ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి సంచలనానికి వేదిక కానున్నాయి. ఇప్పటికే ఎన్నికల వేడి రాజకుంది. అభ్యర్థుల ఎంపికలో వైసీపీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఎన్నికల హీట్ తారస్థాయికి చేరింది. ఒక పార్టీకి రాజీనామాలు, వేరే పార్టీల్లోకి చేరికలతో రాజకీయాలు ఇంట్రస్టింగ్‌గా మారాయి. ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. అంత స్పీడ్‌గా పరిణామాలు మారిపోతున్నాయి. తాజాగా మరో ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ లేదా జనసేనలో చేరే అవకాశం ఉందని ఆయన చెప్పారు. వైసీపీలోకి వెళ్లేందుకు ముద్రగడ ఆసక్తి చూపడం లేదన్నారు. అంతేకాదు, ఈ ఎన్నికల్లో తాను తన తండ్రి.. ఇద్దరమూ పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నామని తెలిపారు. కాకినాడ పార్లమెంట్, ప్రత్తిపాడు, పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నామని, అన్నింటికి సిద్ధపడి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నామని చెప్పారు. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని గిరిబాబు తెలిపారు.
కాపు ఓటింగ్ అంతా ఒకవైపే !
ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరిబాబు తెలుగుదేశం కానీ, జనసేనలో గానీ చేరినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద సంచలనమే అవుతుంది. కాపు ఓటింగ్ మొత్తం ఒకవైపే మొగ్గే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాలు, నెల్లూరు వరకు తెలుగుదేశం, జనసేన కూటమికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. టీడీపీ, జనసేన సైతం ముద్రగడ పద్మనాభంకు పెద్దపీట వేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.