CM Revanth : హెటీరోకు భూముల లీజు రద్దు

0

  • రూ.5 వేల కోట్ల భూమిని పార్థసారథిరెడ్డి ట్రస్ట్‌​కు కారుచౌకకే ఇచ్చిన బీఆర్‌​ఎస్‌​ సర్కార్‌​
  • హైకోర్టు రద్దు చేసినా.. రూల్స్‌​ మార్చి ఎన్నికల ముందు అప్పగింత 
  • హైదరాబాద్‌​లోని ఖానామెట్‌​లో 15 ఎకరాలు 60 ఏండ్లకు లీజ్‌ 
  • లీజు రద్దు చర్యకు ఉపక్రమమించిన రేవంత్‌ సర్కార్‌ !
  • ఇంకా ఏయే సంస్థలకు గత సర్కారు లీజులు ఇచ్చింది? 
  • పూర్తి వివరాలను అందజేయండి.. అధికారులకు సీఎం రేవంత్‌​రెడ్డి ఆదేశం !

హైకోర్టు జీవోను కొట్టేసినా.. అసెంబ్లీ ఎన్నికల ముందు(25.09.2023న) మరో కొత్త జీవోను తీసుకొచ్చి.. భూ కేటాయింపులకు అనుగుణంగా నిబంధనలను మార్చి.. సాయిసింధు ఫౌండేషన్‌కు శేరిలింగంపల్లి మండలంలో రూ.వందల కోట్ల విలువైన 15 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం 60 ఏళ్ల లీజుకు కట్టబెట్టిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తాజాగా రెవెన్యూ శాఖ నివేదించినట్లు తెలుస్తోంది. ఏడాదికి ఎకరాకు రూ.2 లక్షల చొప్పున అతి తక్కువ ధరకు లీజుకిచ్చారని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. రెవెన్యూ ఉన్నతాధికారులు, కలెక్టర్లు రాసిన లేఖలు పట్టించుకోకుండా.. ఈ భూమిని కేటాయించారని అందులో ప్రస్తావించినట్లు తెలిసింది. ఉల్లంఘనలపై చర్యలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించనున్నట్లు సమాచారం.

నివేదికలోని ముఖ్యాంశాలివీ..

క్యాన్సర్‌ ఆసుపత్రి నిర్వహణ కోసం భూ కేటాయింపులు జరపాలని కోరుతూ సాయిసింధు ఫౌండేషన్‌ దరఖాస్తు చేసుకోగా.. ఈ సంస్థకు అప్పటి ప్రభుత్వం నిబంధనలు పక్కనపెట్టి 2019లోనే భూమిని కేటాయించింది. ఎకరాకు రూ.1.47 లక్షల చొప్పున లీజుకిచ్చింది. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. స్పందించిన హైకోర్టు.. గత ఏడాది జూన్‌లో భూ కేటాయింపుల జీవో 59ని రద్దుచేసింది. ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా సూచించింది. ప్రజల ఆస్తులు, వనరులకు ప్రభుత్వం ట్రస్టీగా మాత్రమే వ్యవహరించాలని, ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టేటప్పుడు ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని వ్యాఖ్యానించింది. అనంతరం ప్రభుత్వం ఈ సంస్థకు కేటాయించిన భూముల కోసమే లీజు నిబంధనలను సవరించింది. పాత లీజు నిబంధనల జీవో 571కు పలు సవరణలు చేస్తూ 2023 ఆగస్టు 11న జీవో 99ని జారీ చేసింది. సామాజిక, స్వచ్ఛంద సంస్థలకు భూములు తక్కువ ధరకు ఇచ్చే విచక్షణాధికారం తమ చేతిలో ఉందని అందులో ప్రత్యేకంగా ప్రస్తావించింది. సవరించిన లీజు నిబంధనల ఆధారంగా సెప్టెంబరు 25న సాయిసింధూ ఫౌండేషన్‌కు అదే భూమిని మళ్లీ కేటాయిస్తూ జీవో 140ని జారీ చేసింది. దీని ప్రకారం గతంలో ఉన్న రూ.1.47 లక్షల లీజును.. ఏడాదికి ఎకరానికి రూ.2 లక్షలకు పెంచింది. ముందుగా 30 ఏళ్లకు లీజుకిస్తున్నామని.. తదుపరి మరో 30 ఏళ్లకు రెన్యువల్‌ చేస్తామని పేర్కొంది.

