వైనాట్ 175 అంటూ ఈసారి కుప్పంతో సహా అన్నిచోట్ల గెలుస్తున్నాం అంటూ పలు సభలో పలికిన మాటాల్లోని గాంభీర్యత తగ్గుతోంది. ఆత్మవిశ్వాసం కాస్త శృతి మించి అతి విశ్వాసంగా మారిందన్న అనుమానం కలిగిందేమో ఏపీ సీఎం జగన్ నోటి వెంట మొదటిసారి ఓటమి మాట వచ్చింది. ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చినా ఎలాంటి విచారమూ లేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. తిరుపతిలో ‘‘ఇండియా టుడే విద్యాసదస్సులో పాల్గొన్న జగన్ ముఖాముఖిలో పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. 56 నెలల పాలనలో శాయశక్తులా చిత్తశుద్ధితో పని చేశానన్నారు. కోట్ల మంది ప్రజలకు సాయం అందించడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. 2019 ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలు, చెప్పిన పనులు చేశామని, మ్యానిఫెస్టోలో 99 శాతం అంశాలను అమలు చేశామని వివరించారు. ఆ మ్యానిఫెస్టోని ప్రజల వద్దకు తీసుకెళ్లి వారి విశ్వాసాన్ని పొందుతున్నామని, అందుకే సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించడం ఎంతో అవసరమన్న సీఎం ఆ గీతను కొనసాగిస్తూ వచ్చామని చెప్పుకొచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతునిస్తూ వస్తున్నాం అని సీఎం చెప్పారు. అంశాలవారీ మద్దతు కేవలం బీజేపీకే పరిమితమా? కేంద్రంలో ఏ పార్టీ గెలిచినా ఇలాగే మద్దతిస్తారా? అని ప్రశ్నించగా దీన్ని ఇక్కడే వదిలేద్దాం. సమయం వచ్చినప్పుడు ఆలోచిద్దాం అంటూ జగన్ దాటవేశారు.
కాంగ్రెస్‌ది విభజించు పాలించు సిద్దాంతమే !
కాంగ్రెస్ ఎప్పుడూ చెత్త రాజకీయాలే చేస్తుందని విభజించి పాలించడమే ఆ పార్టీ విధానమని జగన్ దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు తాను రాజీనామా చేసినప్పుడు బాబాయ్ వివేకానందరెడ్డికి మంత్రి పదవిచ్చి మా పైనే పోటీకి నిలిపిందని వివరించారు. ఇప్పుడు షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించి మరోసారి తమ కుటుంబాన్ని విడదీసిందన్నారు. ఎప్పుడు ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో దేవుడు చెబుతాడన్న జగన్ కాంగ్రెస్ చేసిన పనులకు తగిన ఫలితం అనుభవించక తప్పదని వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రెస్‌కు రాష్ట్రంలో ఉనికి లేదన్న సీఎం అన్నారు. తెలుగుదేశం, ఆ పార్టీతో పొత్తులో ఉన్న జనసేన, వారితో కలిసికట్టుగా వచ్చే వారితోనే వైఎస్సార్సీపీ పోటీ అని స్పష్టం చేశారు. ఐతే గెలుస్తామనే ధీమా ఉన్నప్పుడు అభ్యర్థులను ఎందుకిలా మారుస్తున్నారని ప్రశ్నించగా ఏ పార్టీ అయినా సర్వేలు చేయించుకుంటుందని, వాటి ఆధారంగా వ్యూహరచన చేసుకుంటుందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వంపై ప్రజలకు చాలా నమ్మకం ఉందని సర్వేల్లో తేలినా కొందరు నాయకులపై జనంలో ఉన్న వ్యతిరేకత, సామాజిక, రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎన్నికలకు ఇంకో 70 నుంచి 80 రోజులే ఉన్నాయని, చివరి నిమిషంలో అభ్యర్థుల్ని మార్చి గందరగోళం చేసుకోవడం ఎందుకనే ఉద్దేశంతోనే ఇప్పుడు మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల అసంతృప్తులు, గందరగోళం వంటి సమస్యలు ఎన్నికలనాటికి సమసిపోతాయన్నారు. చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు ఉన్నందునే కేసు నమోదైందని సీఐడీ లాంటి వ్యవస్థలను దుర్వినియోగం చేయలేదని వివరణ ఇచ్చారు. ఆధారాల్లేకుండా సీఐడీ కేసులు పెట్టి ఉంటే కోర్టుల్లో నిలబడవు కదా అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
పేదరికం పోవాలంటే...పేదలకు ఇంగ్లీషు మీడియం అందాలి !
తమ ప్రభుత్వం వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని ప్రజలను ధైర్యంగా అడుగుతున్నానని సీఎం జగన్ చెప్పారు. తప్పనిసరిగా మేం తిరిగి అధికారంలోకి వస్తామన్న సీఎం జగన్.. విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో పెను మార్పులు తీసుకు వచ్చామని చెప్పారు. వివక్ష లేకుండా, అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హత ఉన్న వారికి అన్నీ అందించామని, మేని ఫెస్టోలో 99.5 శాతం హామీలను నెరవేర్చామని తెలిపారు. మా ప్రభుత్వానికున్న విశ్వసనీయతకు ఇది నిదర్శనమని చెప్పిన సీఎం జగన్... రెండో సారి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడం ఖాయమని ప్రకటించారు. పేదరికం తొలగించేందుకు చదువుపై పెట్టుబడి పెట్టడం మినహా మరో మార్గం లేదన్నది నా బలమైన నమ్మకం అందుకోసమే విద్యపై దృష్టి పెట్టాం. నాణ్యమైన విద్య అందుకోవడం ప్రతీ ఒక్కరి హక్కు కావాలి. పేదలు తెలుగు మీడియంలో చదివితే, ధనిక పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుతున్నారు. ఈ అంతరం తొలగాటంటే అందరికీ ఒకే రకమైన విద్యాబోధన అవసరం అని భావించాం అన్నారు. ఆ దిశగా అడుగులు వేశాం. విజయం సాధిస్తున్నామన్నారు.