YS Sharmila : జగనన్న వదిలిన బాణం...జగన్‌కే ఎక్కుపెడుతున్న వైనం !

0

రాజకీయాల్లో ఎప్పుడూ ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. సొంత అన్న కోసం ఎంతో శ్రమించిన షర్మిల నేడు అన్నను ఓడిచేందుకు పావులు కదుపుతున్నారు. ఇదీ కదా విధి విచిత్రం అంటే. ఇంక ఎన్ని పరిణామాలు చూడాలో అని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కుమార్తె, ప్రస్తుతం సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చెల్లెలు, వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దిల్లీలో ఖర్గే, రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌​ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్‌​సీపీ విజయం కోసం ‘జగనన్న వదిలిన బాణం’ అంటూ రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించారు. పార్టీ విజయానికి కృషి చేశారు. అనంతరం జరిగిన పరిణామాలతో అన్న జగన్‌​కు దూరమయ్యారు. తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. అక్కడ కాంగ్రెస్‌​ పార్టీకి మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా షర్మిల ఆమె తన భర్త అనిల్‌ కుమార్‌తో కలిసి దిల్లీకి వెళ్లారు. అక్కడ కాంగ్రెస్‌​ పార్టీలో చేరారు. చివరకు జగనన్న వదిలిన బాణమే ఆయనకు అడ్డం తిరిగింది. 

వైసీపీ ఓటు బ్యాంకును దెబ్బతీసే వ్యూహం !

ఇప్పటికే రాష్ట్రంలో పరిస్థితుల కారణంగా సీటు రాని పలువురు వైఎస్సార్‌​సీపీ ఎమ్మెల్యేలు ఆమెతో టచ్‌​లోకి వెళ్లినట్లు సమాచారం. రాహుల్‌​ గాంధీ సైతం జగన్‌​ ఓటమి లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ ఎన్నికల్లో అనుకున్నంత మెజార్టీ దక్కకపోయినా తర్వాత పార్టీ బలం పెంచుకోవచ్చనే ఆలోచనతో షర్మిలను పార్టీలో చేర్చుకున్నట్లు తెలిసింది. కొంత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే అవకాశం ఉన్నా, ముఖ్యంగా కాంగ్రెస్‌ ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకున్న జగన్‌ను షర్మిల జాయినింగ్‌ పెద్ద దెబ్బే అని చెప్పాలి. 

షర్మిల ప్రస్థానం !

వైఎస్‌ షర్మిల రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే పలు కీలక విషయాలు స్ఫురణకు వస్తాయి. షర్మిల దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌‍రెడ్డి కుమార్తె. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుఫున ఆమె 2012-2013లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. వైఎస్సార్‌​సీపీ అధ్యక్షుడైన షర్మిల అన్న జగన్‌ మోహన్‌ రెడ్డి తరపున ఆమె ప్రచార బాధ్యతలు తీసుకుని ప్రజలకు మరింత చేరువయ్యారు. అనంతరం రాష్ట్రానికి సీఎం జగన్‌ ముఖ్యమంత్రి కావడం, కుటుంబంలో నెలకొన్న సమస్యల కారణంగా ఆమె వైఎస్సార్‌​సీపీకి దూరమయ్యారు. ఆ తర్వాత 8 జూలై 2021న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వైఎస్‌ షర్మిల వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని స్థాపించారు. పార్టీని స్థాపించిన అనంతరం ఆమె తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పాదయాత్ర చేశారు. ఆ క్రమంలో బీఆర్‌​ఎస్‌​ నేతలు, అప్పటి ప్రభుత్వంపై ఆమె ఘాటు విమర్శలు చేస్తూ ముందుకు సాగారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే, అక్కడ కాంగ్రెస్‌​ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేయడంతో ఆమె వెనక్కి తగ్గారు. ఆ తర్వాత 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ నుంచి వైఎస్‌​ఆర్‌​టీపీ వైదొలుగుతున్నట్లు ఆమె ప్రకటించారు. తన పార్టీ తెలంగాణలో భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతిస్తున్నట్లు షర్మిల ప్రకటించారు. వాస్తవానికి వైఎస్‌​ఆర్‌​టీపీని తెలంగాణ ఎన్నికలకు ముందే షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేయాలని ప్రయత్నాలు చేశారు. కానీ, కొన్ని పరిణామాల వల్ల పార్టీని విలీనం చేసే ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మరికొన్ని నెల్లలో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఆమె తాను స్థాపించిన వైఎస్‌​ఆర్‌​టీపీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేశారు. ఇవాళ దిల్లీలో రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో సమావేశం అయిన షర్మిల, కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !