T Congress : కాంగ్రెస్‌ విజయం వెనుక ప్యూహకర్త సునీల్‌ !

0

తెలంగాణ కాంగ్రెస్‌ విజయంలో కీలక సూత్రధారి సునీల్‌ కనుగోలు. పార్టీ హైకమాండ్‌ - రేవంత్‌తో సహా పార్టీ నేతలను ఒక తాటిపైకి తీసుకొచ్చి, తన వ్యూహాలను నాయకులతో ప్రజల ముందుకు తెచ్చి తెర వెనుక కనబడని పాత్రగా నిలిచింది  మాత్రం సునీల్‌ కనుగోలు. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీకి విజయం కట్టబెట్టిన సునీల్‌కే కాంగ్రెస్‌ తెలంగాణ బాధ్యతలను అప్పగించింది. బీఆర్‌ఎస్‌ బలాలు- బలహీనతలు పూర్తిగా అధ్యయనం చేసిన సునీల్‌.. పార్టీ ఎన్నికల నినాదాలు..పథకాలతో సహా అభ్యర్దులు ఎంపిక.. ప్రచారం వరకు అన్నీ తానై వ్యవహరించారు. పార్టీని గెలుపు తీరాలకు చేర్చారు.

కలిసొచ్చిన సునీల్‌ వ్యూహాలు 

సునీల్‌ కనుగోలు ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ ఎలక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఈయన బళ్ళారిలో తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించారు. చెన్నైలో చదువుకున్నారు. అమెరికాలో ఏంబీఏ చేశారు. అక్కడే ఓ కన్సల్టెన్సీ సంస్థలో పనిచేశారు. అసోసియేషన్‌ ఆఫ్‌ బ్రిలియంట్‌ మైండ్స్‌ (ఏబీఎం) కు సహవ్యవస్థాపకుడిగా రాజకీయ వ్యూహకర్త ప్రయాణం మొదలుపెట్టారు. తొలుత బీజేపీ కోసం పని చేసారు. 2014లో నరేంద్రమోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేయడానికి ప్రశాంత్‌ కిషోర్‌ తీసుకువచ్చిన సిటిజెన్స్‌ ఫర్‌ అకౌంటబుల్‌ గవర్ననెన్స్‌ (సీఏజీ)లో సునీల్‌ భాగస్వామిగా ఉన్నారు. అయితే 2022లో ప్రశాంత్‌ కిషోర్‌ కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నం చేశాక, సునీల్‌ కనుగోలు కూడా అదే పార్టీలో చేరారు. 

అన్నీ తానై పార్టీని నడిపించి...

బీజేపీతో తన అనుబంధానికి భిన్నంగా సునీల్‌ కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీకి చేరువయ్యారు. 2022లో కాంగ్రెస్‌ పార్టీ కీలక ఎన్నికల వ్యూహకర్తగా నియమితులయ్యాక సోనియాగాంధీ ఈయనను 2024 లోక్‌సభ పోల్స్‌ టాస్క్‌ ఫోర్స్‌ సభ్యునిగా నియమించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయంతో వ్యూహకర్తగా సునీల్‌ తన తొలి విజయాన్ని నమోదు చేసుకున్నారు. ముఖ్యంగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ మధ్య సీఎం సీటు కోసం ఉన్న పోటీ పార్టీపై ప్రభావం చూపకుండా జాగ్రత్త పడటంతో ఆయన విజయం సాధించారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బొమ్మైపై 40 శాతం కమీషన్‌ తీసుకుంటున్నారంటూ కర్ణాటక కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ చేసిన ఆరోపణలను కాంగ్రెస్‌ ప్రచారాస్త్రంగా మార్చడంలో సునీల్‌ సఫలమయ్యారు. 

సామాన్యులే టార్గెట్‌గా...వ్యూహాలు !

పేసీఎం’ పేరుతో సామాన్యుల వరకు ఈ ప్రచారాన్ని తీసుకువెళ్ళారు. అలాగే అమూల్‌ వర్సెస్‌ నందినీ డెయిరీ వ్యవహారాన్ని కన్నడిగుల ఆత్మగౌరవంతో ముడిపెట్టడంతో సునీల్‌ వ్యూహాలు బలంగా పనిచేశాయి. అన్నింకంటే ముఖ్యంగా సామాన్యుడిని మెప్పించేలా కాంగ్రెస్‌ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోలో సునీల్‌ బృందం పాత్ర ఉంది. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, గ్యాస్‌ సబ్సిడీ తదితర ప్రజాకర్షక పథకాల వెనుక సునీల్‌ ఉన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ గెలవగానే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సునీల్‌ కనుగోలును తన సలహాదారుగా నియమించుకుని కేబినెట్‌ ర్యాంక్‌ ఇచ్చారు. తెలంగాణలోనూ కాంగ్రెస్‌ పార్టీ సామాన్యల మనసు గెలుచుకునేలా మేనిఫెస్టో రూపొందించడంలో సునీల్‌ పాత్ర ఉంది. సీఎం కేసీఆర్‌ బీజేపీతో కుమ్మక్కయ్యారని ప్రచారం చేసి, మైనార్టీలు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపేలా చేయడంలోనూ సునీల్‌ సక్సెస్‌ అయ్యారు. చివరగా పార్టీ గెలుపులో సునీల్‌ సక్సెస్‌ అయ్యారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !