‘‘నాన్నా.. నాకు అమ్మ ఉన్న కథ కావాలి.. ఎందుకు నాన్నా ఎప్పుడూ అమ్మ లేని కథలే చెప్తావ్.. అసలు అమ్మలేని కథ ఉంటుందా??’’ అన్న చిన్నారి ప్రశ్నకి సమాధానమే ‘హాయ్ నాన్న’. కథ. ప్రేమ, పెళ్లి, పిల్లలు ఈ లైఫ్ సర్కిల్ నలిగిపోయిన విరాజ్ (నాని), యష్ణ (మృణాల్ ఠాకూర్), మహి (‘బేబీ’ కియారా ఖన్నా)ల మానసిక సంఘర్షణే ‘హాయ్ నాన్న’.
విరాజ్ (నాని) ముంబైలో ఫేమస్ ఫొటోగ్రాఫర్. అతనికి ఆరేళ్ల కూతురు మహి (బేబీ కియారా ఖన్నా) అంటే పంచ ప్రాణాలు. మహి పుట్టుకతోనే ప్రాణాంతకరమైన వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. ఎప్పుడు చనిపోతుందో తెలియదు కాబట్టి కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. క్షణం క్షణం నరకాన్ని అనుభవిస్తుంటాడు విరాజ్. మహిని నిద్రపుచ్చేప్పుడు కథలు చెప్తుంటాడు విరాజ్. అయితే అమ్మలేని కథలే చెప్తుండటంతో.. నాకు అమ్మ ఉన్న కథే చెప్పమని మొండికేస్తుంది మహి. అమ్మ కథ చెప్తే మహి తట్టుకోలేదని.. చెప్పడానికి ఇష్టపడడు విరాజ్. దీంతో మహి ఇంట్లో నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో ప్రమాదం బారిన పడటంతో యష్ణ (మృణాల్ ఠాకూర్) కాపాడుతుంది. విరాజ్‌కి ఫోన్ చేసి మహిని అప్పగిస్తుంది. ఆ సందర్భంలో విరాజ్.. మహికి తన గతంలో ఉన్న అమ్మ కథని చెప్పాల్సి వస్తుంది. ఆ కథలో అమ్మ.. వర్ష (ఎవరనేది సస్పెన్స్) అయితే.. ప్రజెంట్ అమ్మగా యష్ణను ఊహించుకుని విరాజ్ చెప్పిన కథ వింటుంది మహి.
సో నేరేషన్...మోర్ ఎమోషన్ !
అయితే విరాజ్ చెప్పిన కథలో.. ధనవంతురాలైన వర్షని విరాజ్ తొలి చూపులో ప్రేమించడం.. పెళ్లి చేసుకోవడం.. కూతుర్ని కనడం.. ఆ తరువాత వర్షకి యాక్సిడెంట్ అవ్వడం.. భర్త, కూతుర్ని వదిలేసి ఆమె వెళ్లిపోవడంతోనే కథని ఆపేస్తాడు. ఆ తరువాత ఏమైంది? అసలు వర్ష ఎవరు? యష్ణ ఎవరు? విరాజ్‌తో ఎందుకు విడిపోయింది? పాపని ఎందుకు వదిలేసింది? ఆ పాప కారణంగా విరాజ్, వర్షల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అన్నదే ‘హాయ్ నాన్న’ అసలు కథ.అమ్మ గురించి ‘నాన్న’ నానీ చెప్పిన ఈ ప్రేమకథ చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. సున్నితమైన భావోద్వేగ కథలెప్పుడూ.. అందులో కనిపించే పాత్రలపైనే నిలబడతాయి. ఈ సినిమాలో విరాజ్, యష్ణ, మహి పాత్రలే కథకి కోర్ స్ట్రెంత్. ప్రేమించడం.. పెళ్లి చేసుకోవడం.. గొడవలు.. విడిపోవడాలు.. ‘హాయ్ నాన్న’ కథాంశం కొత్తదేమీ కాదు. జెర్సీ, సంతోషం, ఖుషీ ఇలా చాలా సినిమాల్లో కనిపించే కామన్ పాయింటే ఇది. కానీ ‘హాయ్ నాన్న’లో అమ్మ పాత్రని దర్శకుడు శౌర్యువ్ మలిచిన తీరు చాలా కొత్తగా అనిపిస్తుంది.తండ్రీ కూతుళ్ల ఎమోషన్‌కి పెద్ద పీఠ వేస్తూనే.. అమ్మకథలో మలుపుల్ని హృద్యంగా చూపించారు. విరాజ్ పాత్రలో నాని ఎంత విజృంభిస్తున్నా.. స్క్రీన్‌పై ఎమోషన్స్ అద్భుతంగా పండిస్తున్నా.. కథ ముందుకు వెళ్లే కొద్దీ... నాని ఏంటి?? మళ్లీ ఇలాంటి రొటీన్ సినిమానే చేస్తున్నాడేంటబ్బా అనుకునేలోపే.. యష్ణ- వర్ష పాత్రల తాలూకా ట్విస్ట్ రివీల్ అయ్యేసరికి.. నాని ఇందుకా? ఈ కథను ఒప్పుకున్నది అని అనిపిస్తుంది. ఆ ట్విస్టే సినిమాకి కీలకం.
దర్శకుడి ప్రతిభ అభినందనీయం !
జాగ్వార్, అర్జున్ రెడ్డి రీమేక్ చిత్రాలకు సహ దర్శకుడిగా పనిచేసిన శౌర్యువ్‌కి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చారు నాని. ఎంట్రీలోనే స్టార్ డైరెక్టర్ అనిపించుకోవడానికి శౌర్యువ్‌కి ‘హాయ్ నాన్న’ బంపరాఫర్ అనే చెప్పాలి. కథ చెప్పడంలో ఒక్కో దర్శకుడిది ఒక్కో శైలి. అయితే ఈ కొత్త దర్శకుడు కథ చెప్పడంలో ఎక్కడా కన్ఫ్యూజ్ కాలేదు. కథను మొదలు పెట్టిన విధానం.. క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ వరకూ కాలయాపన చేయకుండా ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీకి వచ్చాం అనే ఫీల్‌ని కలిగించారు. అసభ్యతకి తావు ఇవ్వకుండా.. అక్కర్లేని రొమాన్స్, హింసల్ని జనానికి ఎక్కించకుండా కథని నీట్‌గా ప్రజెంట్ చేశారు. కథలో మెయిన్ పాయింట్ రివీల్ అయిన తరువాత.. కథ వేగం తగ్గింది. నానినే కదా.. ఎంత ఎమోషన్స్ పిండితే అంతా బాగా చూస్తారని అనుకున్నారో.. లేదంటే అమ్మ కథ కాబట్టి.. కథ చెప్పినట్టే ఉండాలని అనుకున్నారో ఏమో కానీ.. స్పూన్ ఫీడిరగ్ సీన్ల వల్ల కథ సాగిదీస్తున్నట్టుగా అనిపిస్తుంది. పోనీ ఆ సీన్లు లేపేస్తే.. అంతకుమించి చెప్పేదీ, చూపించేది ఏమీ కనిపించకపోవడంతో స్లో నెరేషన్ ఈ సినిమాకి పెద్ద మైనస్ అయ్యింది. కథ పడుతూ లేస్తూ సాగింది. ఇంటర్వెల్ ట్విస్ట్‌తో కథ కుదురుకుని.. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌తో కుదురుకుంది.
విరాజ్‌గా అదరగొట్టిన నాని !
జెర్సీ సినిమాలో ‘‘ఈ ప్రపంచంలో నన్ను జడ్జ్ చేయని వాడు నా కొడుకు ఒక్కడే.. వాడికి నేను కొంచెం తగ్గినా తట్టుకోలేను’’ అనే డైలాగ్ మాదిరే.. ఈ సినిమాలో కూడా.. ‘ఈ ప్రపంచంలో ఎవరేమనుకున్నా పర్లేదు.. ఒక్క నా కూతురు తప్ప’ అనే డైలాగ్ ఉంది. ఈ రెండిరటికీ డైలాగ్స్ పరంగానే కాకుండా క్యారెక్టర్స్ పరంగా కూడా పోలికలు కనిపిస్తాయి. పాత్రల పరంగా.. నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఆయా పాత్రల్లో జీవించేశారు. ముగ్గురూ పోటీ పడి నటించారు. ఈ ముగ్గురి కాంబోలో సీన్లు అయితే.. గుండెల్ని పిండేస్తాయి. ఏ పాత్ర చేసినా నానిని మర్చిపోయి తెరపై పాత్రను మాత్రమే గుర్తించుకునేట్టు చేయడం నేచురల్ స్టార్ నాని ప్రత్యేకత. ఈ సినిమాలో కూడా విరాజ్ పాత్రలో ఒదిగిపోయాడు. ఆరేళ్ల కూతురికి తండ్రిగా నటించడం కాదు.. జీవించేశాడు. ముఖ్యంగా కూతుర్ని ఎలాగైనా బతికించుకోవాలనే తపన, బాధ, దు:ఖాన్ని కళ్లలోనే చూపించాడు. ఏడుపు సీన్లు ఎవరుపడితే వాళ్లు చేస్తే ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. ఏడుపులో ఎంతో అందంగా కనిపించే మల్టీ లేయర్స్ ఉన్న పాత్రలో మృణాల్ ఠాకూర్ అద్భుతంగా చేసింది. సీతారామం తరహాలో మరోసారి గుర్తిండిపోయే పాత్ర చేసింది. హీరోయిన్స్‌ని గ్లామర్ డాల్‌గా మాత్రమే చూపిస్తున్న ప్రజెంట్ ట్రెండ్‌లో మరోసారి తన పాత్రపైనే నడిచే రోల్‌ని దక్కించుకోవడమే కాకుండా.. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది మృణాల్ ఠాకూర్. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. చిన్నారి బేబీ కియారా అయితే సినిమాకి ప్రధాన బలం. సినిమాకి మెయిన్ స్ట్రెంత్ అయిన కోర్ ఎమోషన్‌ని పండిరచడంలో పాప జీవించేసింది. నిజానికి చిన్నపిల్లలతో నటింపజేయడమే కష్టం.. అలాంటిది ఎమోషనల్ సీన్లు అంటే అంతకంటే కష్టం. కానీ ఈ సినిమాలో ఎమోషన్ సీన్లలో కనికట్టు చేసినట్టుగా నటించింది బేబీ కియారా. డైలాగ్‌లు ఎలాంటి తడబాటు లేకుండా విత్ ఎమోషన్స్‌తో నానితో పోటీ పడి నటించింది చిన్నారి. చాలా సీన్లలో ఈ తండ్రీ కూతుళ్లు ఎమోషన్స్‌తో పిండేశారు. ఏడిపించారు. సీనియర్ నటుడు జయరామ్ పాత్ర కూడా ట్విస్ట్‌లతో సాగుతుంది. క్లైమాక్స్‌లో కథని మలుపు తిప్పే పాత్రలో నటించారు. అతను హీరోకి తండ్రా?? లేక హీరోయిన్ తండ్రా అన్నది కథలో చిన్న ట్విస్ట్. హీరో ఫ్రెండ్ రోల్‌లో ప్రియదర్శికి మంచి పాత్రే దక్కింది. అయితే ఈ సినిమాలో కామెడీకిపెద్దగా స్కోప్‌లేదు కాబట్టి.. తన పాత్రకి న్యాయం చేశాడు ప్రియదర్శి. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ ఉంది. ఉందంటే ఉందంతే.. మెరుపుతీగలా ఓ సీన్‌లో అలా కనిపించి మాయం అవుతుంది. ఇంకో సాంగ్‌లో కనిపిస్తుంది. హీరోయిన్‌కి ప్రియుడిగా.. డాక్టర్‌గా బాలీవుడ్ నటుడు అంగద్ బేడీ ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించాడు. విరాజ్ అశ్విన్ (బేబీ ఫేమ్) ఉన్నాడు కానీ.. అతని పాత్రకి పెద్దగా స్కోప్ లేదు. క్లైమాక్స్ సీన్‌లో మాత్రమే అంగద్ బేడీ, విరాజ్ అశ్విన్‌లకు ఒక బలమైన సీన్ పడిరది. మ్యూజిక్ పరంగా.. హేషమ్ అబ్దుల్ వాహబ్ పర్వాలేదు. సమయమా సాంగ్‌ని సినిమా మొత్తం ఏదో సందర్భంలో వాయిస్తూనే ఉన్నారు. సాంగ్స్ వరకూ ఓకే కానీ.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ‘ఖుషీ’ సినిమాలో విన్నట్టుగానే అనిపిస్తాయి. సాను జాన్ వర్గీస్ కెమెరా వర్క్ ప్లస్ అయ్యింది. నానిని కొత్తగా చూపించారు. హీరోయిన్‌ని రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో డిఫరెంట్‌గా చూపించారు. ముంబై, గోవా లొకేషన్స్‌ని అందంగా మలిచారు.
ఇది కేవలం వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.