Infertility Problems : సంతానలేమికి...జీవనశైలే శాపం !

0

ప్రపంచ జనాభాలో మనది ప్రపంచంలోనే అగ్రస్థానం. కానీ నగరాల్లో ఏ వీధికెళ్ళినా ఓ ఫెర్టిలిటీ సెంటర్‌ దర్శనిమిస్తోంది. ఐవీఎఫ్‌ నుంచి సరొగసీ వరకూ అన్ని సేవలూ అందించే ఈ క్లినిక్‌లు సాధారణ నర్సింగ్‌హోమ్‌ల కన్నా రద్దీగా ఉంటున్నాయి. ఎందుకనీ అంటే- ప్రపంచంలో నాలుగో వంతు నిస్సంతులు ఉన్నదీ మన దేశంలోనే మరి! పరస్పర విరుద్ధమైన ఈ పరిస్థితి నేటి జీవనశైలిలోని లోపాలను వేలెత్తి చూపిస్తోంది. సమస్య విషమించకముందే జాగ్రత్తపడమంటోంది.

సంతానరాహిత్యం నేటి సమాజం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ అసిస్టెడ్‌ రిప్రొడక్షన్‌ అంచనా ప్రకారం దేశంలో దాదాపు మూడు కోట్లమంది సంతానరాహిత్యంతో బాధపడుతున్నారట. సంతాన సాఫల్యత రేటు 2.2 ఉంటే దాన్ని రిప్లేస్‌మెంట్‌ రేట్‌ అంటారు. అంటే- జనాభా హెచ్చుతగ్గులు లేకుండా స్థిరంగా ఉంటుందన్నమాట. కానీ ప్రస్తుతం మన ఫెర్టిలిటీ రేట్‌ రెండుకి పడిపోయింది. యువత ఎక్కువగా ఉన్న దేశం కావడంతో సహజంగానే పునరుత్పత్తి దశలో ఉన్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు. అలాంటి సమయంలో ఈ సమస్య తీవ్రత అందరినీ ఆలోచింపజేస్తోంది. ఈ సంతాన సాఫల్యత నగరాల్లో ఎన్నడూ లేనంత తక్కువగా1.6కి, గ్రామాల్లో 2.1కి పడిపోవడంతో ఇప్పుడు ఊరూరా సంతాన సాఫల్య కేంద్రాలు వెలుస్తున్నాయి. ‘మా దగ్గర సరొగసీ సౌకర్యం కూడా ఉంద’ని ప్రచారమూ చేసుకుంటున్నాయి. ఒక్క 2012లోనే పాతికవేల మంది పిల్లలు సరొగసీ ద్వారా పుట్టారు. వారిలో సగం విదేశీ తల్లిదండ్రుల పిల్లలేనట. ఒక దశలో దేశం సరొగసీ కేంద్రంగా మారడంతో పెరుగుతున్న న్యాయపరమైన చిక్కుల్ని అడ్డుకోవడానికి కమర్షియల్‌ సరొగసీని నిషేధిస్తూ నిర్దిష్టమైన చట్టం చేసింది ప్రభుత్వం. అయినప్పటికీ ఏటా కొన్ని వేలమందిని ఈ విధానమే అమ్మానాన్నలను చేస్తోంది.

ఫెర్టిలిటీ మార్కెట్‌ మూడు రెట్లు

దేశంలో ఇన్‌ఫెర్టిలిటీ డయాగ్నసిస్‌ అండ్‌ ట్రీట్‌మెంట్‌ మార్కెట్‌ 2022 నుంచి 2028 వరకూ ఏటా పన్నెండున్నర శాతం చొప్పున పెరుగుతోందని ఓరియన్‌ మార్కెట్‌ రీసెర్చ్‌ అధ్యయనం చెబుతోంది. మరో కన్సల్టింగ్‌ ఫర్మ్‌ చేపట్టిన అధ్యయనమైతే- ఫెర్టిలిటీ మార్కెట్‌ 2020 నుంచి 2026కి మూడు రెట్లు అవుతుందని ఢంకా బజాయించి చెబుతోంది. వైద్య ఆరోగ్య రంగంలో ఇంత వేగంగా మరే స్పెషాలిటీనూ పెరగడం లేదట. ఒకప్పటి లెక్కల ప్రకారం... ఎలాంటి గర్భ నిరోధక సాధనాలూ వాడకుండా ఏడాదిపాటు కనీసం వారానికోసారైనా కలుస్తూ క్రమబద్ధమైన లైంగిక జీవితం గడుపుతున్న జంటల్లో నాలుగోవంతు పెళ్లైన నెలలోపే గర్భం దాల్చే అవకాశం ఉండేది. అరవై శాతం జంటలు ఆర్నెల్లలోగా, 75 శాతం తొమ్మిది నెలల్లోగా, తొంభై శాతం ఏడాదిన్నరలోగా... తప్పనిసరిగా గర్భం దాల్చడం జరిగేది. ఏ లోపమూ లేకపోయినా పిల్లలు కలుగని సందర్భాలూ ఉంటాయి కానీ అవి చాలా తక్కువ. కాబట్టి రెండేళ్లు దాటాక కూడా పిల్లలు కలగలేదంటే... ఇరుపక్షాల్లోనూ ఆందోళన మొదలయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రాధాన్యాలు మారాయి. జీవనశైలి మారిపోయింది.

ప్రజారోగ్య సమస్య

సంతానలేమి సమస్య అనగానే మొదట స్త్రీలవైపే వేలెత్తి చూపించేది ఒకప్పటి సమాజం. ఇప్పుడిప్పుడే స్త్రీ పురుషులిద్దరి ఆరోగ్య సమస్యగా చూడడం పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం దీన్ని ప్రజారోగ్య సమస్యగా పరిగణిస్తూ ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాలను కోరుతోంది. ప్రాథమికంగా ఇది శారీరక స్థితికి సంబంధించినదే అయినప్పటికీ సమాజమూ జీవనశైలీ దానిని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నందున ఈ నిర్ణయం తీసుకుంది. భార్యాభర్తల మధ్య సహజంగా, ప్రేమానురాగాలతో కూడిన శృంగారం ఫలితంగా కలగాల్సిన సంతానం ఇప్పుడు కెరీర్‌ ప్రణాళికలో ఒక భాగమై, సరైన సమయం కోసం వేచివుండాల్సి వస్తోంది. సాధారణంగా ముప్ఫై ఏళ్లలోపే సంతాన సాఫల్యత ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఏటికేడాదీ తగ్గిపోతుంది. చదువులు పూర్తై ఉద్యోగాల్లో స్థిరపడి కొన్నాళ్లు ఆనందంగా గడిపి ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం, భార్యాభర్తలిద్దరూ వేర్వేరు షిఫ్టుల్లో పనిచేయడం, విదేశీ ప్రయాణాలూ, ఉద్యోగాల్లో చేరుకోవాల్సిన లక్ష్యాలూ... అన్నీ చూసుకుని చివరికి పిల్లల్ని కనడానికి సిద్ధమయ్యేసరికి పుణ్యకాలం గడిచిపోతోంది. సంతానరాహిత్యానికి జన్యుపరమైన సమస్యలూ కొంత కారణమైనప్పటికీ పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే- కుటుంబ, సామాజిక వాతావరణం, ఒత్తిళ్లూ, ఆహారపుటలవాట్లూ ఆ సమస్యని పెంచుతున్నాయని. సంసారంలో లాగే ఈ సమస్యలోనూ స్త్రీపురుషులిద్దరి భాగస్వామ్యమూ సమానంగా ఉండడాన్ని గమనించాలి. 40 శాతం కేసుల్లో స్త్రీలు, 40 శాతం సందర్భాల్లో పురుషులు కారణం అవుతున్నారు. మిగిలిన దాంట్లో కొంత ఇద్దరిపాత్రా ఉండవచ్చు, కొంత ఇవీ అని చెప్పలేని కారణాలూ ఉండవచ్చు.

పురుషుల్లో...సంతాన సామర్థ్యాన్ని తగ్గిస్తున్న కారణాలు !

  • వీర్య కణాల సంఖ్య తగ్గిపోయింది. ముప్పయ్యేళ్ల క్రితం వరకూ మి.లీ. వీర్యంలో 80- 100 మిలియన్ల వరకూ శుక్రకణాలు ఉండేవట. ఇప్పుడవి 30-40 మిలియన్లకు తగ్గిపోయాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్నే ప్రామాణికంగా చెబుతోంది కానీ వాస్తవంగా ఈ స్థాయిలో ఉంటే గర్భం దాల్చే అవకాశాలు తగ్గిపోతాయి. ఇది ఇలాగే తగ్గుతూపోతే సాధారణ పద్ధతుల్లో పునరుత్పత్తికి అవకాశం ఉండకపోవచ్చు. ఎక్కువ సమయం నిలబడి లేదా కూర్చుని పనిచేయడం, పలు వ్యసనాలూ... స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గడానికి దారితీస్తున్నాయి. పొగ తాగేవారిలో స్పెర్మ్‌కౌంట్‌ 17 శాతం తగ్గుతుందట. 
  • శుక్రకణాల నాణ్యతా తగ్గింది. కేవలం 30 శాతం మందిలోనే ఇవి ఆరోగ్యంగా చురుగ్గా ఉంటున్నాయట. బెనారస్‌ హిందూ యూనివర్సిటీ, సెంట్రల్‌ డ్రగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థలకు చెందిన పరిశోధకులు దాదాపు 14 వేలమంది పురుషులను(సంతానం ఉన్న, లేని...రెండువర్గాలనూ) పరిశీలించి వెలువరించిన 2018 నివేదిక ప్రకారం- 1979 నుంచి 2016నాటికి వీర్యకణాల నాణ్యత బాగా తగ్గింది. మద్యపానం, మాదకద్రవ్యాల్లాంటి వ్యసనాల ప్రభావమూ దానికి కారణమే. 
  • సాధారణ శరీర ఉష్ణోగ్రత కన్నా స్క్రోటమ్‌(పురుషాంగం ఉండే తిత్తి) ఉష్ణోగ్రత రెండు మూడు డిగ్రీలు తక్కువగా ఉంటుంది. శుక్రకణాల తయారీకి అది అవసరం కనుకే ప్రకృతి దాన్ని శరీరానికి బయట ఏర్పాటుచేసింది. కానీ వివిధ కారణాల వల్ల ఆ ఉష్ణోగ్రత పెరుగుతోందట. అది ఒక్క డిగ్రీ పెరిగినా చాలు వీర్యకణాల తయారీ సామర్థ్యం 40శాతం దాకా తగ్గిపోతుందట. బిగుతు దుస్తులు ధరించడం, ఉష్ణవాతావరణంలో పనిచేయడం, ఎక్కువ సమయం డ్రైవింగ్‌ చేయడం, విపరీతంగా గ్యాడ్జెట్స్‌, ప్రత్యేకించి ల్యాప్‌టాప్‌ లాంటివి వాడడం- ఈ ఉష్ణోగ్రతను పెంచుతున్నాయని నిపుణులు అంటున్నారు. దీనిపై ఒక పరిశోధన కూడా చేశారు. వీర్యకణాలను ఉంచిన టెస్ట్‌ట్యూబ్‌కి దగ్గరగా ఒక గంటపాటు సెల్‌ఫోన్‌ను ఉంచితే ఆ కణాల్లో సగానికి పైగా నిర్వీర్యమైపోయాయట.
  • పురుషుల్లో సంతానరాహిత్యానికి మరో ప్రధాన కారణం- వెరికోసీల్‌. వృషణాల దగ్గర రక్తనాళాలు మందంగా మారడంతో ఆ భాగంలో ఉష్ణోగ్రత పెరిగి వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోతోంది.
  • రెట్రొగ్రేడ్‌ ఇజాక్యులేషన్‌ అనే మరో సమస్యలో వీర్యం బయటకు రాకుండా బ్లాడర్‌లోకి వెళ్లిపోతుంది.
  • టెస్టిక్యులార్‌ క్యాన్సర్లు తదితర సమస్యలు కూడా పెరుగుతున్నాయి.
  • హార్మోన్ల సమస్య పురుషుల్లోనూ ఉంటుందట. దాని కారణంగా బట్టతల, రొమ్ముకణజాలం ఉబ్బినట్లుగా ఉండడం, స్పెర్మ్‌కౌంట్‌ తగ్గడం... లాంటి లక్షణాలు కన్పిస్తాయనీ, డయబెటిస్‌ కేసుల్లాగే ఈ మధ్య ఇవీ పెరుగుతున్నాయనీ ఈ రెండిటికీ ఒకదానికొకటి సంబంధం ఉందనీ అంటున్నారు డాక్టర్‌ మొహమ్మద్‌ అష్రఫ్‌ గనీ. ఆయన ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సంస్థకు సంబంధించిన పీసీఓఎస్‌ టాస్క్‌ఫోర్స్‌కి అధ్యక్షుడిగా ఉన్నారు.

మహిళల్లో...సంతాన సామర్థ్యాన్ని తగ్గిస్తున్న కారణాలు

  • మహిళల్లో అండాల సంఖ్య తగ్గడం సంతానలేమికి ప్రధాన కారణం. గతంలో 40 ఏళ్లు వచ్చేసరికి తగ్గే అండాల సంఖ్య ఇప్పుడు 32 ఏళ్ల వయసు నుంచే తగ్గిపోతోందట. ఎందుకిలా జరుగుతోందన్నది స్పష్టంగా తెలియడం లేదు కానీ కొంతవరకూ పౌష్టికాహార లోపం కారణం కావచ్చంటున్నారు నిపుణులు.
  • వివిధ కారణాల వల్ల పిల్లల్ని కనడాన్ని వాయిదా వేయడం, పుడతారేమో చూద్దామని చాలాకాలం వేచిచూడడం... లాంటి వాటివల్ల 35 ఏళ్లు దాటేస్తే ఆ తర్వాత గర్భం రావడం కష్టమవుతోంది.
  • పాలీసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌(పీసీఓఎస్‌) మరో ప్రధాన సమస్య. హార్మోన్ల అసమతౌల్యం వల్ల వచ్చే పీసీఓఎస్‌ కారణంగా నెలసరి క్రమబద్ధంగా ఉండదు.
  • ఫాలోపియన్‌ ట్యూబ్స్‌లో అవరోధాలు, సిస్టులూ ఎండోమెట్రియాసిస్‌ లాంటి గర్భాశయ సమస్యలు, పునరుత్పత్తి హార్మోన్ల అసమతుల్యత, తరచూ వెజైనల్‌ ఇన్‌ఫెక్షన్స్‌, లైంగిక వ్యాధులు... లాంటివీ గర్భధారణకు ఆటంకం అవుతాయి.
  • మెనోపాజ్‌ సగటు వయసు యూరోపియన్లకన్నా మనదేశంలో ఐదేళ్లు తక్కువ. ఇదీ పునరుత్పత్తి వయసును తగ్గించేస్తోంది.

స్త్రీపురుషులిద్దరికీ వర్తించే సమస్యలూ కొన్ని ఉన్నాయి.

స్థూలకాయం: ఇన్‌ఫెర్టిలిటీ క్లినిక్స్‌కి వస్తున్న మహిళల్లో 40శాతం స్థూలకాయులేనట. 2030 నాటికి భారతీయుల్లో ప్రతి ముగ్గురిలోనూ ఒకరు స్థూలకాయులై ఉంటారని పరిశోధకుల అంచనా. ప్రపంచదేశాలతో పోలిస్తే భారతదేశంలో ఒబెసిటీ సమస్య చాలా వేగంగా పెరుగుతోందట. స్థూలకాయం వల్ల బీపీ డయబెటిస్‌ లాంటి జబ్బులే కాదు, హార్మోన్ల సమస్యలూ వస్తాయి. వాటి సమతుల్యత దెబ్బతింటుంది. ముఖ్యంగా టెస్టోస్టెరాన్‌ తక్కువ తయారవుతుంది. అదే సంతాన లేమికి దారితీస్తుంది.

