Hanuman Movie Review : హనుమాన్‌ సినిమా రివ్యూ

0

ప్రశాంత్‌ వర్మ ఎప్పుడూ ప్రయోగాలే అంటే ఇష్టం అనుకుంటూ, కొత్త కథల్ని చెప్పడానికి ట్రై చేస్తుంటాడు. అ!, కల్కి, జాంబీ రెడ్డి ఇలా అన్నీ కూడా డిఫరెంట్‌ జానర్స్‌. ఈ సారి హనుమాన్‌ అంటూ సూపర్‌ మ్యాన్‌ తరహాలో ఓ సినిమాను తీశాడు. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్‌ అన్నీ కూడా సినిమా మీద అంచనాలు పెంచేశాయి. అసలే ఈ హనుమాన్‌ మీద ఆదిపురుష్‌తో పోలికలు ఎక్కువగా ఉన్నాయి. ముందు నుంచి కూడా ఆదిపురుష్‌తో పోలుస్తూ.. హనుమాన్‌ క్వాలిటీ మీద చర్చలు జరుగుతూనే వచ్చాయి. అందుకే హనుమాన్‌ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి హనుమాన్‌ అందరి అంచనాలు అందుకుందా? లేదా? అన్నది రివ్యూ చూద్దాం.

కథ

మైఖేల్‌ (వినయ్‌ రాయ్‌)కు చిన్నప్పటి నుంచి సూపర్‌ హీరో అవ్వాలని బలమైన కోరిక. అందుకు అడ్డు వస్తున్నారని చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కూడా మట్టు పెడతాడు. ఆ తర్వాత సూపర్‌ హీరో అయ్యేందుకు రకరకాల ప్రయోగాలు చేయడం ప్రారంభిస్తాడు. కానీ, అతని ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. దీంతో అసలు సిసలు సూపర్‌ పవర్స్‌ కనిపెట్టేందుకు వేట మొదలు పెడతాడు. మరో వైపు హన్మంతు (తేజ సజ్జా) తన అంజనాద్రి ఊరులో అల్లరి చిల్లర దొంగతనాలు చేసుకుంటూ కాలం గడుపుతుంటాడు. అంజమ్మ (వరలక్ష్మీ శరత్‌ కుమార్‌) తన తమ్ముడు హన్మంతుతో కలిసి ఉంటుంది. మీనాక్షి (అమృతా అయ్యర్‌) అంటే చిన్నతనం నుంచి కూడా హన్మంతుకు ప్రాణం. కానీ ఎప్పుడూ కూడా మనసు విప్పి చెప్పడు. ఇక అంజనాద్రి.. పాలేగాళ్లు గజపతి అదుపులో ఉంటుంది. అక్కడ ఎదురుతిరిగిన వాడిని మల్లయుద్దంలో ప్రాణాలు తీస్తుంటాడు గజపతి. గజపతిని మీనాక్షి ఎదురిస్తుంది. ఓరోజు గజపతి తన బందిపోటు ముఠాతో ఆమెపై దాడి చేయిస్తాడు. అయితే ఆ దాడి నుంచి మీనాక్షిని కాపాడే ప్రయత్నంలో హనుమంతు తీవ్రంగా గాయపడతాడు. అతన్ని బందిపోటు ముఠా నీళ్లలో పడేయగా.. దాంట్లో అతనికి ఆంజనేయస్వామి రక్త బిందువుతో రూపొందిన రుధిరమణి దొరుకుతుంది. అది తన చేతికొచ్చిన తర్వాత నుంచి హనుమంతు జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. అప్పటి నుంచే హన్మంతుకు సూపర్‌ పవర్స్‌ వస్తాయి. ఆ తరువాత హన్మంతు ఏం చేశాడు? పాలెగాళ్ల నుంచి ఊరిని కాపాడాడా? ఈ అంజనాద్రి మీద మైఖేల్‌ కన్ను ఎలా పడిరది? హన్మంతు దగ్గరున్న సూపర్‌ పవర్‌ను మైఖేల్‌ దక్కించుకోవడానికి ఏం చేశాడు? అసలు ఈ కథలో సముద్రఖని పాత్ర ఏంటి? చివరకు ఆ రుధిర మణి ఏమవుతుంది? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే హనుమాన్‌.ఓ సామాన్య వ్యక్తికి అతీంద్రయ శక్తులు రావడం, వచ్చిన ఆ సూపర్‌ న్యాచురల్‌ పవర్స్‌తో విన్యాసాలు చేయడం అనే కాన్సెప్టులతో దాదాపుగా హాలీవుడ్‌లోనే ఎక్కువగా చిత్రాలు వస్తాయి. అందుకే అక్కడ సూపర్‌ మ్యాన్‌, బ్యాట్‌ మ్యాన్‌, స్పైడర్‌ మ్యాన్‌, ఐరన్‌ మ్యాన్‌ అంటూ ఇలా లెక్కలేనన్ని మ్యాన్‌లు తెరపైకి వచ్చాయి. అయితే వీటన్నంటికి మూలం మన పురాణేతిహాసాల్లోనే ఉంటుంది. మన పురాణాల్లో ఈ పాత్రలన్నీ ఉంటాయి. కానీ మన మేకర్లు మాత్రం అలాంటి కాన్సెప్టులతో సినిమా తీసేందుకు సాహసం చేయరు. అంతగా ఆలోచించరు. ఈ మధ్య అంటే మిన్నళ్‌ మురళీ అనే ఓ మలయాళీ చిత్రం వచ్చింది. అది మన ఇండియన్‌ సూపర్‌ హీరో సినిమా అని చెప్పొచ్చు.


ఎలా సాగిందంటే

సూపర్‌ హీరో కథలు పిల్లలకు భలే ఎక్కేస్తుంటాయి. పిల్లల్ని ఆకట్టుకునేందుకు సూపర్‌ హీరో కాన్సెప్టులు అనేది మంచి ఉపాయం. ఈ సంక్రాంతికి పిల్లలకు హాలీడే. పిల్లలకు సాధారణంగానే హనుమంతుడు అంటే మహా ఇష్టంగా ఉంటుంది. అలాంటి ఆంజనేయుడి కాన్సెప్టు, హనుమాన్‌ సినిమా అంటే సహజంగానే పిల్లల మనసు పడుతుంది. సరిగ్గా పిల్లల మైండ్‌కు ఏం నచ్చుతుంది.. ఎలా తీస్తే పిల్లలకు ఎక్కుతుంది అనేది ప్రశాంత్‌ వర్మ పట్టేసుకున్నాడు.ఈ సినిమా టైటిల్‌ కార్డ్స్‌ నుంచే ప్రేక్షకులకు కథను పరిచయం చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. కథలో కీలకమైన రుధిరమణి కథను అక్కడ వివరించి.. ఆ వెంటనే విలన్‌ చిన్ననాటి ఎపిసోడ్‌తో సినిమాని ఆసక్తికరంగా ప్రారంభించాడు. సూపర్‌ హీరో అవ్వాలనే కోరికతో మైఖేల్‌ చేసే ప్రయత్నాలు.. ఈ క్రమంలో తనకు అడ్డుగా నిలుస్తున్నారని తల్లిదండ్రుల్ని మట్టుబెట్టడం.. మిస్టరీ మ్యాన్‌ అవతారంలో బ్యాంకు దొంగతానికి వచ్చిన ఓ రౌడీ ముఠాను చితక్కొట్టడం.. అన్నీ ఆకట్టుకునేలాగే ఉంటాయి. ఇక అంజనాద్రి ఊరు.. దాన్ని పరిచయం చేసిన తీరు కనులవిందుగా ఉంటుంది. కానీ, ఆ తర్వాత నుంచి కథ కాస్త నెమ్మదిస్తుంది. హీరో పరిచయ సన్నివేశాలు ఫర్వాలేదనిపిస్తాయి. హన్మంతు పాత్రకు ఎప్పుడైతే సూపర్‌ న్యాచురల్‌ పవర్స్‌ వస్తాయో సినిమా స్కోపే మారిపోతుంది. పిల్లలు ఆ సీన్లను భలే ఎంజాయ్‌ చేస్తారు. ఇక వీటికి తోడు సత్య, గెటప్‌ శ్రీనుల ఆహార్యం, కామెడీ కూడా పిల్లల్ని నవ్విస్తుంది. ప్రథమార్దం అంతా కూడా సరదా సరదాగా సాగుతుంది. ఇంటర్వెల్‌కు సమస్య మొదలవుతుంది. సెకండాఫ్‌లో ఎలివేషన్ల సీన్లను లెక్కపెట్టలేం. ప్రతీ సీన్‌ ఎలివేషన్‌లా ఉంటుంది. కొండలాంటి బండను అవలీలగా ఎత్తే సీన్‌ అద్భుతంగా ఉంటుంది. చిన్న పిల్లలకు అలాంటి సీన్లే ఎక్కువగా ఎక్కేస్తుంటాయి. బుల్లెట్ల వర్షంతో వెనకాల శ్రీరాముని రూపం రావడం, ఆ సీన్‌లోని ఆర్‌ఆర్‌.. అన్నీ కలిపి దండంపెట్టేలా చేస్తాయి. ఇక నార్త్‌ ఆడియెన్స్‌కు పిచ్చెక్కడం ఖాయం. ఈ హనుమాన్‌ సినిమా నార్త్‌ ఆడియెన్స్‌కు బాగా ఎక్కేలా చేయడంలో సెకండాఫ్‌ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక చివర్లో ఆంజనేయుడి ఆగమనం అద్భుతంగా అనిపిస్తుంది. కమెడియన్‌ సత్య పిచ్చుకగూళ్లు కాన్సెప్ట్‌.. ఆ పిచ్చుక సైతం పిల్లల్ని తెగ నవ్వించేస్తుంది. మీనాక్షితో అతని ప్రేమకథ పెద్దగా ఫీల్‌ ఉండదు. ఊరి పాలెగాడు గజేంద్రకు ఎదురు తిరగడం.. అతను మీనాక్షిని చంపేందుకు తన బందిపోటు ముఠాను రంగంలో దించడంతో కథ వేగం పుంజుకుంటుంది.  ఇక హీరో ఆ ముఠా చేతిలో చావు దెబ్బలు తిని నదిలో పడటం.. అక్కడ అతనికి రుధిరమణి దొరకడం కథ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. హనుమంతుకు సూపర్‌ పవర్స్‌ వచ్చినప్పటి నుంచి కథ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లా పరుగులు పెడుతుంది. అతను తన శక్తుల్ని ఉపయోగించి స్కూల్లోని రౌడీ మూకకు బుద్ధి చెప్పే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. ఇక విరామానికి ముందు పాలెగాడు గజేంద్రతో అతను కుస్తీ పోటీలో పాల్గొనే ఎపిసోడ్‌ భలే కిక్‌ ఇస్తుంది. అదే సమయంలో మైఖేల్‌ను అంజనాద్రిలోకి దింపి ద్వితీయార్ధంపై మరింత ఆసక్తి కలిగించే ప్రయత్నం చేశాడు.రుధిరమణిని సంపాదించడం కోసం మైఖేల్‌ చేసే ప్రయత్నాలు.. ఈ క్రమంలో అతని ద్వారా అంజనాద్రికి ముప్పు ఏర్పడటం.. ఆ ముప్పు నుంచి ఊరిని.. ఊరి ప్రజల్ని కాపాడేందుకు హనుమంతు చేసే ప్రయత్నాలతో ద్వితీయార్ధం సాగుతుంది. ఈ మధ్యలో ఆవకాయ ఆంజనేయ పాటలో వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌, పెళ్లిలో హనుమంతుపై దాడి చేసినప్పుడు అతని అక్క అంజమ్మ పోరాడే తీరు.. అన్నీ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా మైఖేల్‌ స్థావరంలోకి హనుమంతు వెళ్లినప్పుడు అక్కడ వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌ హైలైట్‌. ఇక క్లైమాక్స్‌ చివరి 20నిమిషాలు ప్రేక్షకుల్ని చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. హిమాలయాల్లోని హనుమంతుడు లోక కల్యాణార్థం తిరిగి వచ్చే సన్నివేశాలు పూనకాలు తెప్పించేలా ఉంటాయి. ‘రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి?’ అంటూ ఓ ఆసక్తికర ప్రశ్నతో రెండో భాగానికి లీడ్‌ ఇస్తూ సినిమాని ముగించిన తీరు బాగుంది. మరి ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే వచ్చే ఏడాది రానున్న ‘జై హనుమాన్‌’ చూడాలి.

ఎవరెలా చేశారంటే

హనుమంతు పాత్రలో ఓ సామాన్య కుర్రాడిలా తేజ సజ్జా ఒదిగిన తీరు మెప్పిస్తుంది. ఇక సూపర్‌ పవర్స్‌ వచ్చాక అతను చేసే సందడి ఇంకా అలరిస్తుంది. ఇటు యాక్షన్‌లోనూ.. అటు భావోద్వేగభరిత సన్నివేశాల్లోనూ తేజ తన పాత్ర పరిధి దాటకుండా చక్కటి నటనను కనబరిచాడు. పల్లెటూరి అమ్మాయి మీనాక్షిగా అమృత అయ్యర్‌ తెరపై అందంగా కనిపించింది. కథలో ఆమె పాత్రకున్న ప్రాధాన్యత బాగుంది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ పాత్ర ద్వితీయార్ధంలో ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్‌ చేస్తుంది. వినయ్‌ రాయ్‌ స్టైలిష్‌ విలన్‌గా ఆకట్టుకున్నాడు. విభీషణుడిగా సముద్రఖని పాత్ర ఈ కథలో ఓ ప్రత్యేక ఆకర్షణ. ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇంత అవుట్‌ పుట్‌ తీసుకొచ్చాడా? అని ఆశ్చర్యం వేస్తుంది. ఆదిపురుష్‌ సినిమా అయితే హనుమాన్‌ ముందు తేలిపోయేట్టుంది. ఏ విషయంలోనూ చూసుకున్నా సరే హనుమాన్‌ అందనంత ఎత్తులో ఉంటుంది. టెక్నికల్‌గా ఈ చిత్రం హై స్టాండర్డ్‌లో ఉంది. విజువల్స్‌, ఆర్‌ఆర్‌ మతిపోగొట్టేలా ఉంటుంది. హనుమాన్‌ పాట, ఆర్‌ఆర్‌ వస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి.తేజ సజ్జానే ఈ పాత్రకు వంద శాతం కరెక్ట్‌. ప్రశాంత్‌ వర్మ ఎంతో ఆలోచించి, ఊహించి ఈ పాత్రకు తేజను ఎంచుకున్నట్టుగా అనిపిస్తుంది. తేజ సజ్జా లాంటి వాడికి సూపర్‌ పవర్స్‌ వస్తేనే పిల్లలు ఎంజాయ్‌ చేసేలా చూపించొచ్చు.. అదే కండలు తిరిగిన దేహం.. పెద్ద పెద్ద మీసాలు ఉన్న వాడికి సూపర్‌ పవర్స్‌ వస్తే.. అతను చేసే విన్యాసాలు కాస్త ఎబ్బెట్టుగా ఉండొచ్చు. అదే తేజ సజ్జాకు సూపర్‌ పవర్స్‌ వచ్చి.. విన్యాసాలు చేస్తూ.. విలన్లను చితక్కొడుతుంటే.. సినిమాలోని పిల్లలే కాదు.. తెర ముందు కూర్చున్న పిల్లలు కూడా చప్పట్లు కొట్టేస్తారు. అందుకే తేజ సజ్జాను ఈ పాత్రకు తీసుకున్నట్టుగా ఉన్నాడు. తేజ సైతం తెరపై సూపర్‌ హీరోలానే కనిపిస్తాడు. ఒక్కసారి ఆంజనేయుడి శక్తులు వచ్చాక.. ఎవరైనా కూడా సూపర్‌ హీరో అవ్వాల్సిందేగా. అలా తేజ సజ్జా హన్మంతు పాత్రకు వందకు వంద శాతం న్యాయం చేశాడు. సముద్రఖణి పాత్రలోని సస్పెన్స్‌ తెరపై చూస్తేనే కిక్కు. మీనాక్షిగా అమృతా అయ్యర్‌ అందంగా కనిపించింది. ఉన్నంతలో చక్కగా నటించింది. వరలక్ష్మీకి తన స్థాయికి తగ్గట్టుగా ఒకే సీన్‌ పడిరది. వినయ్‌ రాయ్‌ విలనిజం మరింతగా చూపించాల్సిందేమో. పాలెగాడిగా కనిపించిన గజపతి భయపెట్టేశాడు. గెటప్‌ శ్రీను, సత్య, రోహిణి నవ్వించేశారు. వెన్నెల కిషోర్‌కు మంచి పాత్ర దక్కింది. ఇలా ప్రతీ ఒక్క పాత్ర మెప్పిస్తుంది.పిల్లలు, పెద్దలు మెచ్చేలా సినిమాని చక్కగా ముస్తాబు చేశాడు. ఇక నేపథ్య సంగీతం విషయానికొస్తే.. ముగ్గురు సంగీత దర్శకులు తమ ప్రతిభను చూపించారు. దాశరథి శివేంద్ర ఛాయాగ్రహణం ఈ చిత్రానికి మరో ఆకర్షణగా నిలుస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా అనడంలో ఎలాంటి సందేహం లేదు.

సినిమా విశ్లేషణ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !