వైసీపీకి గుడ్ బై చెప్పిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బాలశౌరికి కండువా కప్పి తమ పార్టీలోకి పవన్ సాదరంగా ఆహ్వానించారు. ఎంపీతో పాటు ఆయన కుమారుడు అనుదీప్ సైతం జనసేనలో చేరారు. ఈ కార్యక్రమంలో కీలక నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు పాల్గొన్నారు. కాగా, ఇటీవలే బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన మచిలీపట్నం నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. బాలశౌరి గుంటూరులోని ఆయన నివాసం నుంచి వేలాది మంది కార్యకర్తలతో భారీ ర్యాలీగా మంగళిగిరి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై బాలశౌరి తీవ్ర విమర్శలు చేశారు. చేరిక అనంతరం సభలో మాట్లాడిన బాలశౌరి.. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించడం లేదన్నారు. జనసేనలోకి వచ్చినందుకు ఆనందంతో తనకు ఊపిరి ఆడటం లేదన్నారు. వైఎస్సార్ హయాంలో ఎంపీగా చేసినప్పుడు తనకు చాలా తృప్తిని ఇచ్చిందని తెలిపారు. గడచిన ఐదేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయలేక పోయామని చెప్పారు.
దమ్మున్న పవన్!
పవన్ సమక్షంలో జనసేనలోకి వచ్చినందుకు తనకు ఆనందంగా ఉందని.. ఇక పవన్ తోనే తన రాజకీయ జీవతం అని బాలశౌరి స్పష్టం చేశారు. వైఎస్ హయాంలో ఎంపీగా చేసినప్పుడు తనకు చాలా తృప్తిగా అనిపించిందని.. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. దమ్ము, ధైర్యంతో గొంతెత్తే వ్యక్తి పవన్ అని కొనియాడారు. రాష్ట్రంలో పవన్ ఉండడం వల్లే కొద్దో గొప్పో ప్రజాస్వామ్యం అమలవుతోందని చెప్పారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రయత్నించినా రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి భయపడి ఎవరూ టెండర్లు వేయడానికి రావడం లేదని అన్నారు. సీఎం జగన్ ఎప్పుడూ అబద్దాలు చెప్పను అని చెప్తుంటారని అదే పెద్ద అబద్దమని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో ఓ సైనికుడిలా నెరవేరుస్తానని.. ఆయన నాయకత్వంలో జనసైనికులు వేటాడుతారని అన్నారు. అమరావతి రాజధానికి ప్రతిపక్షంలో ఉండగా జగన్ సంపూర్ణ మద్దతు ఇచ్చారని.. అధికారంలోకి వచ్చాక మాట మార్చారని ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు.
‘ఓట్లు ఎలా అడుగుతారు.?’
రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి 2019లో ఓట్లు అడిగింది గుర్తులేదా..? అని ఎంపీ ప్రశ్నించారు. 2024లో ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారో జగన్ చెప్పాలని నిలదీశారు. వందల కోట్లు పెట్టీ ‘‘సిద్ధం’’ మీటింగ్‌లు, హోల్డింగ్స్ పెడుతున్నారని.. ఇంతకీ వైసీపీ దేనికి ‘‘సిద్ధం’’..? పారిపోవడానికి ‘‘సిద్ధ’’మా..? అని సెటైర్లేశారు. దేవుడు జగన్ ఒక్కరికే కాదు.. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, సునీతకు కూడా ఉన్నారని.. అన్ని చూస్తున్నాడని తెలిపారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీలో జరిగినవన్నీ తనకు తెలుసన్నారు. రానున్న రోజుల్లో అన్నీ వివరిస్తానని ఆయన అన్నారు. తన పెదన్నయ్య చిరంజీవికి అన్ని అవార్డులు వచ్చాయని.. భారతరత్నమాత్రమే మిగిలి ఉందని అన్నారు. తన శ్రేయస్సు కోరుకునే వ్యక్తి తన చిరంజీవి అని చెప్పారు. తన రాజకీయ జీవితం ఇకపై పవన్ కళ్యాణ్‌తోనే అని ఎంపీ తెలిపారు. పార్టీలో తనకు ఏ బాధ్యత ఇచ్చినా ఒక సైనికుడిలా పని చేస్తానని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు. కాగా.. బాలశౌరి సభకు వేలాది మంది తరలి వచ్చారు. ఎంపీ మాట్లాడుతున్నంత ఈలలు, కేకలు, నినాదాలతో అభిమానులు హోరెత్తించారు.