త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనుండడంతో, పదవుల పంపిణీ ద్వారా కాంగ్రెస్ పార్టీలో జోష్ తేవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. లోక్‌సభ అభ్యర్థుల విషయంలోనూ ఇప్పటికే ఒక జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో గ్రేటర్ హైదరాబాద్‌కే తొలి ప్రాధాన్యం ఇస్తారని సమాచారం.హైదరాబాద్ నగరంలోని నియోజకవర్గాల నుంచి హస్తం పార్టీ అభ్యర్థులు ఎవరూ ఎన్నికల్లో గెలవలేదు. అయినప్పటికీ నాంపల్లిలో ఓడిపోయిన ఫిరోజ్‌ఖాన్, మైనార్టీ కోటాలో పోటీలో ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ స్థానంలో ఓటమి చెందిన షబ్బీర్ అలీకి మంత్రి పదవి ఓకే అయితే, ఫిరోజ్‌ఖాన్‌కు అవకాశాలు ఉండవని తెలుస్తోంది. మల్కాజిగిరి నుంచి పరాజయం చెందిన మైనంపల్లి హన్మంతరావు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఒకవేళ ఆయనను మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దింపాలనే ఆలోచన ఉన్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. మధుయాస్కీ(ఎల్బీనగర్), అంజన్‌కుమార్ యాదవ్(ముషీరాబాద్)లు కూడా ఎన్నికల్లో ఓటమి చెందినా, వారి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.
ఒక్కరికే ఎన్ని అవకాశాలు ఇస్తారు ?
కాంగ్రెస్‌లో ఆశావాహుల సంఖ్య చాతాండంత ఉంది. ఇప్పటికే పార్టీ టికెట్ల విషయంలో చాలా మంది నాయకులకు తీవ్ర అన్యాయం జరిగింది. అలాంటి వారి త్యాగాలను గుర్తించి రాబోయే ఎన్నికల్లో ఎమ్మేల్సీ స్థానాల్లో వారినే ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సీనియర్ల పేరుతో ఇచ్చిన వారికే అవకాశాలు ఇచ్చుకుంటూ పోతే ఇక మిగిలిన నాయకులకు, ద్వితీయ, తృతీయ స్థాయి నాయకులుకు అవకాశాలు దక్కేది ఎప్పుడు ? ఒక్కొక్కరికీ ఒక్క అవకాశం చాలు అని నినాదం కాంగ్రెస్ నాయకుల నుండి బలంగా వినిపిస్తోంది. ఎమ్మేల్యేలుగా పార్టీ అవకాశం ఇచ్చినా ప్రజల తిరస్కరణకు గురై, ఓడిపోయిన నాయకులకు మళ్ళీ మళ్ళీ దొడ్డిదారిన అవకాశాలు కల్పిస్తూ ఉంటే అసలు అవకాశం రాని నాయకులు మాటేమిటి ? అంటూ కాంగ్రెస్ నాయకులు వాపోతున్నారు. మిగిలిన వారికి న్యాయం జరిగేది ఎప్పుడు అంటున్నారు.
ఓడిపోయిన వాళ్ళకు మంత్రి పదువులు ఎందుకు ?
ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఉండగా, ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులకు మంత్రి పదవులు ఎందుకు ? ప్రజలు తిరస్కరించారు అంటే ప్రజల్లో వారిపట్ల విశ్వాసం లేదు అని అర్థం. అలాంటిది మళ్ళీ వారినే తీసుకొచ్చి ప్రజల నెత్తిమీద కూర్చుండబెడతాం అంటే ఎలా ? అంటే ప్రజల్లో గెలిచిన నాయకులకు విలువ లేదా ? ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఎన్నికల క్షేత్రం ప్రజల మెప్పు పొందిన నాయకులను ప్రక్కన బెట్టి ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులకు పదవులు కట్టబెట్టడం ఏంటని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఓడిపోయిన వారికి రాజకీయ పునరావాసం కల్పించాలనుకుంటే నామినేటెడ్ పోస్టులు ఇచ్చి గౌరవించుకోవాలి కానీ ఇక ఇతరులకు ఏమాత్రం అవకాశాలు రాకుండ ా విశ్వసనీయత పేరుతో, లాబియింగ్‌ల పేరుతో మళ్ళీ మళ్ళీ పదవులు ఆశిస్తుంటే ఇతర ద్వితీయస్థాయి నాయకుల భవిష్యత్తు ఏం కావాలి అంటూ ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులే వాపోతున్నారు.
గడ్డం సోదరుల మధ్యే మంత్రి పదవికి పోటీ
మిగిలి ఉన్న 6 మంత్రి పదవులకు తీవ్రమైన పోటీ ఉంది. ఆదిలాబాద్ నుంచి గడ్డం వినోద్, వివేక్ సోదరుల మధ్యే మంత్రి పదవికి పోటీ నెలకొంది. ఇద్దరూ దిల్లీలో అగ్రనేతలను కలిసినట్లు తెలుస్తోంది. తనకు అవకాశం ఇస్తారని వివేక్ ధీమాతో ఉన్నారు. వీరిద్దరిలో ఒకరికి అవకాశం ఉండొచ్చు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పేరు పరిశీలనలో ఉంది. అలాగే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు మంత్రి పదవి రేసులో ఉన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మేల్యే మదన్‌మోహన్‌రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఐటి మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయిన ప్రచారం జరిగింది. ఈయన రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితుడు అన్న పేరుంది. అలాగే రేవంత్‌రెడ్డికి అత్యంత విధేయుడు అన్న కారణంతో మంత్రి పదవి అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అదే సమయంలో కీలకమైన హోం శాఖ ఎవరికైనా అప్పగిస్తారా లేక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దనే ఉంచుకుంటారా అనే చర్చ కూడా సాగుతోంది. ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు ఏడాది పాటు ఏ పదవి ఇవ్వకూడదని, పార్టీ యోచిస్తున్నట్టు కూడా మరోపక్క ప్రచారం జరుగుతోంది. దాన్నే అమలు చేస్తే మాత్రం ఓటమి చెందిన వారికి మంత్రి పదవులు దక్కే అవకాశం లేదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.