L & T : మేడిగడ్డ పునరుద్ధరణ మా బాధ్యత కాదు !

0

తెలంగాణలో సంచలనం సృష్టించి మేడిగడ్డ బరాజ్‌ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యతలు ఎల్‌ అండ్‌ టీ సంస్థే చూసుకుంటుందని అధికారులు చెబుతుంటే..తమకేం సంబంధం లేదని సదరు సంస్థ స్పష్టం చేస్తోంది. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ప్రాంతాన్ని, దెబ్బతిన్న పియర్స్‌ను పునరుద్ధరించే పని తమది కాదని వెల్లడిరచింది. పునరుద్ధరణకు అయ్యే మొత్తాన్ని చెల్లిస్తేనే తాము పునరుద్ధరిస్తామని.. అందుకోసం అనుబంధం ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. మేడిగడ్డ బరాజ్‌ కుంగినప్పుడు.. ప్రాజెక్ట్‌ నిర్వహణ గడువు ఇంకా ఉందని.. పునరుద్ధరణకు అయ్యే ఖర్చునంతా ఎల్‌ అండ్‌ టీ సంస్థే భరిస్తుందని ప్రాజెక్టు ఇంజినీర్లు అధికారికంగా చెప్పారు. ఆ మేరకే నిర్మాణ సంస్థ కూడా ప్రకటన జారీ చేసింది. కానీ ఇప్పుడు యూటర్న్‌ తీసుకుంది. గత ప్రకటనకు భిన్నంగా లేఖ రాసింది. మేడిగడ్డ బరాజ్‌ కుంగిన చోట పియర్స్‌, పునాదికి ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఆ ప్రాంతంలోకి నీరు రాకుండా మళ్లించేందుకు కాఫర్‌ డ్యామ్‌ నిర్మించాల్సి ఉంది. ఆ నిర్మాణానికి రూ.55.75 కోట్లు ఖర్చవుతాయని.. ఈ మొత్తానికి ఒప్పందం చేసుకోవాలంటూ ఎల్‌అండ్‌టీ సంస్థ డిసెంబరు 2న కాళేశ్వరం ఎత్తిపోతల ఈఎన్సీ(రామగుండం) వెంకటేశ్వర్లుకు లేఖ రాసింది. ఆ లేఖను ఈ నెల 5న సంబంధిత ఎస్‌ఈకి పంపి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. దీంతో మేడిగడ్డ బరాజ్‌ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

అసలేం జరిగింది?

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బరాజ్‌ ఏడో బ్లాక్‌ అక్టోబరు 21న కుంగిపోయింది. ఆ మరుసటిరోజు ఈఎన్సీ వెంకటేశ్వర్లు సహా సంబంధిత ఇంజినీర్లు, సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ ఇంజినీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. బరాజ్‌ ఇంకా నిర్మాణ సంస్థ నిర్వహణలోనే ఉందని, పునరుద్ధరణ పని పూర్తిగా నిర్మాణ సంస్థే చేపడుతుందని అధికారులు వెల్లడిరచారు. పునరుద్ధరణ పనిని తాము సొంతంగానే చేపడతామని నిర్మాణ సంస్థ జనరల్‌ మేనేజర్‌ కూడా అదే రోజు ప్రకటన విడుదల చేశారు.ఆ తర్వాత మేడిగడ్డ బరాజ్‌ను పరిశీలించడానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ డ్యామ్‌ సేఫ్టీ నిపుణుల బృందాన్ని పంపింది. అనిల్‌ జైన్‌ నాయకత్వంలోని బృందం బరాజ్‌ను పరిశీలించి..పియర్స్‌ కుంగినట్లు పేర్కొంది. దానికి గల కారణాలను విశ్లేషించింది.

ఎల్‌ అండ్‌ టీ లేఖలో ఏముంది?

చేసిన పనికి తగ్గట్లుగా బిల్లు చెల్లించే పద్ధతిలో తెలంగాణ నీటి పారుదలశాఖ, ఎల్‌ అండ్‌ టీ మధ్య ఒప్పందం జరిగింది. ప్రాజెక్టు డిజైన్‌ను నీటిపారుదల శాఖ ఇచ్చింది. నిర్మాణ పనులను 2018 ఆగస్టు 25కు పూర్తి చేయాల్సి ఉండగా%ౌౌ% 2020 జూన్‌ 29 నాటికి పూర్తయ్యాయ. నిర్మాణ వ్యయం రూ.3,062.79 కోట్లకు ఒప్పందం జరగ్గా%ౌౌ% పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకొని మొత్తం రూ.3,348.24 కోట్లు చెల్లించారు. ఒప్పందం మేరకు తమ పని పూర్తయినట్లు 2021 మార్చి 15న సంబంధిత ఎస్‌ఈ ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. ఒప్పందం ప్రకారం.. సివిల్‌ పనులకు డిఫెక్ట్‌ లయబిలిటీ పిరియడ్‌ 24 నెలలు. 2020 జూన్‌ 29 నుంచి 2022 జూన్‌ 29 వరకు డిఫెక్ట్‌ లయబిలిటీ పిరియడ్‌గా పేర్కొన్నామని.. అధికారులు కూడా 2021 మార్చి 15న పని పూర్తయి ప్రాజెక్టును స్వాధీనం చేసుకొన్నట్లు సర్టిఫికెట్‌ ఇచ్చారని లేఖలో ఎల్‌ అండ్‌ టీ పేర్కొంది. అందువల్ల 2023లో దెబ్బతిన్న బరాజ్‌కు తమది బాధ్యత కాదని స్పష్టం చేసింది. ఐతే పని పూర్తయినట్లు సంబంధిత ఇంజినీర్లు ధ్రువీకరణ పత్రం ఇచ్చిన తేదీని పరిగణనలోకి తీసుకొన్నా 2021 మార్చి 15 నుంచి 2023 మార్చి 15 వరకే ఎల్‌ అండ్‌ టీ సంస్థకు నిర్వహణ బాధ్యత ఉంటుంది. మరి 2023 అక్టోబరు 21న బ్యారేజీకి నష్టం వాటిల్లితే.. దాని పునరుద్ధరణ బాధ్యత గుత్తేదారుదే అని నీటిపారుదల శాఖ ఎందుకు చెప్పింది? తామే చేస్తామని ఎల్‌ అండ్‌ టీ సంస్థ కూడా ఎందుకు ప్రకటించింది? అనేది కూడా ప్రశ్నార్థంగా మారింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !