- వివరాలు డీలీట్ ఐతే ప్రత్యామ్నాయం లేదు.
- ఫిజికల్ కాపీలు లేకుండా డిజిటలైజేషన్.
- ఎన్‌ఐసీని కాదని ప్రైవేట్‌కు బాధ్యతలు.
- నివేదిక కోరిక సిఎం.
భూముల డేటా నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు కంపెనీకి అప్పగించడం వెనక ఆంతర్యమేమిటనే అంశంపై రేవంత్ సర్కారు దృష్టి పెట్టింది. ఎన్‌ఐసీ వంటి సంస్థను కాదని.. టెర్రాసిస్ టెక్నాలజీస్ అనే కంపెనీకి కట్టబెట్టడం వెనుక వ్యూహాన్ని పసిగట్టే పనిలో నిమగ్నమైంది. ఆ కంపెనీని విదేశీ కంపెనీ ఎందుకు కొనుగోలు చేసిందనే అంశంపైనా దృష్టి పెట్టింది. ఇదిలా ఉంటే.. అసలు ధరణి పోర్టల్‌లో భూముల సమగ్ర సమాచారం భద్రమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. భూముల సమాచారం ప్రమాదంలో ఉందనే అనుమానం నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నది.
సమీక్షలో తేలిన అనేక విషయాలు!
భూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ అన్ని రాష్ట్రాల్లోనూ నడుస్తున్నది. కానీ ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో గత ప్రభుత్వం ఆ బాధ్యతను ప్రైవేటు సంస్థ చేతుల్లో పెట్టింది. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నట్లు ప్రస్తుత ప్రభుత్వం అనుమానిస్తున్నది. అందుకే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహల నేతృత్వంలో సాగిన రివ్యూ మీటింగ్ లో అనేకాంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. సర్వర్ కి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారా? లేదా? సర్వర్ కాలిపోతే బ్యాకప్ ఉంటుందా? ప్రత్యామ్నాయం ఏంటి? అనే విషయాలు కూడా ఉన్నతాధికారులకూ తెలియదని సమీక్షలో తేలినట్లు తెలిసింది. అయితే ఇప్పటికిప్పుడు ఆ కంపెనీ చేతులెత్తేస్తే భూ పరిపాలన, రిజిస్ట్రేషన్ల వ్యవహారం నడిపేందుకు మరో మార్గమేమిటనే అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఇంకా ఈ నాలుగేండ్ల కాలంలో సాగిన ట్రాన్సాక్షన్స్, మార్పులు, చేర్పులు, వివరాలేవీ అందుబాటులో లేకుండాపోయే ప్రమాదం నెలకొన్నది. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఫిజికల్ కాపీలేవీ ఉంచడం లేదు. కనీసం ట్రాన్సక్షన్స్, ఎన్వోసీ, క్లాసిఫికేషన్ చేంజ్ వంటి అనేక ప్రక్రియలకు ఆధారాలన్నీ అప్ లోడ్స్‌తోనే సాగిస్తున్నారు. డేటా ఎరైజ్ అయితే అంతా అంధకారమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
విదేశీ కంపెనీ కొనుగోలు వెనక మతలబేమిటి?
ధరణి పోర్టల్ డేటా, నిర్వహణ చేపట్టిన కంపెనీకి ప్రభుత్వం ఏటా రూ. 4 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు చెల్లిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ధరణి ఆపరేటర్ల బాధ్యతలను కూడా ఆ కంపెనీయే చూస్తున్నందున, వాళ్ల కోసం మరో రూ. 15 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. అయితే ఇంత తక్కువ మొత్తంలో లావాదేవీలు జరిపే టెర్రాసిస్ టెక్నాలజీ కంపెనీని రూ.1200 కోట్లకు విదేశీ కంపెనీ అయిన అమెరికాకు చెందిన క్వాంటేలా కొనుగోలు చేయడం వెనుక మతలబు ఏమిటనే దానిపై ప్రస్తుత సర్కారు దృష్టి పెట్టినట్లు తెలుస్తున్నది. కంపెనీ పుట్టుపూర్వోత్తరాలేమిటి? దీని డైరెక్టర్లు ఎవరు? ఇప్పటి దాకా ఈ కంపెనీ చేపట్టిన పనులేంటి? ఈ కంపెనీని మరో విదేశీ కంపెనీకి ఎందుకు విక్రయించారు? అన్న కోణంలో సమగ్ర సమాచారాన్ని ఇవ్వాలని సీసీఎల్‌ఏ నవీన్ మిట్టల్ ను సీఎం ఆదేశించినట్లు తెలిసింది.
గడువు ముగిసినా, కాలపరిమితి పొడిగింపు !
ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన కంపెనీకి ఎన్నేండ్లు లీజుకు ఇచ్చారన్న విషయంలోనూ ఉన్నతాధికారుల్లో స్పష్టత లేదు. అయితే ఈ ఏడాది సెప్టెంబరులోనే దాని కాలపరిమితి ముగిసింది. కానీ ఎక్స్ టెన్షన్ ఇచ్చినట్లు తెలిసింది. కనీసం టెండర్ ప్రక్రియ లేకుండానే నామినేషన్ పద్ధతిలో ప్రైవేటు కంపెనీకి ఎందుకు కట్టబెట్టారనే అంశంపై సైతం ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలిసింది. ధరణి పోర్టల్ లోపాలను సరిదిద్దకపోవడం ప్రభుత్వ అసమర్థతా? లేకపోతే సాఫ్ట్ వేర్ కంపెనీ అసమర్థతనా? తేల్చే విషయంలో ప్రస్తుత ప్రభుత్వం నిమగ్నమైనట్లు తెలుస్తున్నది.
సమగ్ర నివేదిక కోరిన సిఎం.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం భూముల సమాచారం మరియు నిర్వహణ బాధ్యతను ప్రైవేటు కంపెనీకి అప్పగింతపై సాగిన అన్ని అంశాలను లిఖితపూర్వకంగా అందజేయాలని సీసీఎల్‌ఏ నవీన్ మిట్టల్ ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. టెండర్ ప్రక్రియ ఎలా సాగింది? ఎన్ని కంపెనీలు వచ్చాయి? సాఫ్ట్ వేర్ రూపకల్పన చేసిందెవరు? ఇప్పటి దాకా వారికి చెల్లించింది ఎంత? ఎన్ని ట్రాన్సక్షన్స్ అయ్యాయి? ఇలాంటి అనేకాంశాలతో కూడిన నివేదికను కోర్టుకు సాక్ష్యంగా సమర్పించేలా సమగ్రంగా ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. సెప్టెంబరులో గడువు ముగిసినా అదే కంపెనీకి ఏ పద్ధతిన, ఏ చట్టం ప్రకారం ఎక్స్ టెన్షన్ ఇచ్చారన్న విషయాన్ని కూడా ప్రస్తావించడం గమనార్హం. మాజీలకు అత్యంత సన్నిహితులకు చెందిన కంపెనీ అంటూ అనేక కథనాలు వెలువడిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.