ఆహారపుటలవాట్లు: పోషకాహార లోపం శుక్రకణాల, అండాల నాణ్యతను తగ్గిస్తుంది. చక్కెర అతిగా వాడటం, ప్రాసెస్డ్‌ ఫుడ్‌, సంతృప్త కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం... పునరుత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.

నిద్ర: నాలుగైదు దశాబ్దాల క్రితం వరకూ లేని, ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య- నిద్రలేమి. ఎంత లేదన్నా దాదాపు రెండు గంటల నిద్ర తగ్గిపోయింది. ఎనిమిది గంటల నిద్ర ఉంటేనే శరీరంలోని అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేస్తాయి.

ఈ తరం ఆ విషయాన్ని అస్సలు గుర్తుంచుకోవడం లేదు. రాత్రీపగలూ తేడా లేకుండా జీవితాన్ని ఆస్వాదిస్తూ జీవగడియారాన్ని తమకిష్టం వచ్చినట్లు తిప్పాలనుకుంటున్నారు. ఫలితంగా హార్మోన్ల వ్యవస్థ అస్తవ్యస్తమవుతోంది.

కాలుష్యాలూ కారణమే!

ఇటీవల ప్రచురితమైన ‘కౌంట్‌డౌన్‌’ అనే పుస్తకం ప్రకారం... ప్లాస్టిక్కులు, షాంపూలు, రసాయన క్రిమిసంహారకాలలో ఉండే ఈడీసీల(ఎండోక్రైన్‌ డిస్రప్టివ్‌ కెమికల్స్‌) వల్ల స్త్రీ పురుషుల్లో సంతాన సాఫల్యత దెబ్బతింటోందట. వీటి కారణంగానే 1973 నుంచి 2011నాటికి పాశ్చాత్య దేశాల్లో పురుషుల స్పెర్మ్‌ కౌంట్‌ 59 శాతం తగ్గిందని ఈ పుస్తకం రాసిన షానా హెచ్‌.స్వాన్‌ ఆధ్వర్యంలోని పరిశోధక బృందం అభిప్రాయపడుతోంది. ‘హ్యూమన్‌ రిప్రొడక్షన్‌ అప్‌డేట్‌’ జర్నల్‌ ప్రకారం- ఈ రసాయనాలు శరీరంలోని గ్రంథులు విడుదల చేసే రసాయనాలతో చర్య జరపడం వల్ల మనిషి శారీరక వ్యవస్థల్లో ఎన్నో తేడాలు వస్తున్నాయి. ఈడీసీల్లోనూ మళ్లీ చాలా రకాలున్నాయట. బిస్ఫెనాల్‌, ఫాలేట్స్‌, డీడీటీ గ్రూప్‌...ఇలా గ్రూపులుగా వీటిని విభజించారు. ఇవన్నీ సౌందర్యసాధనాల్లో, రకరకాల ప్లాస్టిక్‌ వస్తువుల్లో, రసాయన క్రిమిసంహారకాల్లో ఉంటాయి. వీటి పాత్రపై ఇప్పుడు అమెరికా, యూరప్‌లలో పెద్ద ఎత్తున పరిశోధన జరుగుతోంది. ఇన్ని కారణాలు మూకుమ్మడిగా ప్రభావం చూపుతున్నాయి కాబట్టే నిస్సంతుల సంఖ్య పెరుగుతోంది. ఎంతగా అసిస్టెడ్‌ రిప్రొడక్టివ్‌ టెక్నాలజీ చికిత్సలు అందుబాటులోకి వచ్చినా ప్రజలు పరిస్థితుల పట్ల అవగాహన పెంచుకోవడం అవసరమంటున్నారు నిపుణులు.

అవగాహన ముఖ్యం

ఒక మహిళ 21 సార్లు ఐయుఐ(ఇంట్రా యుటెరైన్‌ ఇన్‌సెమినేషన్‌) ప్రయత్నించి విఫలమయ్యాక స్నేహితురాలైన గైనకాలజిస్టు దగ్గర బాధపడిరదట. ఆ గైనకాలజిస్టు పరీక్షిస్తే ఆమె ఫాలోపియన్‌ ట్యూబ్స్‌ పూర్తిగా బ్లాక్‌ అయి వున్నాయి. వాటిని సరిచేసిన వెంటనే ఆమె సహజంగా గర్భందాల్చింది. స్నేహితురాలి దగ్గరికి వెళ్లడానికి మొహమాటపడి వేరే ఆస్పత్రికి వెళ్లినందుకు కొన్ని సంవత్సరాల మానసిక ఒత్తిడీ, ఆస్పత్రులచుట్టూ తిరిగే శ్రమా, లక్షల్లో ఖర్చూ భరించాల్సి వచ్చింది. మరో మహిళ ఓవ్యులేషన్‌ ఇండక్షన్‌... మందుల ద్వారా అండాలు ఎక్కువ విడుదలయ్యేలా చేసే చికిత్సని పదేళ్లలో 26 సార్లు చేయించుకుందట. సాధారణంగా ఆ పరీక్షని ఒకరికి అత్యధికంగా ఆరుసార్లు మాత్రమే చేయవచ్చు. ఇన్‌ఫెర్టిలిటీ గురించి చర్చ వస్తే ఇలాంటి కథలెన్నో బయటకు వస్తుంటాయి. సంతానలేమితో బాధపడుతున్న స్త్రీపురుషులు ఇద్దరూ కూడా సరైన అవగాహన లేకుండా గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెస్తున్నారని అంటున్నారు నిపుణులు. వాళ్లూ వీళ్లూ చెప్పే మాటలు నమ్మి తరచుగా వైద్యుల్ని మార్చడం వల్ల- చేసిన పరీక్షలే చేసి, వాడిన మందులే వాడి మరింతగా సమస్యను పెంచుకుంటున్నారు. సంతానలేమికి ఎన్నో కారణాలుంటాయి. అనుభవజ్ఞులైన డాక్టరుని సంప్రదించి ఇద్దరూ అవసరమైన పరీక్షలు చేయించుకుంటే కారణం తెలిసిపోతుంది. దానికి చికిత్స తీసుకుంటే సరిపోతుంది. గతంలో చాలా తక్కువ మందికి ఐవీఎఫ్‌ అవసరమయ్యేది. ఈమధ్య క్లినిక్‌కి వెళ్తున్న వారిలో 30- 40 శాతం మందికి ఐవీఎఫ్‌ అవసరం అవుతోందని లెక్కలు చెప్తున్నాయి. అలాంటి చికిత్సలను ఐసీఎంఆర్‌ గుర్తింపు ఉన్న క్లినిక్‌లోనే చేయించుకోవాలి. చేయకూడని మరో పని... ఇతరులతో పోల్చుకోవడం. ప్రతి వ్యక్తి శరీరం ప్రత్యేకమే. కాబట్టి చికిత్సలు కూడా ఎవరికి వారికి ప్రత్యేకంగా ఉంటాయన్నది గుర్తుంచుకోవాలి. అలాగే ఏ చికిత్స అయినా నూటికి నూరుశాతం ఫలిస్తుందనీ ఆశించకూడదు.మానవాళి వినాశనానికి అణుయుద్ధమో మరొకటో అక్కర్లేదు, మన జీవనశైలి చాలు- అంటున్న పరిశోధకుల హెచ్చరికను అర్థం చేసుకుని తదనుగుణంగా మార్పులు చేసుకుంటేనే... ఐవీఎఫ్‌ అవసరం లేకుండానే అమ్మానాన్నలు కాగలరు!

ఎవరికి... ఎలాంటి చికిత్స..?

పిల్లలు పుట్టని వారందరికీ టెస్ట్‌ట్యూబ్‌ విధానమో, సరొగసీనో అవసరం పడదు. అసిస్టెడ్‌ రిప్రొడక్టివ్‌ టెక్నాలజీ కింద ఎన్నో చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అందుకని తగిన పరీక్షలు చేసి ఎవరికి ఏది అవసరమో అదే చేస్తారు. కాబట్టి ముందుగా డాక్టరు సూచన అనుసరించి భార్యాభర్తలిద్దరూ ఆ పరీక్షలు చేయించుకోవాలి. నూటికి ఎనభై మందికి తేలికపాటి చికిత్సలే సరిపోతాయి. ఆయా సమస్యల్ని బట్టి సాధారణంగా అవసరమయ్యే చికిత్సలు ఇవి...

లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ: ఎండోమెట్రియోసిస్‌, అండాశయంలో సిస్టులు, ఫాలోపియన్‌ ట్యూబుల్లో అవరోధాలూ లాంటి సమస్యలన్నిటినీ చిన్న లాప్రోస్కోపీ సర్జరీతో పరిష్కరించవచ్చు. గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్‌, పాలిప్స్‌ లాంటి సమస్యలుంటే హిస్టరోస్కోపీ చేస్తారు. ఇది కూడా తేలికపాటి చికిత్సే.

వారికోసెలెక్టమీ: పురుషుల్లో వీర్యకణాలను విశ్లేషించిన తర్వాత సంఖ్యా నాణ్యతా లాంటివి పెంచడానికీ, ఇన్‌ఫెక్షన్లు ఉంటే తగ్గించడానికీ మందులు వాడితే సరిపోతుంది. హార్మోన్‌ సమస్యలకి కూడా మందులు చాలు. వృషణాల దగ్గర రక్తనాళాలు మందంగా మారే వెరికోసీల్‌ సమస్యకి సర్జరీ అవసరమవుతుంది. ఇలాంటి సమస్యలేవీ లేకపోయినా పిల్లలు పుట్టకపోతే అప్పుడు...

ఐయుఐ: వీర్యకణాలు అండాన్ని చేరుకోవడం సాధ్యం కాని పరిస్థితి ఉన్నప్పుడు- సరిగ్గా అండం విడుదలయ్యే సమయానికి వాటిని నేరుగా గర్భాశయంలోకి ప్రవేశపెట్టే విధానాన్ని ‘ఇంట్రాయుటెరైన్‌ ఇన్‌సెమినేషన్‌’ అంటారు.

ఐవీఎఫ్‌: అండాన్నీ, శుక్రకణాల్నీ లేబొరేటరీలో ఫలదీకరణం చెందేలా చేసి పిండం ఏర్పడ్డాక తల్లి కడుపులో ప్రవేశపెడతారు. ఆ తర్వాత ప్రొసీజర్‌ అంతా సాధారణ గర్భంలాగే జరిగిపోతుంది. గర్భంలో ప్రవేశపెట్టడానికి ముందే ఆ పిండానికి జన్యుపరీక్షలు చేసి లోపాలు లేవని నిర్ధారించుకుంటారు.

ఐసీఎస్‌ఐ: ఈ విధానంలో నేరుగా అండంలోకే వీర్యకణాన్ని ఇంజెక్ట్‌ చేస్తారు. వీర్యకణాలు తక్కువగా ఉండి, నాణ్యత లేనప్పుడూ దీన్ని ఉపయోగిస్తారు.

ఎగ్‌, స్పెర్మ్‌ ఫ్రీజింగ్‌: సంతానం కోసం కొంతకాలం ఆగాలనుకునేవాళ్లు ఈ మధ్య ఎక్కువగా ఎంచుకుంటున్న విధానం ఇది. సంతాన సాఫల్యత ఎక్కువగా ఉండే వయసులో అండాలనూ శుక్రకణాలనూ తీసి భద్రపరచుకుని, పిల్లలు కావాలనుకున్నప్పుడు గర్భం ధరించవచ్చు.

ఐవీఎఫ్‌ విధానంలో ఫలదీకరణ జరిగాక పిండాన్ని కూడా ఇలా భద్రపరచుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా వివిధ రకాల క్యాన్సర్లకు చికిత్స పొందుతున్నవారికి ఇది వరంగా మారింది. కీమోథెరపీ ప్రారంభానికి ముందే వైద్యుల సూచనలమేరకు ఈ విధానాన్ని ఎంచుకుంటున్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !