- లెక్కకు మించి బయటపడుతున్న శివబాలకృష్ణ ఆస్తులు
- 120 ఎకరాలకుపైగా స్థలాన్ని గుర్తించిన ఏసీబీ
- కుటుంబసభ్యులతోపాటు స్నేహితులపై పేర్లపై భారీగా బినామీ ఆస్తులు
హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి భాగోతం తవ్వేకొద్దీ బయట పడుతోంది. ఆయన ఆస్తుల్ని చూసి ఏసీబీ అధికారులు సైతం నోరెళ్ల పెడుతున్నారు. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ వందల కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో వంద ఎకరాల భూముల్ని బాలకృష్ణ బినామీ పేర్లతో సంపాదించినట్లు పత్రాల ద్వారా గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హెచ్‌ఎండీ మాజీ డైరెక్టర్, రేరా కార్యదర్శి శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. శివబాలకృష్ణ ఇల్లు, బంధువులు, స్నేహితుల ఇండ్లలో 16 చోట్ల సోదాల అనంతరం మొత్తం రూ.99,60,850 నగదు, 1,988 గ్రామాలు బంగారు, వజ్రాభరణాలు, సుమారు 6 కిలోల వెండి నగలు స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.5,96,27,495 విలువైన చర, స్థిర ఆస్తులను కనుగొన్నట్టు వెల్లడిరచారు. సోదాల్లో దొరికిన మొత్తం స్థిర, చర ఆస్తులు ప్రభుత్వ విలువ ప్రకారం రూ.8,26,48,999 అని, బయటి మార్కెట్‌లో వాటి విలువ రూ.వందల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఇంకా అదనపు ఆస్తులకు సంబంధించిన వెరిఫికేషన్ జరుగుతున్నదని వివరించారు. ఈ కేసులో బాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఆస్తులపై ఆరా తీస్తున్నారు.
అక్రమంగా 120కి పైగా ఎకరాలు
ఏసీబీ అధికారుల విచారణలో ఆయన భూ బాగోతాలు ఒక్కక్కటిగా వెలుగు చూస్తున్నాయి. శివ బాలకృష్ణ లెక్కకు మించిన ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. బినామీల పేరుతో ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించి అక్రమాలకు పాల్పడినట్లు తేలింది.హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు పరిసరాలతోపాటు.. రంగారెడ్డి, యాదాద్రి-భువనగరి, సిద్దిపేట, జనగాం జిల్లాలతోపాటు.. చౌటుప్పల్‌లో 120కి పైగా ఎకరాల భూములను శివబాలకృష్ణ అక్రమంగా సంపాదించాడు. వాటిని తన స్నేహితులు, కుటుంబ సభ్యుల పేరిట కూడబెటినట్లు ఏసీబీ గుర్తించినట్లు సమాచారం. ఇవే కాకుండా పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లోనూ భారీగా పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. దీంతో ఏసీబీ అధికారులు శివబాలకృష్ణ పెట్టుబడులు పెట్టిన రియల్‌ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు, ఆయన స్నేహితులను విచారించినట్లు తెలిసింది.
అనుమతులిచ్చిన ఫైళ్లపై దృష్టి
హెచ్‌ఎండీ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు శివబాలకృష్ణ అనుమతులిచ్చిన దిగ్గజ రియల్ ఎస్టేట్ సంస్థలపైనా అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆయా సంస్థల ప్రతినిధులను విచారించారని సమాచారం. శివబాలకృష్ణ హయాంలో అనుమతులిచ్చిన ఫైళ్ల చిట్టాను అందజేయాలంటూ హెచ్‌ఎండీఏకు ఇప్పటికే ఏసీబీ లేఖ రాసినట్లు తెలిసింది. ఆ ఫైళ్లు ఏసీబీ చేతికి చిక్కితే.. మరిన్ని ఆధారాలను సేకరించవచ్చని ఏసీబీ భావిస్తోంది. నేడు, రేపు కూడా ఏసీబీ అధికారులు శివబాలకృష్ణను విచారించనున్నారు. ఈలోగా ఆశించిన సమాచారం రాకుంటే.. మరోసారి శివబాలకృష్ణ కస్టడీ పిటిషన్‌కు ఏసీబీ రెడీ అవుతోంది. వారం రోజుల క్రితం శివబాలకృష్ణ ఇంట్లో ఆకస్మికంగా దాడులు చేసిన ఏసీబీ.. కోటి వరకు నగదు, దాదాపు రెండు కిలోల బంగారు ఆభరణాలు, ఆరు కిలోలకుపైగా వెండి వస్తువులు, 80కిపైగా అత్యంత ఖరీదైన వాచీలు, పదుల సంఖ్యలో ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లను సీజ్ చేశారు. అతడిపై 13 (1) (బీ) , 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శివబాలకృష్ణ మ్నెత్తం ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో 500 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.