విక్టరీనే ఇంటిపేరుగా మార్చుకున్న హీరో వెంకటేష్. హిట్ పేరుతోనే రెండు హిట్లు కొట్టేసిన డైరెక్టర్ శైలేశ్ కొలను. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమానే ‘సైంధవ్’. ఇది వెంకటేష్‌కి 75వ చిత్రం కావడం మరో విశేషం. మరి వెంకీ మామ రికార్డ్ సినిమాని శైలేశ్ ఎలా తీశాడు? సంక్రాంతి బరిలోకి దిగిన సైంధవ్ హిట్ కొట్టాడో లేదో చూద్దాం.
ఇదీ కథ
చంద్రప్రస్థ అనే ఓ ఊరిలో సైంధవ్(వెంకటేష్) తన పాపతో(బేబీ సారా) కలిసి అక్కడి పోర్ట్‌లో క్రేన్ ఆపరేటర్‌గా పనిచేసుకుంటూ బతుకుతుంటాడు. వీళ్ళ ఇంటి పక్కనే భర్తకు విడాకులు ఇచ్చేసి సింగిల్‌గా ఉంటున్న మనో(శ్రద్ధ శ్రీనాధ్) సైంధవ్ తో, పాపతో అటాచ్మెంట్ పెంచుకుంటుంది. పాపను జాగ్రత్తగా చూసుకుంటూ సైంధవ్‌ని ప్రేమిస్తుంటుంది మనో (శ్రద్ధా శ్రీనాథ్).అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో అనుకోకుండా పాప కళ్ళు తిరిగి పడిపోవడంతో హాస్పిటల్ కి తీసుకెళ్లగా స్పైనల్ మస్క్యులార్ అట్రోఫీ అనే జబ్బు ఉందని తెలుస్తుంది. ఆ జబ్బుని నయం చేయడానికి ఒక్క ఇంజెక్షన్ చాలు, కానీ దాని విలువ 17 కోట్లు. దీంతో పాపని ఎలా బతికించాలా అని బాధపడుతుంటాడు సైంధవ్. ఇలాంటి పిల్లలు 300 లకు పైగా ఉన్నారని అందరి పరిస్థితి చాలా దారుణంగా ఉందంటూ చెబుతుంది డాక్టర్ రేణు (రుహానీ శర్మ). అదే సిటీలో పెద్ద కార్టెల్‌ను రన్ చేస్తూ ఉంటుంది ఓ విలన్ గ్యాంగ్. కార్టెల్ అంటే ఏం లేదు.. అమాయకులైన కుర్రాళ్లని, వయలెంట్ గేమ్స్‌కి (పబ్‌జీ) బానిసలైన యూత్‌కి శిక్షణ ఇచ్చి, గన్స్ ఎలా వాడాలో నేర్పించి.. ఉగ్రవాదులకి సప్లయి చేయడమే వీరి లక్ష్యం. ఇక దీనికి మిత్ర (ముకేష్ రిషి) లీడర్. ఇక వీరు అనుకున్నట్లుగానే 3 వేల మంది కుర్రాళ్లని ట్రైన్ చేసి గన్స్‌తో ఉగ్రవాదులకి చేర్చే బాధ్యతను కార్టెల్ మెంబర్ వికాశ్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ)కి అప్పగిస్తాడు మిత్ర. అదే సమయంలో టెర్రరిస్ట్ ట్రైనింగ్ ఇస్తున్న పిల్లలకు గన్స్ ఇచ్చి టెర్రరిస్టుల దగ్గరకు పంపించేందుకు భారీగా గన్స్, డ్రగ్స్ షిప్ లో వస్తాయి. ఈ ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వడంతో వీటిని పోర్ట్ కస్టమ్ ఆఫీసర్ పట్టుకుంటాడు. అతన్ని చంపి వాటిని తెచ్చుకోవాలని వికాస్ మాలిక్(నవాజుద్దీన్ సిద్దికీ) ప్రయత్నించగా సైంధవ్ అడ్డుపడతాడు. ఆ కంటైనర్ల నంబర్లు మార్చి దాచేస్తాడు. సైంధవ్ మళ్ళీ బరిలోకి దిగాడని చంద్రప్రస్థ మాఫియా గ్యాంగ్ అంతా భయపడుతుంది.సైంధవ్‌ని చూసి సైకో అంటూ వాళ్లంతా గజగజ వణకిపోతారు. అసలు ఈ సైకో ఎవరు? సైంధవ్ గతం ఏంటి? సైంధవ్‌ని చూసి అందరూ ఎందుకు భయపడతారు? సైంధవ్ గతంలో ఏం చేశాడు? పాపని ఎలా బతికించుకుంటాడు? ఆ కంటైనర్లు బయటకి వచ్చాయా? అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే...
డైరెక్టర్ శైలేశ్‌కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే స్టోరీ లైన్‌ను ట్రైలర్‌లోనే చెప్పేస్తాడు. అంతా చెప్పేస్తే ఇంక ఇంట్రెస్టింగ్ ఏముంది అనుకునే వారిని తన స్క్రీన్ ప్లే, స్టోరీ నెరేషన్‌తో ఆకట్టుకుంటాడు. ఇదే ఫార్ములాను హిట్, హిట్ -2కి వాడి సూపర్ హిట్లు అందుకున్నాడు. సరిగ్గా సైంధవ్‌కి కూడా ఇదే చేశాడు డైరెక్టర్. స్టోరీ అంతా మనకి తెలిసినా దాన్ని చూపించే విధానంతో ఇంప్రెస్ చేశాడు. వెంకటేష్ ఇప్పటివరకూ చాలా సినిమాలు చేశారు. కామెడీ, యాక్షన్, డ్రామా, సెంటిమెంట్ ఇలా ప్రతి జోనర్‌ను టచ్ చేశారు. కానీ సైంధవ్ సినిమాలో మాత్రం వెంకీ మామతో కొత్త ప్రయోగమే చేశాడు శైలేష్. సినిమా మొత్తం హై యాక్షన్ సీన్లు చేయిస్తూనే వెంకీ మార్క్ ఎమోషన్, సెంటిమెంట్‌ను బయటికి తీశాడు. సినిమా మొత్తం చాలా స్టైలిష్‌గా ఉంది. సినిమా మొదటి అరగంట నెమ్మదిగా సాగుతుంది. కానీ ఆ తర్వాత మాత్రం వెంకీ మామతో పాటు స్టోరీ కూడా ఊపందుకుంటుంది. ముఖ్యంగా ‘సైకో ఈజ్ బ్యాక్’ అంటూ విలన్లు గజగజలాడే సీన్లలో ఇంటెన్సిటీ అదిరిపోయింది. ప్రీ ఇంటర్వెల్ సీన్లో విలన్లకి వెంకీ వార్నింగ్ ఇచ్చే సీన్ సినిమాకే హైలెట్. ఇక సినిమా మొత్తం లెక్క మారుతుందిరా నా కొడకల్లారా అంటూ వెంకీ డైలాగ్ చెప్పిన ప్రతి సారీ విజిల్స్ పడటం పక్కా. సెకండాఫ్‌యే సినిమాని నిలబెట్టింది. ఓవైపు యాక్షన్ సీన్లను హోరెత్తిస్తూనే ఎమోషనతో హార్ట్ టచ్ చేశాడు డైరెక్టర్. ఇక క్లైమాక్స్‌లో సీక్వెల్‌కి కూడా హింట్ ఇచ్చాడు డైరెక్టర్.
నటీనటుల విషయానికొస్తే..
ఇక సినిమాలో వెంకీ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎమోషనల్ సీన్లతో ఏడిపించడం వెంకీకి కొత్తేం కాదు. కానీ ఇందులో కొన్ని సీన్లలో వెంకటేష్‌ని చూసినప్పుడు ఆడియన్స్‌కి తెలీకుండానే గుండె బరువెక్కిపోతుంది. ముఖ్యంగా తన కూతురిని కాపాడుకోలేకపోతున్నాననే బాధ గుండెను కోసేస్తున్నా నవ్వుతూనే తన పాపతో మాట్లాడే సీన్ వేరే లెవల్‌లో ఉంది. ఫ్యాన్స్ తన నుంచి ఏం కోరుకుంటారో అది నూటికి నూరు శాతం ఇచ్చారు వెంకటేష్. యాంగ్రి మ్యాన్‌గా కనిపిస్తూనే తల్లడిల్లిపోయే తండ్రిగానూ ఒదిగిపోయారు. ఇక సినిమాలో మరో హైలెట్ నవాజుద్దీన్ సిద్ధిఖీ నటన. బాలీవుడ్‌లో ఇప్పటివరకూ ఎన్నో గొప్ప పాత్రలు చేసిన నవాజుద్దీన్‌కి ఇదే తొలి తెలుగు సినిమా. ఇక దీనికి ఆయనే ఓన్ డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు. సినిమా మొదటి నుంచి చివరి వరకూ నవాజుద్దీన్ బాగా ఆకట్టుకున్నారు. డైలాగ్ డెలివరీ కానీ ఫేస్‌లో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ లేకుండా భయపెట్టడం కానీ ఇలా ప్రతి సీన్‌లోనూ తన యాక్టింగ్ టాలెంట్ చూపించారు. ఇక సినిమాలో కామెడీ బాధ్యతను కూడా నవాజుద్దీన్‌యే చూసుకున్నారు. ఎవరినైనా తిట్టేటప్పుడు అంటూ క్రికెటర్‌ని వాడేశారు. ఖచ్చితంగా ఇక తెలుగులో కూడా నవాజుద్దీన్ బిజీ అవడం ఖాయం. ఇక మనో పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ సరిగ్గా సరిపోయింది. వెంకటేష్, పాపతో ఎమోషనల్ సీన్లలో బాగా నటించింది. ఇక డాక్టర్ పాత్రకి ఉన్నంత పరిధిలో రుహానీ కూడా న్యాయం చేసింది. ఇక వెంకీ ఫ్రెండ్ మానస్ పాత్రలో తమిళ హీరో ఆర్య కనిపించారు. రెండు మూడు ఫైట్ సీన్లు మాత్రమే ఆర్యకి ఉన్నాయి. ఇక నవాజుద్దీన్ గర్ల్ ఫ్రెండ్ జాస్మిన్ క్యారెక్టర్‌లో ఆండ్రియా చాలా స్టైలిష్‌గా కనిపించింది. ఇక చివరిగా వెంకటేష్ కూతురు గాయత్రిగా బేబీ సారా నటన అందరినీ ఆకట్టుకుంది. చిన్నారి యాక్టింగ్ చాలా రోజుల పాటు గుర్తుండిపోతుంది. మొత్తానికి సైంధవ్ అయితే వెంకీ ఫ్యాన్స్‌కి బాగా నచ్చుతుంది.. కామన్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది. వయెలన్స్, బ్లడ్ సీన్ల డోసు కాస్త ఎక్కువగానే ఉన్నా ఈ మధ్య ప్రతి సినిమాలోనూ అవి కామన్ అయిపోయాయి. సో ఓవరాల్‌గా సంక్రాంతికి వెంకీ మామ కూడా గట్టిగానే పోటీ ఇస్తున్నాడు.
సాంకేతిక అంశాలు..
సంతోష్ నారాయణన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో, బుజ్జికొండవే సాంగ్ లో మ్యూజిక్ మనసుకి హత్తుకుంటుంది. మిగిలిన పాటలు మాత్రం పర్వాలేదనిపిస్తాయి. మణికందన్ సినిమాటోగ్రఫీ చాలా స్టైలిష్ గా ఉంటుంది. వెంకీమామని చాలా స్టైలిష్ గా చూపించారు. చంద్రప్రస్థ అనే ఊరిని, సముద్రం లొకేషన్స్, పోర్ట్.. అన్నిటిని చాలా చక్కగా చూపించారు. ఇక దర్శకుడు శైలేష్ కొలను ఆల్రెడీ ‘హిట్’ సినిమాలతో సక్సెస్ అయ్యాడు. ఇందులో కూడా కథ కథనాన్ని చక్కగా రాసుకొని దర్శకుడిగా కూడా బాగా తెరకెక్కించి సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు.