ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ‘భామా కలాపం’ ఓటీటీ వేదికగా విడుదలై ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా ‘భామా కలాపం 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలుత ఈ మూవీని థియేటర్స్‌లో విడుదల చేయాలని భావించినా కుదరలేదు. తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో స్ట్రీమింగ్‌కు తెచ్చారు. తొలి భాగాన్ని మించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇందులో ఏమున్నాయి? అనుపమగా ప్రియమణి ఈసారి ఏం సాహసం చేసింది?
కథేంటంటే
అనుపమ (ప్రియమణి) యూట్యూబ్ ఛానెల్ వేదికగా వంటలు చేస్తూ ఉంటుంది. కోల్‌కతా మ్యూజియంలో రూ.200కోట్ల విలువైన కోడిగుడ్డు మాయమవడంతో అనుపమ కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది. ఎలాగో ఆ కష్టాల నుంచి బయటపడటం పార్ట్-1 స్టోరీ. ఆపద నుంచి తప్పించుకున్న ఆమె కుటుంబం ఇల్లు మారడంతో పార్ట్-2 ప్రారంభమవుతుంది. ఇతరుల విషయాలను పట్టించుకోనని భర్తకు మాటిచ్చిన అనుపమ యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆదాయంతో హోటల్ ప్రారంభిస్తుంది. పనిమనిషి శిల్ప (శరణ్య)ను వ్యాపార భాగస్వామిని చేస్తుంది. ఇకపై ‘హ్యాపీలైఫ్’ అనుకునేలోపు మరో సమస్య వచ్చిపడుతుంది. దాని పరిష్కారం కోసం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారిని సంప్రదించగా ఆయన ముందు ఓకే అంటాడు. ఆ తర్వాత రోజు రెండు ఆప్షన్లు ఇచ్చి చావోరేవో తేల్చుకోమంటాడు. ఆయన ఎందుకు అలా మారాడు?రూ.1,000 కోట్ల విలువైన కోడి పుంజు బొమ్మను దొంగిలించే క్రమంలో అనుపమ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది? అసలు అందులో ఏముంది? జుబేదా (సీరత్ కపూర్) రోల్‌ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే
ఎలా ఉందంటే
సినిమాలైనా, సిరీస్‌లైనా ఇటీవల సీక్వెల్స్ జోరు బాగా కనిపిస్తోంది. ఒకే కథను రెండు, మూడు భాగాలుగా చూపించడం ఒక ట్రెండ్ అయితే, టైటిల్ ఒకటే పెట్టి కథలు మార్చడం మరో ట్రెండ్. ఈ రెండో కోవకు చెందిందే ‘భామాకలాపం’. తొలి భాగంగా గుడ్డు చుట్టూ స్టోరీని అల్లుకున్న దర్శకుడు రెండో భాగంలో కోడి పుంజు బొమ్మను కథా వస్తువుగా మార్చుకున్నాడు. టెంప్లేట్ ఒకటే అయినా ట్రీట్‌మెంట్‌లో మార్పు ఉంది. హీరో/ హీరోయిన్ తమ ప్రమేయం లేకుండా నేరస్థులను పోలీసులకు పట్టించడం, వాళ్లు బయటకు వచ్చాక వార్నింగ్ ఇవ్వడం, వీరి నుంచి కాపాడుకునేందుకు ఆ ప్రధాన పాత్రలు చేసే ప్రయత్నాలు.. ఇలాంటి అంశాలు ప్రేక్షకులకు ఎప్పుడూ ఆసక్తే. ఈ రెండు చిత్రాల్లో అనుపమ క్యారెక్టర్ అలాంటిదే. సమస్య వచ్చినప్పుడు కుంగిపోకుండా పోరాడి గెలవాలనే స్ఫూర్తినిస్తుంది. అనుపమ ఫ్యామిలీ నూతన ఇంటిలోకి మారడం, హోటల్ ప్రారంభాన్ని ఓ వైపు చూపిస్తూనే కొత్త పాత్రలు జుబేదా, ఆంటోనీ లోబోలను పరిచయం చేస్తూ కథకు కనెక్ట్ అయ్యేలా చేశాడు దర్శకుడు. ఇటు అనుపమ-శిల్పల కామెడీ, అటు జుబేదా గ్లామర్ రెండూ ఆకట్టుకుంటాయి. అయితే, అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మరీ ల్యాగ్ చేశారేమో అనిపిస్తుంది. ఎప్పుడైతే అనుపమ యాక్సిడెంట్ చేస్తుందో అప్పుడే కథ మలుపు తిరుగుతుంది. విలన్ పాత్ర తాషీర్, ఎన్‌సీబీ అధికారులు, ఇటలీలో ఉన్న ఆంటోనీ లోబో, కోడి పుంజు బొమ్మను విక్రయించేందుకు స్మగ్లర్లతో డీలింగ్ చేయడం.. ఇలా ఒక్కో అంశం తెరపైకి వస్తూ వెళ్తూ తర్వాత ఏం జరుగుతుందా? అన్న ఆసక్తి ప్రేక్షకుడిలో కలిగించారు. వీటన్నింటినీ ముడిపెడుతూ కథను నడిపిన తీరు మెప్పిస్తుంది. ఎన్‌సీబీ అధికారి సదానందం పాత్రను పరిచయం చేసినప్పుడు సానుభూతి కలిగినా అనుపమ విషయంలో రివర్స్ అవుతుంది. ఆ బొమ్మ కోసం సదానందం వేసే ప్లాన్, దాన్ని అనుపమ అండ్ టీమ్ ఎగ్జిక్యూట్ చేసే విధానం ఆసక్తి కలిగిస్తాయి. అది తప్పు అని తెలిసినా, లాజిక్ లోపించిదనిపించినా ఆయా సీక్వెన్స్‌లను చూస్తూ ఉండిపోవాల్సిందే. అనుపమ వంటల ఆసక్తికి, ఆంటోనీ లోబో కోడి బొమ్మను తీసుకుని హైదరాబాద్ రావడానికి ఉన్న లింక్‌ను బాగా ఎస్టాబ్లిష్ చేశారు. రూ.1,000 కోట్ల విలువైన ఆ బొమ్మపై అనుపమ, తాషీర్ మాత్రమే కన్నేశారని ఫిక్స్ అయిన ప్రేక్షకుడికి ప్రీక్లైమాక్స్‌లో ఊహించలేని ట్విస్ట్ ఎదురవుతుంది. అక్కడ వరకూ ఎంగేజ్ చేసిన దర్శకుడు ఆ తర్వాత కథను చుట్టేసినట్లు అనిపించింది. అన్ని పాత్రలకు తుపాకులు ఇవ్వడంతో ఎవరు? ఎవరిని? ఎందుకు చంపుతున్నారో స్పష్టత లేకుండా గందరగోళం సృష్టించారు. ఆ ఎపిసోడ్‌ను బలంగా చూపించి ఉంటే బాగుండేది. ఆ బొమ్మ ఏమైందనే విషయాన్ని ప్రస్తావించలేదు. విలనిజం ఓ రేంజ్‌లో ఉండాలనే ఉద్దేశంతో తాషీర్ చేసే హత్య తదితర అంశాలను ట్రిమ్ చేసి ఫైనల్ సీక్వెన్స్ ఎలివేట్ చేయాల్సింది. ‘భామాకలాపం3’ కూడా ఉంటుందని క్లైమాక్స్‌లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఈసారి అనుపమ విదేశాల్లో చెఫ్‌గా స్థిరపడుతుందా? ధైర్య సాహసాలు ఉన్నది కాబట్టి, ఏజెంట్‌గా మారుతుందా? అన్నది పార్ట్-3లో తెలుస్తుంది. ఇంతకీ ‘పార్ట్-1’ చూడలేదని ‘పార్ట్-2’ అర్థమవుతుందా? అనే సందేహంలో ఉన్నారా? తొలి భాగం చూడకపోయినా రెండో భాగం కనెక్ట్ అవుతుంది.
ఎవరెలా చేశారంటే
కొన్ని పాత్రలు కొందరికే రాసిపెట్టి ఉంటాయి. అనేది ఇండస్ట్రీలో అధికంగా వినిపిస్తుంటుంది. అలా అనుపమ పాత్ర ప్రియమణి కోసం దర్శకుడు రాసిపెట్టారు. ఆమె ‘వన్ విమెన్ షో’ అనిపించారు. శరణ్య తెరపై కనిపించినంత సేపూ నవ్వులే. సీరత్ కపూర్ అందం, అభినయంతో ఆకట్టుకుంటుంది. ఆంటోనీ లోబో, తాషీర్, సదానందం పాత్రధారులు ప్రేక్షకుల దృష్టిలో పడతారు. బ్రహ్మాజీ అతిథి పాత్రలో సందడి చేశారు. మిగిలిన వాళ్లు పరిధి మేరకు నటించారు.సాంకేతికంగా సినిమా బాగుంది. ప్రశాంత్ ఆర్.విహారి నేపథ్య సంగీతం, దీపక్ సినిమాటోగ్రఫీ, విప్లవ్ నైషధ ఎడిటింగ్ అన్నీ సమపాళ్లలో కుదిరాయి. మొదటి భాగంలో గుడ్డుతో విజయం సాధించిన దర్శకుడు అభిమన్యు ఈసారి కోడిపుంజుతో సక్సెస్ అయ్యారు.