- అవకాశాలను పరిశీలిస్తున్న చంద్రబాబు !
- త్యాగరాజుగా కొమ్మాలపాటి శ్రీధర్ !
- ఎన్నికల అనంతరం కొమ్మాలపాటికి ఎమ్మేల్సీ !
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో అన్ని పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. వైసిపి రాష్ట్రవ్యాప్తంగా 82 మంది అభ్యర్థులను మార్చుతున్నట్లు సంకేతాలు ఇస్తోంది. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులను మార్చింది. ఇక టీడీపీ విషయానికి వస్తే దాదాపు 60 సీట్లలో అభ్యర్థులను ఖరారు చేసింది. మిగిలినవి టిడిపి, జనసేన మధ్య పొత్తులో భాగంగా తీవ్ర కసరత్తు చేస్తోంది. కలిసి పోటీచేసే విషయంతో బిజెపి నుండి స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణం. అయితే పొత్తు విషయంలో టిడిపి, జనసేన నాయకత్వాలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా.. క్షేత్రస్థాయిలో రెండు పార్టీల శ్రేణులు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నాయి.
తెనాలి సీటు కోసం ఎవరికి వారే
తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన పార్టీలకు కీలక స్థానం. ఇక్కడ టిడిపి నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజా, జనసేన నుంచి కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఎవరికి వారే తమకు టిక్కెట్ లభిస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. తమ పార్టీకే సీటు వస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. దీంతో ఇక్కడ రెండు పార్టీల శ్రేణుల్లో అయోమయం నెలకొంది. కలిసి పని చేయలేకపోతున్నారు. మొన్న ఆ మధ్యన సమన్వయ కమిటీ సమావేశంలో ఇద్దరు నేతలు కలిసిపోయినట్టు కనిపించారు. కలిసి పనిచేయాలని తీర్మానించుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి విరుద్ధంగా ఉంది. జనసేన నేత నాదెండ్ల మనోహర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేరికలకు ప్రోత్సహిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి నాయకులను, కార్యకర్తలను జనసేనలో చేర్చుతున్నారు. అదే సమయంలో ఆలపాటి రాజా నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ టికెట్ తనకే వస్తుందని.. పోటీ చేయబోతున్నానని చెప్పుకొస్తున్నారు. ఏకకాలంలో నాదెండ్ల మనోహర్ అటు, ఆలపాటి రాజా ఇటు ఉండడంతో.. ఏం జరుగుతుందో తెలియక రెండు పార్టీల శ్రేణులు గందరగోళానికి గురవుతున్నాయి.
చంద్రబాబు ఏం చేయబోతున్నారు ?
జనసేన పార్టీలో రెండవ స్థానంలో ఉన్న నాదెండ్ల మనోహర్ తెనాలి కోసం పట్టుపడుతుండగా, అదే సమయంలో ఆలపాటి రాజాను వదులుకునే పరిస్థితి లేదు. తెనాలి అసెంబ్లీ స్థానాన్ని నాదెండ్లకు కేటాయించి, ఆలపాటి రాజాని పెదకూరపాడు నియోజకవర్గం నుండి బరిలో దింపే ఆలోచన చేయనున్నారని తెలుస్తోంది. ఒకవేళ నాదెండ్ల మనోహర్ ఒప్పుకునే పక్షంలో పార్లమెంట్ సీటుకు పోటీలో ఉంచే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. కానీ తెనాలి సీటు కోసం నాదెండ్ల మనోహర్ ససేమిరా అంటుండటంతో ఆలపాటి రాజాకు స్థాన చలనం తప్పేట్టు లేదు. పెదకూరపాడు నియోజకవర్గం నుండి ఇప్పటికే రెండు సార్లు గెలిచి, ఒక సారి ఓడిపోయిన కొమ్మాలపాటి శ్రీధర్ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు తన సీటును త్యాగం చేయక తప్పదు. ఎన్నికల అనంతరం ఎమ్మేల్సీగా అవకాశం కల్పించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.