బహిరంగ మార్కెట్‌లో ధరను గమనిస్తే.. ఖానామెట్‌లో ఒక్కో ఎకరం రూ.33.70 కోట్లు. మొత్తం 15 ఎకరాలకు రూ.505.50 కోట్లు అవుతాయని, వేలం వేయాలనుకున్నట్లు అప్పటి శేరిలింగంపల్లి తహసీల్దార్‌, కలెక్టర్‌ నోట్‌ కూడా సమర్పించారు. అయితే వేలం వేయకుండా.. సాయిసింధు ఫౌండేషన్‌కు కేటాయింపులు జరిపారని నివేదికలో పొందుపర్చారు. హైటెక్‌ సిటీకి 500 మీటర్ల దూరంలో హెచ్‌ఐసీసీకి వెళ్లే మెయిన్‌ రోడ్డును ఆనుకొని ఉన్నందున, ఆ స్థలం అత్యంత విలువైందని రాజేంద్రనగర్‌ ఆర్డీవో కూడా అదే ధరను ధ్రువీకరించారు. కేటాయించిన భూముల్లో సాయిసింధు ఫౌండేషన్‌ ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించింది. అయితే హెటిరో పార్థసారథిరెడ్డి ట్రస్టుకు గత బీఆర్‌​ఎస్‌​ సర్కారు కేటాయించిన 15 ఎకరాల భూముల లీజును రద్దు చేయాలని సీఎం రేవంత్‌​ సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఆ ప్రాంతంలో ఇప్పటికే ఏమైనా నిర్మాణాలుంటే వాటిని తొలగించాలని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. ఇలా ఇంకెన్నిటికి లీజులు ఇచ్చారో వాటి వివరాలన్నీ ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. వాటిపైనా త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్‌​ఎస్‌​ పార్టీకి నాలెడ్జ్‌​ సెంటర్‌​ కింద విలువైన భూమిని తక్కువ ధరకే కేటాయించడంపై హైకోర్టులో కేసు దాఖలైంది. కోర్టు సూచనలకు తగ్గట్టుగా దానిపైనా ఓ నిర్ణయం తీసుకుంటారని అధికార వర్గాలు చెప్తున్నాయి. 

అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు..!

ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హైకోర్టు తీర్పును కూడా కాలరాసింది. వాస్తవానికి పార్థసారథిరెడ్డి రాజ్యసభ సభ్యుడు కాకముందే.. 2018లోనే ఆయన ట్రస్టీగా ఉన్న సాయిసింధు ఫౌండేషన్‌ పేరిట​అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ భూదందా నడిపింది. 1989లో బసవతారకం హాస్పిటల్‌ కు లీజుకు ఇచ్చిన తరహాలోనే ఏడాదికి కేవలం రూ.50 వేల చొప్పున లీజుకు ఇవ్వాలని, తమ క్యాన్సర్‌ హాస్సిటల్‌​లోనూ 25% మంది ఇన్‌​పేషెంట్లకు , 40%  మంది ఔట్‌ పేషెంట్లకు ఫ్రీ ట్రీట్మెంట్‌ ఇస్తామని పార్థసారథిరెడ్డి ట్రస్ట్‌ లెటర్‌ పెట్టుకుంది. దీంతో ఏడాదికి రూ.1.47 లక్షల లీజు చెల్లించేలా.. మూడేండ్లకోసారి 5% పెంచే నిబంధనతో భూమి అప్పగించాలని 2019 జనవరిలో అప్పటి బీఆర్‌​ఎస్‌​ ప్రభుత్వం స్పెషల్‌ మెమో జారీ చేసింది. జీవో 59ని విడుదల చేసింది. ఈ క్యాన్సర్‌ హాస్సిటల్‌ కు  భూముల కేటాయింపును సవాల్‌​ చేస్తూ అదే ఏడాది డాక్టర్‌ ఊర్మిళ పింగ్లే, మరొకరితో కలిసి హైకోర్టును ఆశ్రయించారు. స్పందించిన హైకోర్టు నాడు ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. 60 ఏండ్లలో వేల కోట్ల ఆదాయం వచ్చే స్థలాన్ని తక్కువ రేటుకు ఎందుకు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ జీవో 59 రద్దు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ భూకేటాయింపుల పాలసీ జీవో నంబర్‌ 571, జీవో నంబర్‌ 218 ప్రకారం పున: సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టంచేసింది. 

రూల్స్‌​ అన్నీ మార్చి..!

హెటిరో కంపెనీ ఎండీ పార్థసారథి రెడ్డి 2014 సెప్టెంబర్‌లో సాయిసింధు ఫౌండేషన్‌ పేరుతో ఒక చారిటబుల్‌ ట్రస్ట్‌ నెలకొల్పారు.  తాము చేపట్టే క్యాన్సర్‌ జనరల్‌ హాస్పిటల్‌ నిర్మాణానికి శేరిలింగంపల్లి మండలంలోని ఇజ్జత్‌​నగర్‌​లో 15.48 ఎకరాల స్థలం కేటాయించాలని నాటి సీఎంకు అప్లై చేసుకున్నారు. ఒక్క ఏడాది కూడా కార్యకలాపాలు నిర్వహించని ఈ ట్రస్ట్‌ ఏకంగా వందల కోట్ల విలువైన భూమి అడిగితే పక్కన పెట్టాల్సిన బీఆర్‌​ఎస్‌​ ప్రభుత్వం.. లీజు నిబంధనలన్నీ ఆ ట్రస్ట్‌​కు అనుకూలంగా మార్చి భూసంతర్పణ చేసింది. అయితే..ఇజ్జత్‌​నగర్‌​లో ట్రస్ట్‌​ అడిగిన స్థలాన్ని అప్పటికే టీఎస్‌ఐఐసీ వేలం వేయాలని నిర్ణయించింది. దీంతో ఇజ్జత్‌​నగర్‌ బదులు ఖానామెట్‌​లో ప్లేస్‌ ఇవ్వాలని ఫైళ్లు మార్చారు. ఖానామెట్‌​లో సర్వే నెంబర్‌ 41/14/2లో 15 ఎకరాల స్థలం కేటాయించాలని సీసీఎల్‌ఏకు స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ టాప్‌ ప్రియారిటీ ఆదేశాలిచ్చారు. మార్కెట్‌ వ్యాల్యూ ప్రకారం ఖానామెట్‌​లో ఒక్కో ఎకరం రూ.33.70 కోట్లు. మొత్తం 15  ఎకరాలకు రూ.505.50 కోట్లు అవుతాయని, దీన్ని వేలం వేయాలనుకున్నట్లు అప్పటి శేరిలింగంపల్లి తహశీల్దార్‌, అప్పటి కలెక్టర్‌ నోట్‌ సమర్పించారు.  వేలం వద్దని.. సాయిసింధు ఫౌండేషన్‌ ట్రస్ట్‌ కు  ఇవ్వాలంటూ బీఆర్‌​ఎస్‌​ ప్రభుత్వం ఆదేశించింది. హైటెక్‌ సిటీకి 500 మీటర్ల దూరంలో హెచ్‌ఐసీసీకి వెళ్లే మెయిన్‌ రోడ్డును ఆనుకొని ఉన్నందున, ఆ స్థలం అత్యంత విలువైందని రాజేంద్రనగర్‌ ఆర్డీవో కూడా అదే రేటును ధ్రువీకరించారు. జీవో నెం.571 ప్రకారం ఆ భూమిని సాయిసింధు ఫౌండేషన్‌ కు లీజుపై కేటాయించాలని అప్పటి బీఆర్‌​ఎస్‌​ ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌ కు మెమో జారీ చేసింది. జీవో నెం.571 ప్రకారం.. భూమి విలువలో పది శాతం లీజు రెంట్‌ గా చెల్లించాలి. అంటే రూ.505 కోట్ల విలువ ఉన్న భూమికి ఏడాదికి రూ.50 కోట్లు చెల్లించాలి. ఐదేండ్లకోసారి 10% చొప్పున పెంచుతూ పోవాలి. అంటే 60 ఏండ్ల లీజు కోసం.. ప్రభుత్వానికి దాదాపు రూ.5 వేల కోట్లకు పైగా చెల్లించాలి. సాయిసింధు ఫౌండేషన్‌కు 3 ఎకరాలు మాత్రమే కేటాయించేందుకు అర్హత ఉందని అప్పటి కలెక్టర్‌ సీసీఎల్‌ఏ స్పెషల్‌  సెక్రటరీకి  లెటర్‌ రాశారు. మూడు కాదు..  11 ఎకరాలివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అప్పటికే 15 ఎకరాల్లో ఆ ఫౌండేషన్‌ నిర్మాణాలు మొదలుపెట్టింది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !