YS Sharmila : జగన్‌ రాజకీయ భవిష్యత్తుకు ముప్పుగా షర్మిల ?

0

ఏపీలో కాంగ్రెస్‌ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. షర్మిలకు పార్టీ పగ్గాలతో పట్టు పెంచుకొనే ప్రయత్నం చేస్తోంది. రేవంత్‌ సేవలను అవసరమైన సమయంలో ఏపీలో వినియోగించుకోవాలని భావిస్తోంది. షర్మిల పార్టీ లో చేరగానే కీలక బాధ్యతలు ఇచ్చిన పార్టీ నాయకత్వం కట్టబెట్టింది. షర్మిల ఎంట్రీతో జగన్‌ కే నష్టమనే వాదన ఉంది. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.ఎక్కడ కనివిని ఎరుగని రీతిలో ఒకే రాష్ట్రంలో రెండు వేర్వేరు పార్టీలకి సొంత అన్నాచెల్లెళ్లు అధ్యక్షత వహించడం ఇదే మొదటిసారి. వైస్‌ రాజశేఖర్‌ రెడ్డి కుమారుడు జగన్‌ కుమార్తె షర్మిల ఒకరితో ఒకరు పోటీకి సై అంటున్నారు. వైస్‌ జగన్‌ వైసీపీ అధినేతగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కొనసాగుతుండగా.. వైస్‌ షర్మిల ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా కాంగ్రెస్‌ పగ్గాలను చేపట్టింది. గతంలో అన్న గెలుపు కోసం శ్రమించిన షర్మిల ఇప్పుడు అన్న పైన గెలుపు కోసం సన్నాహాలు చేస్తుంది. అయితే కాంగ్రెస్‌ పార్టీ వైస్‌ షర్మిలకు ఏపీ కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలను పట్టించడం వెనుక మర్మమేంటి..? వైస్‌ షర్మిల జగన్‌ రాజకీయ భవిష్యత్తుకి ముప్పుగా మారనుందా..? విశ్లేషకుల అభిప్రాయం ఏంటి..? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఓటు బ్యాంకును కాంగ్రెస్‌ వైపు ఆకర్షించేందుకు !

జగనన్న వదిలిన బాణం వైస్‌ షర్మిల. అయితే కాంగ్రెస్‌ పార్టీ ఆ బాణం దిశను మార్చి జగన్‌ వైపు ఎక్కుపెట్టింది. అధికార ప్రభుత్వాన్ని కూలదోయడానికి వైస్‌ జగన్‌ పైకి అయన చెల్లెలు వైస్‌ షర్మిలనే అస్త్రంగా ప్రయోగిస్తోంది..ఇదే ప్రస్తుతం రాజకీయ విశ్లేషకుల మాట. అయితే కాంగ్రెస్‌ పార్టీ వైస్‌ షర్మిలకు అధ్యక్షురాలి హోదా కలిపించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. మొదటిది ఆమె వైస్‌ రాజశేఖర్‌ కుమార్తె.. కనుక ఆమె అధ్యక్షురాలిగా ఉంటె.. కాంగ్రెస్‌ పార్టీ పై ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వైస్‌ రాజశేఖర్‌ రెడ్డి పై ఉన్న అభిమానంతో అయినా ప్రజలు ఓట్లేస్తారు. ఇక అధికార పార్టీ అయిన వైసీపీకి ప్రజల్లో ఎలాగో వ్యతిరేకత ఉంది. కనుక వైస్‌ షర్మిల ఉంటె జగన్‌ కి ఇచ్చినట్లే వైస్‌ కుమార్తె అయిన షర్మిలకు కూడా ప్రజలు ఓ అవకాశం ఇస్తారని కాంగ్రెస్‌ ఆశపడుతోంది. ఇక షర్మిల భర్త అనీల్‌ క్రైస్తవ బోధకుడుగా ఉన్నారు. కనుక ఆయన అభిమానులైన క్రైస్తవుల ఓట్లు కూడా అయన పై ఉన్న అభిమానంతో ఆయన సతీమణి షర్మిలకు వేసే అవకాశం ఉంది అని కాంగ్రెస్‌ ఆలోచన. ఇక జగన్‌ ప్రత్యేక పార్టీ పెట్టినప్పుడు జగన్‌ వెంట నడిచిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికే జగన్‌ తీరు పై అసహనంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో షర్మిల ఏపీ కాగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా ఉంటె కాంగ్రెస్‌ నుండి వైసీపీకి వెళ్లిన వైస్‌ రాజశేఖర్‌ రెడ్డి అభిమాన నేతలు తిరిగి సొంతగూటికి చేరుతారు. దీనితో కాంగ్రెస్‌ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం చేకూరుతుంది అనే ఉద్దేశంతో షర్మిలకు కాంగ్రెస్‌ అధిష్టానం అధ్యక్షురాలి హోదా కల్పించింది. అయితే కాంగ్రెస్‌ తలచినట్లు రానున్న ఎన్నికల్లో గెలుస్తుందో లేదో పక్కన పెడితే.. షర్మిల రాక మాత్రం వైసీపీకి ముప్పే అంటున్నారు విశ్లేషకులు. షర్మిల కాంగ్రెస్‌ లో ఉంటె.. వైసీపీ సీట్లను, ఓట్లను కొల్లగొట్టడం ఖాయం అని.. షర్మిల జగన్‌ రాజకీయ భవిష్యత్తుకు ముప్పుగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పరోక్షంగా టీడీపీకి లాభం !

