ఈ నెల 22న జరగనున్న ‘ప్రాణప్రతిష్ఠాపన’ కార్యక్రమానికి ముందు కీలక ఘట్టం చోటుచేసుకుంది. సుమారు 550 ఏళ్ల తర్వాత అయోధ్య రామాలయం గర్భగుడిలో ‘రామ్ లల్లా’ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వేద మంత్రోచ్చారణ, జై శ్రీరామ్ నినాదాల మధ్య గురువారం ఈ కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. మైసూరుకు చెందిన శిల్పకళాకారుడు అరుణ్ యోగిరాజ్ చెక్కిన 51 ఇంచుల ‘రామ్ లల్లా’ విగ్రహాన్ని గుర్భగుడిలో ఉంచారు. కాగా గురువారం వేకువ జామున విగ్రహాన్ని ఆలయంలోకి తీసుకొచ్చారు. ఓ ట్రక్కు ద్వారా తరలించి ఆ తర్వాత క్రేన్ సాయంతో గర్భగుడిలోకి చేర్చారు.
भगवान श्री रामलला सरकार के अनुजों सहित दिव्य दर्शन - अयोध्या धाम
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 18, 2024
पौष मास, शुक्ल पक्ष, अष्टमी तिथि, विक्रमी संवत् २०८०
Divya Darshans of Bhagwan Shri Ram Lalla, along with his brothers- Ayodhya Dham
Paush Maas, Shukla Paksh, Ashtami Tithi, Vikrami Samvat 2080 pic.twitter.com/fgZRqyNQi3
ప్రాణప్రతిష్ట అంటే...
అయోధ్యలో దివ్యమైన రామ మందిరం త్వరలోనే ప్రారంభోత్సవం జరుపుకోనుంది. జనవరి 22 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్లకు ప్రారంభం కానున్న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల వరకు కొనసాగనుంది. అభిజీత్ ముహూర్తంలో 84 సెకన్ల పాటు ఈ మహత్తర ఘట్టం ఆవిష్కృతం కానుంది. వేద మంత్రోచ్చారణ మధ్య రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించనున్నారు. అయితే సనాతన ధర్మంలో ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రాణ అంటే ప్రాణ శక్తి.. ప్రతిష్ఠ అంటే స్థాపన అని అర్థం. అంటే విగ్రహంలోకి ప్రాణశక్తిని స్థాపించడం అని అర్థం. అప్పటి వరకు ఉన్న ఆ విగ్రహాన్ని సాధారణంగా పరిగణించగా.. ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందో అప్పటి నుంచి విగ్రహంలోకి దైవం వచ్చి చేరుతుందని హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి.ఇక.. హిందూ మతంలో ప్రాణ ప్రతిష్ఠ అనేది ఒక పవిత్రమైన వేడుక. కొత్తగా ఆలయం నిర్మించినా లేదా విగ్రహాన్ని కొత్తగా పెడుతున్నా ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే విగ్రహం పాడైనా లేదా ఆలయం పునర్నిర్మిస్తున్నా ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. దీనికి సరైన సమయం, ముహూర్తం చూసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు.. ప్రాణ ప్రతిష్ఠకు ముందు ఆ విగ్రహాన్ని పూజకి ఉపయోగించరు. ప్రాణ ప్రతిష్ఠ ద్వారా విగ్రహంలోకి ప్రాణశక్తిని ప్రవేశపెట్టిన తర్వాతే పూజా కార్యక్రమాలు చేపడతారు. భక్తులు విగ్రహాన్ని కేవలం విగ్రహంగా మాత్రమే చూడకుండా దేవుళ్ల సజీవ రూపంగా భావిస్తారు. ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహంలో దేవుడు కొలువై ఉంటాడు. మరోవైపు.. శిక్షణ పొందిన పూజారులతో ప్రాణ ప్రతిష్ఠ వేడుకలో ఆచారాలు, క్రతువులు నిర్వహిస్తారు. విగ్రహాన్ని ప్రతిష్టించడానికి ముందు పవిత్ర గంగా జలంతో శుద్ది చేస్తారు. అదే సమయంలో ఆలయ ప్రాంగణాన్ని పూర్తిగా శుద్ది చేస్తారు. పూలు, పండ్లు, పాలు వంటి వివిధ నైవేద్యాలు దేవుడికి సమర్పిస్తూ పూజలు చేస్తూ.. మంత్రాలు పఠిస్తారు. అయితే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టే ముహూర్తం కూడా చాలా ముఖ్యమైనది. ఈ క్రమంలోనే అయోధ్య రామ మందిరంలో జనవరి 22 వ తేదీన ప్రాణ ప్రతిష్ఠ చేసేందుకు ఎంపిక చేశారు. ఆ రోజు జ్యోతిష్య పరంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. ద్వాదశ తిథిలో ప్రాణ ప్రతిష్ఠ జరగడం అనేది చాలా మంచి విషయమని పేర్కొంటున్నారు. ఆ రోజు విష్ణువుతో ముడిపడి ఉంటుందని.. ఆ ప్రత్యేకమైన రోజున ఆలయాన్ని ప్రారంభించడం వల్ల విష్ణువు ఉనికి ఉంటుందని నమ్ముతారు. విష్ణు మూర్తి ఏడో రూపంగా శ్రీరాముడిని కొలుస్తారు. అందుకే ఈ తేదీ వేడుకకి అధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుంది.
ఆరుగ్రహాలు అనుకూలం !
రామ్ లల్లా ప్రతిష్ఠాపన కోసం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అనేక తేదీలను సూచించింది. జనవరి 17 వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు దాదాపు 5 తేదీలు గుర్తించారు. అయితే చివరికి ఖరారు చేసిన ఈ ముహూర్తం వివరాలను ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన సంగ్వేద విద్యాలయ ఆచార్యులు, జ్యోతిషుడు ఆచార్య గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ తెలిపారు. సాధారణంగా ఐదు గ్రహాలు అనుకూలంగా ఉంటే అది మంచి ముహూర్తం అవుతుందని.. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. వృశ్చిక రాశి నవాంశం ఉన్న సమయంలో మేష లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుందని చెప్పారు.