ప్రధాన మార్కెట్ పెట్టుబడి ఫండ్లలోకి బిట్‌కాయిన్‌ను (BITCOIN) అనుమతిస్తూ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. స్పాట్ బిట్‌కాయిన్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్లను (BITCOIN ETF) అనుమతించింది. దీంతో క్రిప్టోకరెన్సీల్లో (Cryptocurrency) ఇకపై పెన్షన్ ఫండ్స్ నుంచి సాధారణ పెట్టుబడిదారుల వరకు ఎవరైనా మదుపు చేయొచ్చు. కీలక మైలురాయిగా చెబుతున్న ఈ నిర్ణయంతో పెట్టుబడులు వెల్లువలా వస్తాయని క్రిప్టో పరిశ్రమ ఆశిస్తోంది. బిట్‌కాయిన్ ETFలను (Bitcoin ETF) ఆఫర్ చేసేందుకు పలు ప్రముఖ సంస్థలు చేసుకున్న 11 దరఖాస్తులకు అమెరికా ‘సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్’ (SEC) బుధవారం ఆమోదం తెలిపింది. అదే సమయంలో క్రిప్టోలతో ఉన్న ముప్పును గుర్తుచేస్తూ మదుపర్లను అప్రమత్తం చేసింది. క్రిప్టోకరెన్సీపై (Cryptocurrency) ఆసక్తి ఉన్నవారు మాత్రం తాజా పరిణామంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలుసార్లు ఈ తరహా దరఖాస్తులను ఎస్‌ఈసీ తిరస్కరించింది. మదుపర్లకు నష్టం కలిగే అవకాశం ఉన్న పెట్టుబడి సాధనాలను ప్రోత్సహించలేమని తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. కానీ, ఎస్‌ఈసీ చెబుతున్న కారణాలు తిరస్కరణకు సరిపోవని ఓ న్యాయస్థానం అభిప్రాయపడిరది. దీంతో ఈ తరహా ఈటీఎఫ్‌లకు అనుమతివ్వడం అనివార్యమైంది. బిట్‌కాయిన్ ఈటీఎఫ్ (BITCOIN ETF) అనుమతిని.. తాము క్రిప్టోకరెన్సీలకు ఇస్తున్న మద్దతుగా పొరబడొద్దని ఎస్‌ఈసీ ఛైర్మన్ గ్యారీ జెన్స్‌లర్ సోమవారమే మదుపర్లకు తెలిపారు. బిట్‌కాయిన్ ఊహాజనితమైందని.. విలువలో భారీ ఊగిసలాటలుంటాయని హెచ్చరించారు. దీన్ని అక్రమ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని తెలిపారు. అందుకే మదుపర్లు క్రిప్టోలతో అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు.
ETF అంటే?
ఈటీఎఫ్‌లు (ETF) కూడా స్టాక్స్ తరహాలోనే పనిచేస్తాయి. మ్యూచువల్ ఫండ్ లక్షణాలతో స్టాక్ మార్కెట్‌లో అవసరమైనప్పుడు ట్రేడ్ చేయగల సెక్యూరిటీల మిశ్రమమే ఈటీఎఫ్. మదుపర్ల దగ్గరి నుంచి సమీకరించిన నిధులతో వీటిని కొనుగోలు చేస్తారు. సెక్యూరిటీల మిశ్రమాన్ని ఈటీఎఫ్ యూనిట్‌గా పేర్కొంటారు. అవి స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ అవుతుంటాయి. స్టాక్ తరహాలోనే వాటి విలువ వేగంగా మారుతూ ఉంటుంది. తాజాగా ఎస్‌ఈసీ అనుమతితో సెక్యూరిటీ మిశ్రమాల్లో బిట్‌కాయిన్‌నూ భాగం చేస్తారు. ఈటీఎఫ్‌లు (ETF) ఇటు షేర్లతో పాటు అటు మ్యూచువల్ ఫండ్ల వలె కూడా పనిచేస్తాయి. స్టాక్ మార్కెట్‌లో కొన్ని ఈటీఎఫ్ బ్లాక్‌లు కలిసి షేర్లలాగా వ్యవహరిస్తాయి. ఈటీఎఫ్ ఫండ్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదై ఉంటాయి. సాధారణ ట్రేడిరగ్ సమయంలోనే వాటి క్రయవిక్రయాలు జరుగుతాయి. ఈటీఎఫ్ యూనిట్ విలువ దానిలో ఉన్న సెక్యూరిటీల విలువ ఆధారంగా మారుతూ ఉంటుంది. యూనిట్‌లో ఏ ఒక్క దాని ధర పెరిగినా ఈటీఎఫ్ విలువ బలపడుతుంది.
ఎందుకింత ఆసక్తి?
ఇప్పటి వరకు ప్రభుత్వాలు అధికారికంగా క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులను ప్రోత్సహించలేదు. తాజాగా అమెరికా ఎస్‌ఈసీ బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లకు అనుమతివ్వటంతో.. కనీసం ఊహాజనిత కరెన్సీగానైనా క్రిప్టోలను అధికారికంగా గుర్తించినట్లయిందని మదుపర్లు భావిస్తున్నారు. భారీ వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థలు సైతం పెట్టుబడులతో ముందుకు వస్తాయని ఆశిస్తున్నారు. దీంతో క్రిప్టోలకు ఆదరణ లభిస్తుందని.. మదుపర్లకు లాభాలను తెచ్చిపెడతాయని అంచనా వేస్తున్నారు.
ఎలాంటి ముప్పుంది?
బిట్‌కాయిన్ (Bitcoin) సహా క్రిప్టోకరెన్సీల విలువల్లో భారీ ఊగిసలాటలుంటాయి. ఎలాంటి కారణాలు, ముందస్తు సంకేతాలు లేకుండానే విలువలు పెరగడం, తగ్గడం జరుగుతుంటుంది. క్రిప్టో ఆధారిత ఈటీఎఫ్‌లలో మదుపు చేసేవారు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఇవి ఊహాజనిత కరెన్సీలయిన నేపథ్యంలో సైబర్‌మోసాలకు కూడా ఆస్కారముంది. మనీలాండరింగ్, మాదకద్రవ్యాల కొనుగోళ్ల వంటి అక్రమ కార్యకలాపాలకు వీటిని యథేచ్ఛగా ఉపయోగించే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
(గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులు అనేది పూర్తిగా మీ వ్యక్తిగత అభిప్రాయం)