ఒకప్పటి కాంగ్రెస్‌ సాంప్రదాయ ఓటు బ్యాంక్‌ మొత్తం వైసీపీ వైపు మళ్ళింది. షర్మిల రాకతో ఒక వేళ కాంగ్రెస్‌ పుంజుకుంటే జగన్‌ ఓటు బ్యాంకు కాంగ్రెస్‌ లాగేసుకుంటుంది. జగన్‌ ఓటు బ్యాంకు చీలిపోతే టీడీపీ`జనసేన కూటమి లాభపడుతుందని అంచనా వేస్తోంది. ఒక వేళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే టీడీపీ`జనసేన కూటమీకి పడే ఓట్లు చీలే అవకాశమే ఎక్కువ ఉంది. జగన్‌ సంక్షేమ పథకాలను నమ్ముకున్నారు. ప్రభుత్వం నుండి లబ్ది పొందిన వారిలో 80% జగన్‌ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని సర్వేలు ఘోషిస్తున్నాయి. 

పుంజుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ తిరిగి పంజుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. 2014లో రాష్ట్ర విభజన సమయం నుంచి కాంగ్రెస్‌ భారీగా దెబ్బ తింది. కాంగ్రెస్‌ ఓట్‌ బ్యాంక్‌ మొత్తం జగన్‌ వైపు టర్న్‌ అయింది. ఆ ఓటు బ్యాంక్‌ మరోసారి తమ వైపు తిప్పుకోవాలంటే షర్మిలతో సాధ్యమని కాంగ్రెస్‌ నాయకత్వం భావిస్తోంది. షర్మిలకు పీసీసీ పగ్గాలు ఇవ్వటం ద్వారా జగన్‌ ఓట్‌ బ్యాంక్‌ కు గండి పడుతుందని..ఈ పరిణామం పరోక్షంగా తమకు సహకరిస్తుందని టీడీపీ భావిస్తోంది.ఈ సమయంలోనే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్‌ గా నియమితులైన మాణిక్కం ఠాగూర్‌ తమ లక్ష్యం స్పష్టం చేసారు. ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేన మూడు పార్టీలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని విమర్శిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కాంగ్రెస్‌ తోనే సాధ్యమని చెబుతున్నారు. 

మూడు పార్టీలు లక్ష్యంగా

వైసీపీలో టికెట్లు దక్కక ..ఆ పార్టీకి దూరంగా ఉండేవారిని తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. అందులో భాగంగా కొందరు సీనియర్లు రంగంలోకి దిగినట్లు సమాచారం. అయితే, ఇప్పటి వరకు షర్మిల ఎంట్రీ ద్వారా జగన్‌ కు నష్టమనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అయితే, పార్టీ హైకమాండ్‌ ఏపీలో జగన్‌, చంద్రబాబు లక్ష్యంగా దూకుడుగా వెళ్లాలని షర్మిలకు స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలో రెండు పార్టీల్లోనూ సీట్లు రాని వారిని పార్టీలోకి చేర్చుకొనేలా వ్యూహ రచన ఉండాలని తేల్చి చెప్పింది. ఎన్నికల నాటికి ఏపీలో అవసరం మేర తెలంగాణ సీఎం రేవంత్‌ సేవలను వినియోగించుకోవాలని భావిస్తోంది. జగన్‌ తో పాటుగా చంద్రబాబు, పవన్‌ ను లక్ష్యంగా చేసుకొని రాజకీయ పోరాటం ఉండాలని ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. దీని ద్వారా మూడు పార్టీలతో పాటుగా బీజేపీకి తామే ప్రత్యామ్నయం అనేది బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశా నిర్దేశం చేసింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !