Khammam : తుమ్మలదే ఖమ్మం ! మంత్రి పువ్వాడకు షాక్‌ !

0

ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పువ్వాడ అజయ్‌ కుమార్‌కు భారీ షాక్‌ తగిలింది. నువ్వా-నేనా అన్నట్లు తలపడిన ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి, సీనియర్‌ నేత తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. కచ్చితంగా ఈ సీటు గెలుస్తామనే పువ్వాడ ఆది నుంచి ధీమాగా ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ జోష్‌లో ఆయనకు ఓటమి తప్పలేదు. బీఆర్‌ఎస్‌ నుంచి మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ మూడోసారి పోటీ చేశారు. ఖమ్మం సీటుపై ఆది నుంచి టార్గెట్‌ చేసిన కాంగ్రెస్‌.. అదే జోరును కడవరకూ కొనసాగించింది. కాంగ్రెస్‌లో తుమ్మల బలమైన నేత కావడం కూడా ఆ పార్టీకి కలిసొచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును తనవైపు తిప్పుకోవడంలో తుమ్మల సక్సెస్‌ అయ్యారు. ఎన్నికల ప్రచారహోరులో కూడా వీరిద్దరూ హోరీహోరీనే తలపించారు. ఇద్దరూ  కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడంతో ఇక్కడ లోకల్‌ గా పొలిటికల్‌ వార్‌ మరింత ఆసక్తిని పెంచింది. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు.. ఎన్నికల్లో పాలేరు నుంచి బీఆర్‌ఎస్‌ తరుపున పోటి చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి కూడ ఓడితే పొలిటికల్‌గా డ్యామేజ్‌ అయ్యే అవకాశం ఉండటంతో ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రయత్నించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి 40 ఏళ్ల రాజకీయాలకు ఘనంగా వీడ్కోలు పలకాలనే ఉద్దేశంతో పనిచేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని చెప్పి కూడా ప్రచారానికి వెళ్లారు. దానికి తోడు కాంగ్రెస్‌ జోరు కూడా తోడవడంతో ఖమ్మం నియోజకవర్గంలో విజయాన్ని సొంతం చేసుకున్నారు.

పువ్వాడ అజయ్‌కి షాక్‌ !

ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 3,15, 801 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుష ఓటర్లు 1,51, 673 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు  1,64, 006 మంది ఉండగా, ట్రాన్స్‌ జెండర్లు 47 మంది ఉన్నారు. ఇందులో సుమారు 48 వేల ఓట్లు కమ్మ సామాజిక వర్గానికి చెందినవే ఉన్నాయి. 2014లో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసిన పువ్వాడ అజయ్‌కుమార్‌...టీడీపీ తరపున పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావును సుమారు 6 వేల ఓట్ల తేడాతో ఓడిరచారు. ఆ తర్వాత ఇద్దరూ గులాబీ పార్టీలో చేరిపోయారు. తుమ్మల నాగేశ్వరరావు 2016లో పాలేరుకు జరిగిన ఉప ఎన్నికలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2018 సాధారణ ఎన్నికల్లో పాలేరు నుంచి తుమ్మల మళ్ళీ ఓటమి చెందారు. పువ్వాడ అజయ్‌ 2018 ఎన్నికల్లో ఖమ్మం నుంచి విజయం సాధించి కేసీఆర్‌ రెండో మంత్రివర్గంలో మంత్రి పదవి పొందారు. కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు మళ్ళీ తన పాత ప్రత్యర్థితోనే ఖమ్మంలో తలపడ్డారు. ఇక బీజేపీ-జనసేనల పొత్తులో భాగంగా ఇక్కడ జనసేనకు టికెట్‌ కేటాయించారు. జనసేన తరఫున మిర్యాల రామకృష్ణ బరిలో నిలిచారు. ఇక సీపీఎం నుంచి యర్ర శ్రీకాంత్‌ పోరుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోవడంతో  సీపీఎం నేరుగా పోరుకు దిగింది.  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !