ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి విజయవాడ ఎంపీ కేశినేని నాని వెళ్లారు. వైసీపీలో చేరేందుకు కేశినేని నాని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కేశినేని నానితో ఇప్పటికే అయోధ్య రామిరెడ్డి, వెల్లంపల్లి, దేవినేని అవినాశ్, మొండి తోక అరుణ్ చర్చలు జరిపారు. ఆ తర్వాతే వారంతా ఒకే కార్‌లో తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఇప్పటికే కేశినేని నాని ప్రకటించారు. టీడీపీకి తన అవసరం లేదని చంద్రబాబు భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదని అన్నారు. తిరువూరులో జరిగిన గొడవ తర్వాత కేశినేని నాని ఈ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ నుంచి ఎంపీ టిక్కెట్ తనకు ఇవ్వట్లేదని ముగ్గురు టీడీపీ నాయకులు తనకు చెప్పారని కేశినేని నాని అంటున్నారు. కేశినేని నాని వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని, ఆయన కుమార్తె కేశినేని శ్వేత కూడా వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇవాళ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అనంతరం మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
టీడీపీకి రాజీనామా
అంతకుముందే కేశినేని కూడా టీడీపీకి రాజీనామా చేసే ఛాన్స్ ఉంది. మొదట వారం, పదిరోజుల్లో టీడీపీకి గుడ్ బై చెప్పి.. వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వచ్చినప్పటికీ ఇక ఆలస్యం చేయకుండా జగన్‌తో భేటీ కావాలని నాని భావించారట. వైసీపీ కండువా కప్పుకున్నాక విజయవాడ పార్లమెంటు స్థానం నుంచే కేశినేనిని వైసీపీ అభ్యర్థిగా అధిష్టానం బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. నాని పోటీచేయని పక్షంలో శ్వేతకు ఎంపీ టికెట్ ఆఫర్ చేస్తామని వైసీపీ హామీ ఇచ్చినట్లుగా కూడా వార్తలు వినవస్తున్నాయి. జగన్‌తో భేటీ తర్వాత టికెట్ విషయంపై సస్పెన్స్ వీడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాగా.. 2024 ఎన్నికల్లో తాను పోటీచేయనని టీడీపీ అధినేత చంద్రబాబుకు పలుమార్లు కేశినేని చెప్పారు. నాటి నుంచే నాని.. వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలతో కలివిడిగా ఉంటున్నారు. ఎందుకిలా చేస్తున్నారని అడిగితే మాత్రం హైకమాండ్‌పై అలకబూనడం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఎగ్గొట్టడం లాంటివి చేసిన సందర్భాలు కోకొల్లలు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఎంపీ నియోజకవర్గ నిధులు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు సూచించిన వారికే ఇవ్వడం గమనార్హం. దీనిపై టీడీపీ శ్రేణులు పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసినా ‘ప్రొటోకాల్’ పేరుతో నాని తన విధానాన్ని సమర్థించుకునేవారు. మరి క్యాడర్ ఎవరితో ఉంటారనేది మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది.
కేశినేని శ్వేతా రాజీనామా
రెండు రోజుల క్రితం విజయవాడ కార్పొరేషన్ లో కార్పొరేటర్ పదవికి కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేతా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మేయర్, కమిషనర్ కు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. త్వరగా తన రాజీనామాను ఆమోదింపజేయాలని కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కార్పొరేటర్ గా తన రాజీనామా ఆమోదించిన తరువాత టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఆమె ప్రకటించారు. ఏడాదిన్నరగా ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. అధినేత నందిగామ వచ్చినా, విజయవాడ వచ్చినా కేశినేని నానికి పిలుపులేదని శ్వేత ఆవేదన వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎంపీకి ఇవ్వాల్సిన గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. కేశినేని నానిని పార్టీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవద్దన్నప్పుడు పార్టీలో ఉండటం సమంజసం కాదు.. అందుకే రాజీనామా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు.
విజయవాడ వైసీపీ ఎంపీగా కేశినేని నాని
అయితే, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కేశినేని నాని ఎంపీగా పోటీ చేస్తారని, ఇండిపెండెంట్ గానా? మరో విధంగానా అనేది త్వరలో తెలుస్తోందని, మూడోసారి లోక్ సభలో కేశినేని నాని తప్పకుండా అడుగు పెడతారని శ్వేతా అన్నారు. గత కొద్దిరోజులుగా కేశినేని నాని తాను విజయవాడ నుంచి ఎంపీగా ఖచ్చితంగా పోటీచేస్తానని చెబుతున్నారు. ఢల్లీి వెళ్లాలంటే చాలా ట్రైన్లు ఉంటాయి.. ఏ ట్రైన్ ఎక్కుతాననేది నా వ్యూహం ప్రకారం ఉంటుందని నాని తన మద్దతుదారుల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ క్రమంలో కేశినేని నాని వైసీపీ ట్రైన్ ఎక్కబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ నేతలు నానితో చర్చలు జరిపారని, వైసీపీ నుంచి విజయవాడ ఎంపీగా నానిని బరిలోకి దింపేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగాసాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్ తో భేటీ తరువాత కేశినేని నాని ఎలాంటి ప్రకటన చేస్తారనే అంశం చర్చనీయాంశంగా మారింది.
జగన్‌తో భేటీ తర్వాత కేశినేని కీలక వ్యాఖ్యలు
2013 నుంచి టీడీపీ కోసం కష్టపడుతున్నానని, చంద్రబాబు పాదయాత్రతో పాటు స్దానిక సంస్ధల ఎన్నికలనూ తన భుజంపై మోశానని కేశినేని నాని వెల్లడిరచారు. ఓ లక్ష్యంతో టీడీపీలో చేరానని, పనిచేశానన్నారు. పదవుల కోసం ఆశపడకుండా పార్టీ కోసం పనిచేశానన్నారు. టీడీపీ కోసం రూ. 2000 కోట్లు ఆస్తులు అమ్ముకున్నానని, వ్యాపారం కంటే పార్టీయే ముఖ్యం అనుకున్నానని కేశినేని పేర్కొన్నారు. టీడీపీలో శక్తికి మించి కష్టపడ్డా. అన్ని కార్యక్రమాలు నా సొంత డబ్బులతో నిర్వహించా. టీడీపీ కోసం డబ్బు, సమయం వృథా చేసుకున్నా. పార్టీ కోసం వ్యాపారాలు మానుకున్నా, కానీ ఆ పార్టీ నన్ను అవమానించింది. లోకేష్ ఏ అర్హతతో యువగళం పాదయాత్ర చేశారని టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరు వాడుకుని లోకేష్ రాజకీయాలు చేస్తున్నారు. లోకేష్ ఆఫ్ట్రాల్ ఓడిపోయిన అభ్యర్థి. పార్టీ కోసం లోకేష్ ఏమైనా సొంత ఆస్తులు అమ్మారా ? పాదయాత్ర చేసేందుకు లోకేష్‌కు ఏం హక్కుంది ? ఓడిపోయిన వ్యక్తి పాదయాత్రలో ఎంపీగా ఉన్న నేను జీహుజూర్ అనాలా ? నేనేవరికీ భయపడును అన్నారు. స్ధానిక ఎన్నికల్లో అడిగితేనే కూతురు శ్వేత పోటీకి దించానన్నారు. ఆ తర్వాత సొంత పార్టీ నేతలతో చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టించి తిట్టించారన్నారు. తనను పార్టీలో నేతలు ఎన్ని మాటలన్నా కనీసం మద్దతివ్వలేదన్నారు. జగన్ నిరుపేదల పక్షపాతి అని, చంద్రబాబు మోసగాడని అందరికీ తెలుసని కేశినేని నాని తెలిపారు. కానీ ఇంత పచ్చి మోసగాడని తనకు ఇప్పుడే తెలిసిందన్నారు. చంద్రబాబు వల్ల రాష్ట్రంలో ఎవరికీ ఉపయోగం లేదన్నారు. బాబుని నేను ఎప్పుడూ టికెట్ అడగలేదు. ఆయనే పిలిచి టికెట్ ఇచ్చారు. ఆయన నా ఫ్యామిలీలో చిచ్చుపెట్టారు. నా కుటుంబ సభ్యులతో కొట్టించాలని లోకేష్ చూశారని ధ్వజమెత్తారు. నన్ను చెప్పుతో కొడతానని ఓ క్యారెక్టర్‌లెస్ వ్యక్తి మాట్లాడినా పార్టీ ఎందుకు స్పందించలేదు ? టీడీపీలో ఉంటూ ఇంక ఎన్ని అవమానాలు భరించాలి ? అందుకే జగన్‌తో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నట్లు కేశినేని నాని తెలిపారు. ఎంపీగా రాజీనామా ఆమోదం పొందాకే వైసీపీలో చేరనున్నట్లు కేశినేని వెల్లడిరచారు.