తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. పులి బయటికొస్తుందని ఇటీవల వ్యాఖ్యలు చేసిన కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. పులి బయటికి వస్తే బోనులో వేసి చెట్టుకు వేళాడదీస్తామని రేవంత్ వ్యాఖ్యలు చేశారు. అయితే తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం లండన్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్న తెలంగాణ వ్యక్తులు, కాంగ్రెస్ అభిమానులతో రేవంత్ భేటీ అయ్యారు. ఆ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ చుద్దామన్నా కూడా కనిపించదని వ్యాఖ్యానించారు.అంతేకాదు వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ గుర్తే ఉండదని రేవంత్ అన్నారు. కేసీఆర్‌ను పులితో పోల్చిన కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో రేవంత్ రెడ్డి లండన్ వేదికగా స్పందించారు. ఒక్క ఎన్నిక విషయంలోనే బీఆర్‌ఎస్ నేతలు బొక్కబోర్లా పడ్డారని ఎద్దేవా చేశారు. అయినప్పటికీ బీఆర్‌ఎస్ నేతలకు మాత్రం ఆహంకారం తగ్గలేదన్నారు. వారి గర్వం, అహంకారం తగ్గించే బాధ్యత తనదేనని రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఓటమిపాలైన తర్వాత వారికి భయం పట్టుకుని ఇలా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.
ఎంతో మందిని చూశాం...మీరెంత ?
కరెంట్ బిల్లులు కట్టవద్దు...
ఈ జనవరి నెల కరెంటు బిల్లులను ఎవరూ కట్టవద్దని కేటీఆర్ సూచించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకమైన గృహజ్యోతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా మహాలక్ష్మి ద్వారా ప్రతి ఒక్క మహిళకు రూ.2500 వెంటనే ఇవ్వాలన్నారు. హామీలను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. బీజేపీతో బీఆర్‌ఎస్‌కు ఏరోజూ పొత్తు లేదన్న కేటీఆర్.. భవిష్యత్ లోనూ ఉండదన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా గెలుపొంది, కేంద్రమంత్రి పదవి చేపట్టిన కిషన్ రెడ్డి ఈ ఐదేండ్లల్లో ఏం చేశారో చెప్పాలని ఆక్షేపించారు. కేసీఅర్ ప్రపంచంలోనే అతిపెద్ది లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే కిషన్ రెడ్డి మాత్రం సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ లో లిప్ట్ లను జాతికి అకింతం చేశారని ఎద్దేవా చేశారు.
కార్యకర్తలకు కృతజ్ఞతలు..
హైదరాబాద్ నగరంలో గులాబీ జెండాకు ఎదురులేదని బలమైన సందేశం ఇచ్చిన పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ ధన్యవాదాలు చెప్పారు. రాష్ట్రంలో బీజేపీని అడ్డుకున్నది బీఆర్‌ఎస్ పార్టీనే అని వెల్లడిరచారు. కేవలం 50 రోజుల కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల నుంచి మొదలుకొని అనేకమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతన్నలకు రైతుబంధు అందడం లేదు.. మహిళలకు ఇస్తామన్న రూ.2500 రావడం లేదు.. కాంగ్రెస్ ఇచ్చినవి ఆరు గ్యారంటీలు కాదు 420 హామీలు అని ప్రజలు గుర్తుంచుకోవాలని కోరారు. వివిధ డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసేదాకా వెంటాడతామని కేటీఆర్ స్పష్టం చేశారు.