- హెచ్‌ఎండీఏ ఆస్తులు, భూముల వివరాలివ్వండి
- ఓఆర్‌ఆర్ టెండర్ల కేటాయింపు డీటెయిల్స్‌తో రండి
- హెచ్‌ఎండీఏ ఆఫీసర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం!
కోకాపేటలో రూ. 100 కోట్లకు ఎకరం.. బుద్వేల్ లో జోరుగా డిమాండ్.. రియల్ ఎస్టేట్ రంగం పట్టపగ్గాలేకుండా దూసుకెళ్తోంది అంటూ గత పాలకులు చెప్పిన మాటలు కరెక్టేనా..? ఇంతకు భూములు తీసుకున్న వారు సొమ్ములు చెల్లించారా లేదా..? అంతా భజగోవిందం బభ్రాజమానమేనా? అనే అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. భూములు కొనుగోలు చేసిన వారు ఎంత మొత్తం చెల్లించాల్సి ఉంది. నిర్ణీత ప్రదేశంలో డబ్బులు చెల్లించకుండానే ఏమైనా నిర్మాణాలు చేపట్టారా..? అనే అంశాలపై సర్కారు లోతుగా ఆరా తీస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో హెచ్‌ఎండీఏ అధికారులు రంగంలోకి దిగారు. తమ పరిధిలో వేలం వేసిన భూములు తద్వారా వచ్చిన ఆదాయం. కోర్టులకు వెళ్లిన రియల్ ఎస్టేట్ సంస్థలు.. ప్రస్తుతం ఆ కేసు ఏ దశలో ఉన్నది.. ఎన్ని డబ్బులు కట్టారు..? కోర్టును ఎందుకు ఆశ్రయించారు. సదరు సంస్థ ఎవరిది..? వెనుక ఎవరున్నారు..? తదితర అంశాలపై అధికారులను వివరణ కోరినట్టు సమాచారం. రకరకాల అభివృద్ధి పేరిట నగరం చుట్టు పక్కల ప్రాంతాల్లో రైతుల నుంచి సేకరించిన భూములెన్ని..? అందులో ఏమైనా చిక్కుముడులున్నాయా..? అనే అంశాలపైనా అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు.
ఓఆర్‌ఆర్ పై స్పెషల్ ఫోకస్
సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ హోదాలో ఓఆర్‌ఆర్ లీజును తప్పుపట్టారు. తక్కువ లీజుకు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. దీనిపై ఆర్టీఐ కింద సమాచారం తెప్పించుకొని మీడియాకు బహిర్గతం చేశారు. ప్రస్తుతం కూడా ఓఆర్‌ఆర్ లీజు, పేమెంట్, అగ్రిమెంట్లకు సంబంధించిన వివరాలతో కూడిన ఫైలును హెచ్‌ఎండీఏ సిద్దం చేస్తోంది. దీనిని సీఎం ముందు ఉంచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అసలు సీఎం రేవంత్ రెడ్డి భూముల అమ్మకం, ఓఆర్‌ఆర్ లీజు తదితర అంశాలపై ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు? బకాయిపడ్డ బడా సంస్థల నుంచి డబ్బులు వసూలు చేస్తారా..? లేదా టెన్యూర్ పూర్తయిన భూములను రద్దు చేసి మళ్లీ టెండర్లు నిర్వహిస్తారా.? అన్నది ఆసక్తికరంగా మారింది. కోర్టును ఆశ్రయించిన వారి విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది.