AMB Suhas : అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్‌..రివ్యూ

0


సుహాస్‌ ఇది వరకు చేసిన కలర్‌ ఫోటో ఓటీటీలో సెన్సేషన్‌గా నిలిచింది. రైటర్‌ పద్మభూషణ్‌ మీద కాస్త కాంట్రవర్సీ ఉంటుంది. కొందరు బాగుందని అంటే.. ఇంకొందరు పెదవి విరిచారు. దాని కలెక్షన్ల మీద కూడా కాస్త కాంట్రవర్సీ ఉంటుంది. కానీ సుహాస్‌ పర్ఫామెన్స్‌ మీద మాత్రం ఎలాంటి కంప్లైంట్‌ రాలేదు. అదే సుహాస్‌ సక్సెస్‌. ఇప్పుడు సుహాస్‌ మళ్లీ ఓ కథను ఆడియెన్స్‌కు చెప్పేందుకు వచ్చాడు. ఈ చిత్రాన్ని ధీరజ్‌ నిర్మించగా.. దుశ్యంత్‌ తన స్వీయ అనుభవాలు, తన ఊర్లో జరిగిన ఘటనల ఆధారంగా తీశాడు. మరి ఈ అంబాజీపేట మ్యారేజి బ్యాండు ఎలా ఉంది? ఆడియెన్స్‌ను ఏ మేరకు ఆకట్టుకుందన్నది ఓ సారి చూద్దాం.

కథేంటంటే

అంబాజిపేటలో 2007 ప్రాంతంలో ఈ కథ జరుగుతుంది. ఊర్లో పెద్ద మనిషిగా చెలామణి అవుతుంటాడు వెంకట్‌ (నితిన్‌ ప్రసన్న). ఊర్లో సగం మంది వెంకట్‌ దగ్గర అప్పులు తీసుకుని వడ్డీలు కట్టుకుంటూ బతుకుతూనే ఉంటారు. ఆ గ్రామంలో మల్లి (సుహాస్‌) తన కులవృత్తిని చేసుకుంటూనే మ్యారేజి బ్యాండులో పని చేస్తుంటాడు. మల్లి అక్క పద్మ (శరణ్య) అదే ఊర్లో స్కూల్‌ టీచర్‌గా పని చేస్తుంటుంది. పద్మకు వెంకట్‌కు ఏదో ఉందని ఊరంతా పుకార్లు నడుస్తుంటాయి. వెంకట్‌ చెల్లి లక్ష్మీ (శివానీ), మల్లి ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కులం, డబ్బుని చూసుకుని అహంకారంతో రెచ్చిపోయే వెంకట్‌.. ఆత్మాభిమానంతో ఉండే మల్లి, పద్మలకు వైరం ఎలా మొదలవుతుంది? ఈ గొడవల్లో మల్లి, లక్ష్మీల ప్రేమ ఏం అవుతుంది? చివరకు వెంకట్‌ పరిస్థితి ఎంతలా మారిపోతుంది?  వెంకట్‌బాబు తమ్ముడికీ, మల్లికీ మధ్య ఊళ్లో గొడవ, ఆ తర్వాత స్కూల్‌ విషయంలో పద్మకీ, వెంకట్‌బాబుకీ మధ్య వైరం మొదలవుతుంది. అవి చిలికి చిలికి గాలివానలా మారతాయి. ఇంతలో మల్లి, లక్ష్మిల మధ్య ప్రేమ సంగతి కూడా బయట పడుతుంది. ఎలాగైనా ఆ కుటుంబంపై  ప్రతీకారం తీర్చుకోవాలని ఓ రోజు వెంకట్‌బాబు... రాత్రివేళలో పద్మని స్కూల్‌కి పిలిపించి అవమానిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది?మల్లి, లక్ష్మిల ప్రేమకథ ఎలాంటి మలుపు తీసుకుందనే విషయాల్ని తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే

సమాజంలోని అంతరాలు, పరువు, ప్రేమ నేపథ్యంలో సాగే సినిమాలు ఈ మధ్య తరచూ రూపొందుతున్నాయి. తమిళంలో అయితే వీటి ప్రభావం చాలా గట్టిగా  ఉంది. తెలుగు దర్శకులూ ఈ మధ్య మన మూలాల్లోకి వెళ్లి అలాంటి కథల్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. విజయాల్నీ అందుకుంటున్నారు. ఆ తరహా  మరో  ప్రయత్నమే ఇది. ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య ప్రేమే ఈ కథకి ముఖ్యమైతే ఇదొక సాధారణమై ప్రయత్నమే అయ్యుండేది. కానీ దర్శకుడు తెలివిగా ప్రేమకథని మించి, ఆత్మాభిమానం అనే అంశాన్నీ బలంగా చెప్పే ప్రయత్నం చేశాడు. అది ఈ సినిమాని ప్రత్యేకంగా నిలిపింది. మల్లి, లక్ష్మిల ప్రేమకథతో మొదలయ్యే కథ ప్రారంభమైన కొద్దిసేపటికే ఆ ఊరు చిరతపూడి ప్రేక్షకుల్ని తీసుకెళ్లి అందులో ఓ పాత్రలా మారుస్తుంది. సహజమైన సన్నివేశాలు, పాత్రల తీరుతెన్నులు, సంభాషణలు అంతగా ప్రభావం చూపిస్తాయి. ప్రేమకథలో కొత్తదనమేమీ లేదు కానీ... 2007 నాటి వాతావరణం, అప్పుడప్పుడే సెల్‌ఫోన్లు వస్తున్న ఆ కాలం నాటి ప్రేమలేఖల నేపథ్యంతో సినిమా  సరదా సరదాగా సాగుతుంది. మరోవైపు  కులాల  మధ్య అంతరాల్ని,  ఆర్థిక అసమానతల్నీ సహజంగా ఆవిష్కరిస్తూ కథతో కనెక్ట్‌  చేశాడు దర్శకుడు. విరామం ముందు నుంచి కథ మరో మలుపు తీసుకుంటుంది. అప్పటిదాకా ప్రేమకథే కీలకం కాగా, ఆ తర్వాత నుంచి ఆత్మాభిమానం అంశం ప్రధానంగా మారుతుంది. ద్వితీయార్ధం మల్లి, అతని కుటుంబం చేసే పోరాటం చుట్టూనే సాగుతుంది. కథ ఊహకు తగ్గట్టే సాగుతున్నా, బలమైన సన్నివేశాలతోనూ, డ్రామాతోనూ ప్రభావం చూపించాడు దర్శకుడు. పోలీస్‌ స్టేషన్‌లో సాగే సన్నివేశాలు... ప్రేమ ప్రాణాల మీదకు తేకూడదు అంటూ మల్లి, లక్ష్మి తీసుకునే నిర్ణయం, ఆ నేపథ్యంలో పండే భావోద్వేగాలు చిత్రానికి ప్రధానబలం. పతాక సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు నాటకీయంగా, ఎక్కువ స్వేచ్ఛని తీసుకుని మలిచినట్టు అనిపించినా  సినిమా మాత్రం ప్రేక్షకులపై బలమైన ప్రభావమే  చూపిస్తుంది.

ఎవరెలా చేశారంటే

పాత్రలే తప్ప నటులు కనిపించరనే  విషయాన్ని రుజువు  చేస్తుందీ చిత్రం. నటులు ఆయా పాత్రల్లో  అలా ఒదిగిపోయారు. సుహాస్‌ కథను అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాడు. నవ్వించాడు.. ఏడ్పించాడు.. చివర్లో ఎమోషన్స్‌, నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌లో అద్భుతంగా అనిపించాడు. ఇలాంటి కంటెంట్‌ ఉన్న చిత్రాలు చేస్తే సుహాస్‌కు ఇక తిరుగుండదనిపిస్తుంది. విలన్‌గా నటించిన నితిన్‌ ప్రసన్న తన పాత్రకు న్యాయం చేశాడు. చివర్లో అలా కనిపించేందుకు ఒప్పుకున్నందుకు, ఆ డేరింగ్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే. జగదీష్‌కు మంచి పాత్ర పడిరది. పుష్ప కేశవ తరువాత ఈ సంజీవ్‌ కారెక్టర్‌ కూడా గుర్తుండిపోతుంది.  ప్రథమార్ధంలో అబ్బాస్‌ కటింగ్‌తో కనిపిస్తూ నవ్వించిన అతడు, ద్వితీయార్ధంలో గుండుతో కనిపిస్తూ ఎంతో సహజంగా నటించాడు. భావోద్వేగ ప్రధానమైన సన్నివేశాల్లో అతడి నటన మనసుల్ని హత్తుకుంటుంది. శివానీ నాగారం... లక్ష్మి పాత్రకి పూర్తిగా న్యాయం చేసింది.  శరణ్య ప్రదీప్‌ ఈ సినిమాకి మరో హీరో. ఆమె పాత్రని డిజైన్‌ చేసిన తీరు, అందులో ఆమె నటించిన విధానం సినిమాకే హైలైట్‌. అన్నదమ్ములుగా నటించిన నితిన్‌, వినయ మహాదేవ్‌, హీరోకి స్నేహితుడిగా కనిపించే జగదీష్‌ బండారి పాత్రలు ఆకట్టుకుంటాయి. అన్ని పాత్రలకు తగిన ప్రాధాన్యం ఉండటమే విశేషం.

 మేకింగ్‌ ఎలా ఉందంటే

సాంకేతిక విభాగాలన్నీ మంచి పనితీరుని కనబరిచాయి. శేఖర్‌ చంద్ర పాటలు, నేపథ్య సంగీతం, వాజిద్‌ బేగ్‌ తన కెమెరాతో చిరతపూడి ఆవిష్కరించిన తీరు సినిమాకి ప్రధానబలం. ఎడిటింగ్‌, బలమైన రచన సినిమా గమనాన్నే మార్చేశాయి. దర్శకుడు దుష్యంత్‌ వాణిజ్యాంశాల కోసమని కథ నుంచి పక్కకు వెళ్లకుండా నిజాయతీగా కథని చెప్పే  ప్రయత్నం చేయడం సినిమాకి కలిసొచ్చింది. ‘ఆడదాని వెంట పడటం కాదు, వెనక ఉండటం మగతనం’,  ‘ఓ ప్రాణం  భూమ్మీదకి రావడానికి కూడా పది నెలలు పడుతుంది, అలాంటిది నిన్న  ఉన్న మనిషిని ఈ రోజు లేకుండా చేశావంటూ’ సాగే సంభాషణలు మనసుల్ని తాకుతాయి. చాలా విషయాల్ని హార్డ్‌ హిట్టింగ్‌గా చెప్పడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు.  మేకింగ్‌ పరంగానూ ఎంతో పరిణతి కనిపిస్తుంది. నిర్మాణం ఉన్నతంగా ఉంది.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !