T Elections 23: తెలంగాణ కాంగ్రెస్‌ హస్తగతం !

0

  • ముందుండి నడిపించిన రేవంత్‌రెడ్డి.
  • కుమ్ములాటలు ప్రక్కన పెట్టి గెలుపుపైనే దృష్టి పెట్టిన నాయకులు.
  • కలిసొచ్చిన సునీల్‌ కనుగోలు వ్యూహాలు !

కాంగ్రెస్‌ అంటే అంతర్గత కుమ్ములాటలు... ప్రతి అభ్యర్థి ముఖ్యమంత్రి అభ్యర్థే... నిత్యం అసమ్మతికి పెట్టింది పేరు.. ఏడాది క్రితం జరిగిన మునుగోడు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి డిపాజిట్‌ గల్లంతు.. ఇటువంటి పరిస్థితి నుంచి మెరుపువేగంతో బయటపడి కాంగ్రెస్‌  తెలంగాణలో తొలిసారి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. పార్టీ అగ్ర నాయకత్వం నుంచి కింది స్థాయి కార్యకర్త వరకూ తాడోపేడో తేల్చుకునేందుకు అధికార పక్షంతో యుద్ధమే చేశారు. ఆ పోరాట ఫలాలను ఇప్పుడు విజయం రూపంలో ఆస్వాదిస్తోంది.

ప్రజల నాడి పట్టి.. హామీలు అందించి..

తెలంగాణలో ప్రజల నాడిని తెలుసుకోవడంలో కాంగ్రెస్‌ విజయవంతమైంది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి వంటి కీలక హామీల అమలుపై ప్రజలు పెదవి విరుస్తున్న సమయంలో హస్తం పార్టీ సరికొత్త వాగ్దానాలతో ప్రజల ముందుకు వచ్చింది. ఈ విషయంలో కర్ణాటకలో విజయవంతమైన ఫార్ములానే తెలంగాణలో పునరావృతం చేసింది. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఇచ్చిన ఆరు వాగ్దానాలను అమలు చేస్తామని ప్రజలను మెప్పించడంలో విజయం సాధించింది. వీటిల్లో మహిళలకు ప్రతినెలా రూ.2,500.. రూ.500కే వంట గ్యాస్‌.. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వంటివి గతంలో ఏ పార్టీ ఇవ్వలేదు. రైతు భరోసా పెంపుతోపాటు.. కౌలు రైతులకు, భూమిలేని నిరుపేదలకు రూ.12 వేలు ప్రకటించారు. గతంలో తమకు రైతు బంధు అందేది కాదని అసంతృప్తితో ఉన్న ఈ వర్గాలను కాంగ్రెస్‌ ఇచ్చిన హమీ ఆకట్టుకుంది. ఇక చేయూత పింఛన్లు రూ.4,000కు పెంపు, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద రూ.10లక్షల వైద్యం, గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇళ్ల పథకం, రూ.5 లక్షల విలువైన విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ స్కూళ్ల ఏర్పాటు వంటివి యువత నుంచి సాధారణ ప్రజల వరకూ పలువురిని ఆకట్టుకొన్నాయి.

నిరుద్యోగులకు ఊరటనిస్తామన్న భరోసా..  

తెలంగాణ ఉద్యమానికి మూలం నీళ్లు, నిధులు, నియామకాలు. ఇంతటి ప్రాముఖ్యమున్న ‘నియామకాల’ అంశంలో గత ప్రభుత్వం భారీగా విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తాయి. టీఎస్‌పీఎస్‌సీ పరీక్షల్లో డజనుకుపైగా లీకులు చోటు చేసుకోవడంతో దాదాపు 30లక్షల మందికిపైగా అభ్యర్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఈ అంశాన్ని కాంగ్రెస్‌ పార్టీ సమర్థంగా భుజానికెత్తుకొంది. అధికార పక్ష లోపాలను బలంగా యువతలోకి తీసుకెళ్లింది. తాము అధికారంలోకి వచ్చాక ఏడాదిలో రెండు లక్షల పోస్టులు భర్తీ చేస్తామని.. గ్రూప్‌ 1,2,3,4 నియామక ప్రక్రియల వివరాలను తేదీలతో సహా ప్రకటించింది. ఈ అంశం యువతను బాగా ప్రభావితం చేసింది. కాంగ్రెస్‌ విజయానికి అత్యంత బలంగా పనిచేసిన కారణాల్లో ఇది ప్రధానంగా నిలిచింది.

సిట్టింగ్‌లపై వ్యతిరేకత..

అభ్యర్థుల ఎంపికలోనే సగం విజయం దాగి ఉంటుంది. ఈ విషయాన్ని బీఆర్‌ఎస్‌ మరిస్తే.. కాంగ్రెస్‌ మాత్రం తూ.చ. తప్పకుండా పాటించింది. తెలంగాణలో దాదాపు 40 మంది వరకు బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేలు ఘోషించాయి. కానీ, వీరిని తప్పించి కొత్తవారికి అవకాశం ఇస్తే.. అంతర్గత కుమ్ములాటలకు బీజం పడుతుందని ఆ పార్టీ అధినాయకత్వం భావించింది. ఈ వ్యతిరేకతను కేసీఆర్‌ చరిష్మా అధిగమిస్తుందనుకొంది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందుగానే దాదాపు అందరు సిట్టింగ్‌లకు టికెట్లను ఖరారు చేశారు. మరోవైపు కాంగ్రెస్‌ మాత్రం అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొంది. అన్ని రకాల సర్వేలు పరిగణనలోకి తీసుకొని.. పలు దశల్లో అభ్యర్థుల పేర్లను వడగట్టి దిల్లీలో తుది జాబితాను ఖరారు చేయడం ఇప్పుడు ఫలితాన్నిచ్చింది. సొంత గూటికి వచ్చిన వారిని,  భాజపా, బీఆర్‌ఎస్‌ల్లోని అసంతృప్తులైన తుమ్మల, పొంగులేటి, వివేక్‌, కోమటి రెడ్డి రాజగోపాల్‌, జూపల్లి కృష్ణారావు వంటి గెలుపు గుర్రాలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించి టికెట్లు ఇచ్చింది. ఇక ఎన్నికల వార్‌రూమ్‌లోని వ్యూహకర్త సునీల్‌ కనుగోలు సర్వేలు, వ్యూహాలు పార్టీకి మరింత బలం చేకూర్చాయి.

పదేళ్ల తర్వాత ఉండే ప్రభుత్వ వ్యతిరేకత.. 

పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ ఇమేజ్‌తో బీఆర్‌ఎస్‌కు పదేళ్ల పాటు ప్రజలు పట్టంకట్టారు. దీంతో సహజంగానే ప్రజలు మార్పు కోరుకున్నారు. ప్రజానాడిని గమనించిన కాంగ్రెస్‌ అధినాయకత్వం పార్టీలోని అంతర్గత విభేదాలను సద్దుమణిగేలా చేసింది. రేవంత్‌ రెడ్డి సహా ఎవరూ తామే ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పి వివాదాలకు కారణం కాలేదు. పద్ధతి ప్రకారమే నాయకుడి ఎంపిక ఉంటుందని సీనియర్లతో కూడా చెప్పించగలిగారు. ఈ పరిణామం పార్టీ ఐకమత్యాన్ని బలంగా తెలియజేసింది. ఈ క్రమంలోనే భారాసకు బలమైన ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ను ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో రేవంత్‌ రెడ్డి విజయం సాధించారనే చెప్పాలి. ఇది తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయమని.. సర్వశక్తులు ఒడ్డి పోరాడాలని పార్టీ నాయకులు కార్యకర్తలను సమాయత్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను అడిగి.. ఒప్పించగలిగారు. గాంధీ భవన్‌లో నిత్యం పార్టీ సీనియర్లు ప్రెస్‌మీట్లు పెట్టి అధికార పక్షం వైఫల్యాలను ఎత్తి చూపడం ప్రజలపై బాగానే ప్రభావం చూపింది.

కేసీఆర్‌ను ఢీకొట్టే నేతగా రేవంత్‌..!

తెలంగాణలో కేసీఆర్‌ను ఢీకొట్టే విషయంలో రేవంత్‌ రెడ్డి చాలా దూకుడుగా వ్యవహరించారు. టికెట్ల పంపిణీ విషయంలో పార్టీపై వచ్చిన విమర్శలను తన మాటకారితనంతో సమర్థంగా తిప్పికొట్టారు. కాంగ్రెస్‌లో రేవంత్‌లా అధికార బీఆర్‌ఎస్‌పై ఎవరూ ఎదురుదాడి చేయలేదంటే అతిశయోక్తి కాదేమో. మరోవైపు రేవంత్‌కు పార్టీ అధిష్ఠానం స్వేచ్ఛను ఇచ్చింది. కామారెడ్డిలో తీవ్రమైన పోటీ ఉంటుందని తెలిసినా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌నే ఓడిస్తానని రేవంతే నేరుగా బరిలోకి దిగడం అభిమానుల్లో ఆయనకు భారీ ఫాలోయింగ్‌ను తీసుకొచ్చింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా పార్టీ అధినాయకత్వాన్ని సరైన దిశలో తీసుకెళ్లడంలో సఫలమయ్యారు. ప్రచారంలో కూడా రేవంతుడి సభలకు ప్రజలు పోటెత్తారు. చాలా చోట్ల ఇవి జనసంద్రాలను తలపించాయి. తను ఒక్కడే రాష్ట్రవ్యాప్తంగా హెలికాప్టర్‌లో సుడిగాలి పర్యటనలు చేసి 50కిపైగా సభలను నిర్వహించారంటే అర్థం చేసుకోవచ్చు. ఓ రకంగా పార్టీకి ఏకైక స్టార్‌ క్యాంపెయినర్‌గా రేవంతుడు నిలిచారని చెప్పొచ్చు.

ప్రభుత్వ వ్యతిరేకతను చీలనీయని కాంగ్రెస్‌..

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కాంగ్రెస్‌ చాలా జాగ్రత్త తీసుకొంది. దాదాపు 50కిపైగా పౌర సంఘాలను తెలంగాణ విద్యావంతుల వేదిక ఛత్రం కిందకు తీసుకొచ్చి అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయించగలిగింది. బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే.. భాజపాకు ఓటేసినట్లే అన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ముఖ్యంగా మైనార్టీ ఓట్లను పార్టీకి తీసుకురావడానికి ఇది బాగా ఉపయోగపడిరది. దీనికి తోడు కమ్యూనిస్టు పార్టీలు కూడా బీఆర్‌ఎస్‌కు దూరం కావడం కాంగ్రెస్‌కు అనుకూలంగా మారింది.

దీటుగా ప్రచారం..

రాహుల్‌ భారత్‌ జోడో యాత్రలో తొలిసారి హస్తం పార్టీకి తెలంగాణలో అవకాశం ఉందన్న విషయాన్ని పార్టీ అధినాయకత్వం గ్రహించింది. దీంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌కు పార్టీ కీలక నేతలైన సోనియాగాంధీ, రాహుల్‌, ప్రియాంక, ఖర్గేలు బలమైన మద్దతుదార్లుగా నిలిచారు. వారే స్వయంగా రంగంలోకి దిగి పార్టీ తరపున హోరాహోరీగా ప్రచారం చేశారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని రూఢీ చేసుకొన్న వెంటనే కాంగ్రెస్‌ ప్రచారంలో గేరు మార్చింది. అక్టోబర్‌ తొలి వారం తర్వాత ఆన్‌లైన్‌ యుద్ధానికి తెరతీసింది. భారాసకు దీటుగా ప్రత్యేకమైన పాటలను, ప్రచార గీతాలను తీసుకొచ్చింది. సోషల్‌ మీడియాలో వీటిని విపరీతంగా ప్రచారం చేసింది. ఇక్కడ సునీల్‌ కనుగోలు మరోసారి పార్టీకి బలమైన అండగా నిలిచారు. పార్టీ వార్‌రూమ్‌లో ఆయన రేవంత్‌ రెడ్డితో కలిసి సోషల్‌ మీడియా ప్రచారాన్ని డిజైన్‌ చేశారు. ఆఫ్‌లైన్‌లో పార్టీ ప్రచారం ఏస్థాయిలో ఉందో.. ఆన్‌లైన్‌లోనూ అదే స్థాయిలో ఉంది. ఈ క్రమంలో అధికార భారాసపై  వీడియోలు, మీమ్స్‌, జిఫ్‌లు, పోస్టర్లతో భారీ ఎత్తున ప్రచారం చేసింది. కాంగ్రెస్‌ తరపున దాదాపు 200 మంది సభ్యుల బృందం ట్విటర్లో 24 గంటలూ ప్రచారం చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. ‘‘కారుపోవాలి.. హస్తం రావాలి’’,  ‘‘మార్పు కావాలి’’ స్లోగన్లు, భారాస పేరడీ సాంగ్స్‌ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ వ్యూహాలు ఫలించి తెలంగాణ ‘హస్త’గతమైంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !