‘వ్యూహం’ టైటిల్‌తో రూపొందిన వెబ్‌సిరీస్ ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో విడుదలైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌పై సుప్రియ యార్లగడ్డ ఈ వెబ్ సిరిస్‌ను నిర్మించారు. మరి, ఈ ‘వ్యూహం’ కథేంటి? ఎలా ఉంది ? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
కథలోకి వెళితే : మైఖేల్ (చైతన్య కృష్ణ).. తన భార్య జెస్సికా (పావని గంగిరెడ్డి)ను హాస్పిటల్‌కు తీసుకెళ్లేందుకు క్యాబ్ బుక్ చేయగా అది క్యాన్సిల్ అవుతుంది. ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో జెస్సికాను బైక్‌పైనే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు మైఖేల్ . ప్రయాణంలో కొన్ని ద్విచక్ర వాహనాలు వారికి అడ్డురాగా త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంటారు. కానీ, ఓ కారు ఢీ కొడుతుంది. దాంతో, జెస్సికాకు గర్భస్రావం అవుతుంది. గతాన్నీ మర్చిపోతుంది. ప్రమాదం గురించి పోలీసులకు వివరించి, మైఖేల్ కేసు పెడతాడు. ఆ కేసు ఏసీపీ అర్జున్ రామచంద్ర (సాయి సుశాంత్ రెడ్డి) వద్దకు వెళ్తుంది. రంగంలోకి దిగిన ఏసీపీ అర్జున్.. మైఖేల్ వాళ్లకు అడ్డొచ్చిన ద్విచక్రవాహన దారులు, యాక్సిడెంట్ చేసిన కారు డ్రైవర్‌కు ఏదో సంబంధం ఉందని అనుమానిస్తాడు. అది ‘హిట్ అండ్ రన్’ కేసు కాదని, దాని వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందని భావిస్తాడు. మరోవైపు, జర్నలిస్ట్ నిర్మల మృతి చెందడం కలకలం రేపుతుంది. వ్యాపారం పేరుతో దందా చేసే రెడ్డెన్న కుమార్తె నిహారిక (ప్రీతి అస్రానీ) కిడ్నాప్‌నకు గురవుతుంది. మరి, వీటన్నింటికీ కారకులెవరని తెలుసుకునే ప్రయత్నంలో ఏసీపీ ఎదుర్కొన్న సవాళ్లేంటి? మైఖేల్ ఏం పనిచేస్తుంటాడు? అతడికి, రెడ్డెన్నకు మధ్య లింకేంటి? తదితర ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.
ఆసక్తిగా ప్రారంభమవుతుంది.
తెలిసో, తెలియకో ఇతరులకు హాని చేస్తే ఎప్పటికైనా దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సిందేనన్న కాన్సెప్ట్‌తో రూపొందిందీ సిరీస్. రోడ్డు ప్రమాదంతో దాన్ని వివరించిన తీరు మెప్పిస్తుంది. మొత్తం 8 ఎపిసోడ్లు (ఒక్కో ఎపిసోడ్ నిడివి దాదాపు 40 నిమిషాలు). మైఖేల్ దంపతుల ప్రయాణం, మధ్యలో చోటుచేసుకునే పరిణామాలు, కారు ఢీ కొట్టడం, జెస్సికాకు గాయాలవడం, మైఖేల్ కేసు పెట్టడం, ఏసీపీ అర్జున్ రంగంలోకి దిగడం తదితర సన్నివేశాలతో సిరీస్ ఆసక్తిగా ప్రారంభమవుతుంది. అయితే ముందుకెళ్లేకొద్దీ గందరగోళంగా అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా కథ ఒక చోట నుంచి మరో చోటుకి షిఫ్ట్ అవడం, కొత్త కొత్త పాత్రలు ఎంట్రీ ఇవ్వడంతో.. ఎప్పుడు? ఎక్కడ? ఏం జరుగుతుంది? అన్న సందేహాలు ప్రేక్షకుడికి కలుగుతాయి. కథ తొలి నాలుగు ఎపిసోడ్లలో నెమ్మదిగా సాగుతుంది. ఐదో ఎపిసోడ్ నుంచి వేగం పుంజుకుంటుంది. యాక్సిడెంట్ కేసును లోతుగా పరిశీలించే క్రమంలో ఏసీపీ అర్జున్‌కు టెర్రరిజం, నక్సలిజం, రౌడీయిజం సవాలుగా మారతాయి. ఒక్కో చిక్కుముడిని విప్పుతూ.. ఒకే ఘటనకు అవన్నీ మూలం అని వివరించే క్రమం మంచి అనుభూతి పంచుతుంది. అయితే, ప్రతిదాన్నీ క్షుణ్ణంగా చూపించడంతో సాగదీసినట్లు అనిపిస్తుంది.
థ్రిల్ అవ్వాల్సిందే.
మరోవైపు, ప్రధాన పాత్రల ఫ్లాష్‌బ్యాక్ స్టోరీలు అలాగే అనిపిస్తాయి. ఐఏఎస్‌తో ఏసీపీ అర్జున్ పెళ్లి వ్యవహారం ట్రాక్ కూడా అనవసరం అన్న భావన కలుగుతుంది. జర్నలిస్ట్ నిర్మల హత్య, ఏసీపీ అర్జున్ తల్లి వాణీ రామచంద్ర హత్య, రెడ్డెన్న కుమార్తె నిహారిక కిడ్నాప్, మైఖేల్ బైక్ యాక్సిడెంట్.. వీటన్నింటినీ ఇంటర్‌లింక్ చేసిన విధానం, దాన్ని చూపించిన తీరుకు థ్రిల్ అవ్వాల్సిందే. నిహారిక కిడ్నాప్ ఎపిసోడ్‌లో వచ్చే రామ్‌జీ పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. క్యాబ్ డ్రైవర్ రాములు రోల్ కూడా ఈ సిరీస్‌లో కీలకం. ఈ రాములు, మైఖేల్ పాత్రలను లింక్ చేయడం, ఎక్కడైతే సిరీస్‌ని ప్రారంభించారో అదే చోట ఎండ్ చేయడం కొత్త అనుభూతి పంచుతుంది. కీలకమైన పలు పాత్రలకు సరైన ముగింపు ఇవ్వలేదు. ఇలాంటి వాటికి సీజన్ 2లో సమాధానమిస్తారేమో చూడాలి.
గమనిక : ఇది రైటర్ యొక్క వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.