్రిప్పింగ్‌గా అనిపిస్తుంది. ఇక కొన్ని సీన్లు ముందే ఊహిస్తే.. ఇంకొన్ని సీన్లు ఊహకు అందకుండా సాగుతాయి. విక్రమ్ కే కుమార్ తన రైటింగ్‌తో అందరినీ కట్టిపడేస్తాడు. టెక్నికల్‌గానూ ఈ టీం ది బెస్ట్ అనిపిస్తుంది. దూత అంతా కూడా రాత్రిపూట, వర్షంలోనే తీసినట్టుగా కనిపిస్తుంది. విజువల్స్ సినిమా మూడ్‌కు తగ్గట్టుగా సాగుతాయి. ఆర్‌ఆర్ కూడా ఎంగేజింగ్‌గా ఉంటుంది. సాగర్ వర్మ పాత్రలో నాగ చైతన్య ఓ కరప్టెడ్ జర్నలిస్ట్‌గా అద్బుతంగా నటించాడు. తన ఫ్యామిలీని కాపాడుకునే తండ్రిగా, ఏం చేయలేని నిస్సహాయస్థితిలో ఉండే తండ్రిగా నాగ చైతన్య చక్కగా నటించాడు. అవినీతి పరుడైన జర్నలిస్ట్ నుంచి నిజాయితీ గల మీడియా ప్రతినిధిగా మారే సాగర్ వర్మ కారెక్టర్‌లో నాగ చైతన్య అందరినీ ఆకట్టుకుంటాడు. డీఎస్పీ క్రాంతిగా పార్వతి ఎంతో హుందాగా, అద్భుతంగా కనిపించింది, నటించింది. అమృత (ప్రాచీ దేశాయ్), అజయ్ ఘోష్ (రవీంద్ర విజయ్), రాజా గౌతమ్, పశుపతి, తణికెళ్ల భరణి, తరుణ్ భాస్కర్ ఇలా ప్రతీ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మొదటి సారిగా తరుణ్ భాస్కర్ కొత్త పాత్రలో కనిపిస్తాడు. ఇక ఇందులో విక్రమ్ కే కుమార్ ప్రస్తుతం జర్నలిజంలో ఉన్న లొసుగుల గురించి విమర్శలు సంధించాడు. జర్నలిజం అనేది వ్యాపారంగా మారిందని కౌంటర్లు వేశాడు. జర్నలిజం గొప్పదనం చాటి చెప్పి.. ప్రస్తుతం దాని విలువలు ఎలా దిగజారిపోయాయో చాలా స్పష్టంగా చూపించాడు. రాజకీయ నాయకుల కొమ్ముకాసే జర్నలిజం, డబ్బుకోసం వాస్తవాల్ని అవాస్తవాలుగా చిత్రీకరించే జర్నలిజం మీద కౌంటర్లు వేశాడు విక్రమ్ కే కుమార్.
ఇది కేవలం వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.