- పాలకులం కాదు, ప్రజలకు సేవకులంగా ఉంటాం.
- డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క నియామకం
- మంత్రులుగా 11 మంది ప్రమాణస్వీకారం
తెలంగాణ తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఎనముల రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ ప్రమాణానికి ముహూర్తం నిర్ణయించారు. అయితే, అనుకున్న సమయానికంటే కొద్ది నిమిషాలు ఆలస్యమైంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఇండియా కూటమిలోని పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. అలాగే, ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు, ఆత్మీయ అతిథులుగా తెలంగాణ ఉద్యమకారులు వచ్చారు. ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల అమలుపై తొలి సంతకం చేశారు. దివ్యాంగురాలు రజినికి ఉద్యోగం కల్పిస్తూ రెండో ఫైలుపై సంతకం చేశారు. అనంతరం నూతన ముఖ్యమంత్రికి వివిధ దేవాలయాల నుంచి వచ్చిన వేద పండితులు ఆశీర్వాదం అందజేశారు.
పాలకులం కాదు, సేవకులం !
తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలి ప్రసంగం చేశారు. తెలంగాణకు తాము పాలకులం కాదని.. సేవకులమని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలు తమకు ఇచ్చిన అవకాశాన్ని ఎంతో బాధ్యతగా నిర్వహిస్తామని అన్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం సూచనలతో తెలంగాణను అభివృద్ధి చేస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసిన కార్యకర్తలను కచ్చితంగా గుర్తు పెట్టుకుంటానని అన్నారు. తెలంగాణలో నాలుగు కోట్ల మంది ముఖ్యంగా రైతులు, విద్యార్థులు, నిరుద్వోగులకు న్యాయం జరుగుతుంది. ప్రగతి భవన్ కంచెను బద్దలుకొట్టామని, ప్రజలు నిరంభ్యంతరంగా ఎవరైనా రావచ్చని స్పష్టం చేశారు. శుక్రవారం జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ప్రజా దర్బారు నిర్వహిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సమిధిగా మారి తెలంగాణ ఇచ్చిందన్నారు. అలాగే వికలాంగురాలైన రజినికి జాబ్ కార్డును అందజేశారు.
అమాత్యుల ప్రమాణ స్వీకారం !
వేదికపై రేవంత్ రెడ్డి తన కుటుంబాన్ని సోనియా గాంధీకి పరిచయం చేశారు. సోనియా కాళ్లకు ఆయన భార్య నమస్కరించి, ఆశీర్వాదం తీసుకున్నారు. వేదికపై పోలీస్ బ్యాండ్ జాతీయ గీతం ఆలపించిన అనంతరం గవర్నర్ తమిళ్‌సై ప్రమాణస్వీకారం చేయించారు. రేవంత్ రెడ్డి అనే నేను అంటూ ప్రమాణస్వీకారం చేశారు. ‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భారత దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, అంత:కరణ, చిత్తశుద్ధితో కర్తవ్యాన్ని నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని రేవంత్ ప్రతిజ్ఞ చేశారు. ఉప-ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, దనసరి అనసూయ సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణ స్వీకారం చేశారు. సీతక్క ప్రమాణస్వీకారానికి రాగానే ఎల్బీ స్టేడియం దద్దరిల్లింది. అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ప్రమాణస్వీకారం చేయడానికి కాసేపు ఆమె ఆగిపోయారు. పదవీ ప్రమాణస్వీకారం పూర్తయిన తర్వాత గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌ను రేవంత్ సాదరంగా సాగనంపారు.