Fake CID : నకిలీ సీఐడీ అధికారుల అవతారంలో ఐటీ కంపెనీలో దోపిడీ !

0

  • ముగ్గురు ఉద్యోగుల కిడ్నాప్‌.. రూ.12 లక్షల దోపిడీ
  • ఏపీకి చెందిన ఎస్సై, న్యాయవాది సహా పది మంది నిందితులు

సీఐడీ అధికారులమంటూ సోదాల పేరుతో ఐటీ కార్యాలయంలోకి చొరబడ్డారు.  ముగ్గురు ఉద్యోగులను కిడ్నాప్‌ చేసి ఖాతాల్లోని డబ్బులు తమ అకౌంట్లలోకి మళ్ళించారు. ఈ దోపిడీలో ఆ కంపెనీ పూర్వ ఉద్యోగే సూత్రధారిగా వ్యవహరించగా.. ఏపీకి చెందిన ఓ ఎస్సై, న్యాయవాది, ఐటీ నిపుణుడు పథక రచన చేసినట్లు తేలింది. మంగళవారం గచ్చిబౌలిలోని తన కార్యాలయంలో మాదాపూర్‌ డీసీపీ డా.వినీత్‌ ఈ వివరాలు వెల్లడిరచారు. కర్ణాటకకు చెందిన దర్శన్‌ సుగుణాకరశెట్టి గచ్చిబౌలిలో అజా(ఏజేఏ) పేరిట యాడ్స్‌ సంస్థను నిర్వహిస్తున్నారు. ఇందులో అమెరికాలో ఐటీ నియామకాల కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ పనిచేసి మానేసిన షేక్‌పేట ఓయూకాలనీ వాసి అక్కెర రంజిత్‌కుమార్‌(47)కు ఏపీలోని వైయస్‌ఆర్‌ జిల్లా న్యాయవాది పొలిమేర మహేంద్రకుమార్‌(38)తో పరిచయం ఉంది. సుగుణాకర నుంచి భారీగా డబ్బు కొల్లగొట్టే అవకాశం ఉందని మహేంద్రకు చెప్పాడు. అనంతరం ఇద్దరూ కర్నూలు డీఐజీ రేంజ్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఎస్సై సుజన్‌ను సంప్రదించారు. ఆయన వారికి కడపలోని అశోక్‌నగర్‌ చిన్నచౌక్‌కు చెందిన ఐటీ నిపుణుడు షేక్‌మహ్మద్‌ అబ్దుల్‌ ఖదీర్‌(33)ను పరిచయం చేశాడు. మహేందర్‌, ఖదీర్‌తో పాటు సందీప్‌కుమార్‌, రఘురాజు, రాజా కలిసి ఈ నెల 26వ తేదీ అర్ధరాత్రి.. సీఐడీ అధికారులమంటూ అజా కార్యాలయంలోకి ప్రవేశించారు. గుర్తింపుకార్డులు చూపించాలని సుగుణాకర వారిని అడగగా ఖదీర్‌ తన సెల్‌ఫోన్‌లో ‘అసిస్టెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ ఏపీ సీఐడీ సైబర్‌ క్రైమ్స్‌’ పేరుతో ఉన్న వాటిని చూపించాడు.

రూ.10 కోట్ల నుంచి రూ.2.3 కోట్లకు..

అమెరికాలోని క్లైంట్‌ విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆ దేశ అధికారులు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయడంతో.. ఈ దాడి చేశామంటూ  డైరెక్టర్‌ను  భయపెట్టారు. దీని నుంచి బయటపడాలంటే రూ.10 కోట్లు తమకు ముట్టజెప్పాలని డిమాండ్‌ చేశారు. చివరకు రూ.2.3 కోట్లకు అంగీకారం కుదిరింది. కంపెనీ ఖాతాల్లో రూ.71.80 లక్షలు ఉన్నాయని బాధితుడు చెప్పాడు. నేరుగా తీసుకుంటే దొరికిపోతామన్న ఆలోచనతో నిందితులు అక్కడి ఉద్యోగులు రవి, చేతన్‌, హరి పొన్నాల ఖాతాల్లోకి రూ.26 లక్షలు బదిలీ చేయించారు. తరువాత ఉదయం 6.30 గంటల(27వ తేదీ)కు ఆ ముగ్గురు ఉద్యోగులను మాదాపూర్‌లోని బాల్కనీ హోటల్‌కు తీసుకెళ్లి బంధించారు. ఏటీఎం కార్డులు, బ్యాంకు వివరాలు తీసుకొని రూ.12.5 లక్షలు తమ ఖాతాలోకి మార్చుకున్నారు. మిగతా సొమ్ము కోసం డైరెక్టర్‌కు ఫోన్‌ చేసినా స్పందన రాకపోవడంతో వారిని వదిలేసి పారిపోయారు. దీంతో సుగుణాకర అదే రోజు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు 28న నిందితులను పట్టుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. ఈ కేసులో వీరికి సహకారం అందించిన విజయశేఖర్‌, రాహుల్‌, సుబ్బకృష్ణలతో కలిపి మొత్తం పది మంది నిందితులుగా తేలింది. ఎనిమిది మందిని అరెస్టు చేయగా ఎస్సై సుజన్‌, రాజా పరారీలో ఉన్నారు. వారు వినియోగించిన నాలుగు కార్లు, 16 సెల్‌ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !