Revanth Reddy : 7 న తెలంగాన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం !

0

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడిరది. సీఎం పదవికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో పార్టీ అగ్రనేతలతో జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ పరిణామాలు, సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు చెప్పిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అధిష్ఠానం రేవంత్‌ను సీఎల్పీ నేతగా ఎంపిక చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ దిల్లీలో ప్రకటించారు. డిసెంబర్‌ 7న ఆయన ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తారని జోరుగా ప్రచారం జరిగినప్పటికీ, కాంగ్రెస్‌ అధిష్ఠానం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో ఇప్పటివరకు ప్రతిష్టంభన కొనసాగుతూ వచ్చింది. గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో సమావేశమైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా సీఎల్పీ ఎంపిక నిర్ణయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగిస్తూ సోమవారం ఏక వాక్య తీర్మానం చేశారు. దీన్ని భట్టి విక్రమార్క, సీతక్కతోపాటు పలువురు ఎమ్మెల్యేలు బలపరిచారు. సీఎల్పీ తీర్మానాన్ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ అధిష్ఠానానికి  చేరవేశారు. దీనిపై ఇవాళ సుదీర్ఘంగా చర్చించిన అగ్రనేతలు రేవంత్‌ను సీఎంగా ఎంపిక చేశారు. మంత్రివర్గంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

రేవంత్‌ రాజకీయ ప్రస్థానం ఇలా..

అనుముల రేవంత్‌రెడ్డి నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో 1968 నవంబరు 8న జన్మించారు. తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, రాంచంద్రమ్మ. వనపర్తిలో పాలిటెక్నిక్‌ చేశారు. తొలుత 2002లో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ పార్టీలో కొంతకాలమే కొనసాగారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారి 2006లో జడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. తన సొంతూరైన కొండారెడ్డిపల్లి అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నా.. కల్వకుర్తి నియోజకవర్గంలోని మిడ్జిల్‌ మండలంలో అధికార కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి.. జడ్పీటీసీ సభ్యునిగా గెలుపొందడం విశేషం. అనంతరం 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌లో దాదాపు 100 ఓట్ల ఆధిక్యమున్న అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని ఓడిరచారు.

ఆ తర్వాత 2008లో రేవంత్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి బరిలో దిగిన ఆయన.. కాంగ్రెస్‌ అభ్యర్థి గురునాథ్‌రెడ్డిపై 6,989 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో 14,614 ఓట్ల ఆధిక్యంతో రెండోసారి అక్కడే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలుగుదేశం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, శాసనసభా పక్ష నేతగా తెలంగాణ అసెంబ్లీలో భారాసకు వ్యతిరేకంగా పోరాడారు. 2017లో కాంగ్రెస్‌లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ.. 2019 మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2021లో పీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రేవంత్‌..  కాంగ్రెస్‌ పార్టీకి కొత్త ఊపును తీసుకొచ్చి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హెలికాప్టర్‌లో సుడిగాలి పర్యటనలతో నెల రోజుల్లో ఏకంగా 83 ప్రచార సభలో పాల్గొన్నారు. తన కొడంగల్‌ స్థానంలో గెలవడమే కాకుండా పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడమే లక్ష్యంగా ప్రచారం చేసి కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !