Hyderabad : డ్రగ్స్‌ మత్తులో మహిళలు...పార్టీలకు వెళ్లడమే చేటు చేస్తుందా ?

0


హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దడ పుట్టిస్తోంది. పోలీసులు డ్రగ్‌ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నా.. నిత్యం ఎక్కడో ఒక చోట.. డ్రగ్స్‌ వ్యవహారాలు వెలుగుచూస్తూ.. కలకలం రేపుతున్నాయి. ఎంత కట్టడి చేస్తున్నా... రోజురోజుకు చాపకింద నీరులా డ్రగ్స్‌ దందా విస్తరిస్తునే వుంది. మగవారే కాదు.. మహిళలు కూడా మత్తుకు బానిసవుతున్నారు. ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీ ఎక్కువుగా ఉన్న సైబరాబాద్‌లో.. ఈ కల్చర్‌ బాగా విస్తరించింది. ఈక్రమంలోనే.. క్లబ్బులు.. పబ్బులు, నైట్‌ పార్టీలకు వచ్చే యువతులను టార్గెట్‌గా చేసుకొని మత్తు మాఫియా రెచ్చిపోతోంది. యువతులను మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చి, వారి ద్వారానే డ్రగ్స్‌ క్రయ విక్రయాలు జరిపేందుకు ప్లాన్‌ చేసింది. ఇప్పటికే.. డ్రగ్‌ మాఫియా చేతుల్లో చిక్కుకున్న యువతులు ప్రస్తుతం పోలీసులకు పట్టుబడి.. జైలు జీవితం గడుపుతున్నారు.

పోలీసుల ఉక్కుపాదం..

హైదరాబాద్‌లోనే కాదు, తెలంగాణలోనూ డ్రగ్స్‌ అన్న మాట వినపడొద్దని.. మత్తు దందాలో ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని సభా వేదికగా సీఎం రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. రేవంత్‌ రెడ్డి ఆదేశాలతో పోలీసులు, ఎక్సైజ్‌ శాఖ మరింత నిఘా పెంచారు. ఆ క్రమంలోనే ఇలా మత్తు బ్యాచ్‌లకు చెక్‌ పడుతోంది. డ్రగ్‌ ఫ్రీ తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం మరింత ఫోకస్‌ పెట్టింది. పోలీసులు ఉక్కుపాదం మోపడంతో డ్రగ్‌ మాఫియా రూట్‌ మారుస్తోంది. యువతుల్ని మత్తు మందుకు బానిసల్ని చేసి వారిని డ్రగ్‌ స్మగ్లింగ్‌ రొంపిలోకి దింపుతోంది. తాజాగా తెరపైకి వచ్చిన కేసుల్లో యువతులు ఉండడం సంచలనంగా మారింది. రెండు నెలల్లో నార్కోటిక్‌ పోలీసులకు పలువురు యువతులు పట్టుబడ్డారు. వీరంతా డ్రగ్స్‌ను తమతో క్యారీ చేస్తున్న తరుణంలో పోలీసులకు పట్టుబడ్డారు. కొద్ది నెలల క్రితం వరలక్ష్మి టిఫిన్‌ సెంటర్‌ డ్రగ్స్‌ కేసులో అనురాధ అనే యువతి ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. అప్పట్లో సైబరాబాద్‌ పరిధిలోని మోకిలా పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదు అయింది. వరలక్ష్మి టిఫిన్‌ సెంటర్‌ నిర్వాహకుడు ప్రభాకర్‌తో పాటు పట్టుబడిన అనురాధ ద్వారా అనేకమంది పేర్లను పోలీసులు సేకరించారు. ఇదే వరలక్ష్మి టిఫిన్‌ సెంటర్‌ డ్రగ్స్‌ కేస్‌ వ్యవహారంలో రెండు నెలల నుంచి పోలీసులకు దొరక్కుండా పరారీలో ఉన్న మరో యువతి లావణ్యను.. కొద్ది రోజుల క్రితమే నార్సింగ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లావణ్య దగ్గర నుంచి హెరాయిన్‌ డ్రగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లావణ్యతో పాటు మరో యువతి ఆర్టిస్ట్‌ గా పని చేసే ఇందిరను సైతం పోలీసులు అరెస్టు చేశారు. లావణ్య, ఇందిరా ఇద్దరికీ ఉనీత్‌ రెడ్డి అనే యువకుడు డ్రగ్స్‌ అలవాటు చేసి.. వారినే డ్రగ్స్‌ దందాలో దించాడు.

డ్రగ్స్‌ అలవాటు చేసి...దందాలో దించి

లేటెస్ట్‌గా.. డ్రగ్స్‌ దందాలో.. మరో ఇద్దరు యువతులను అరెస్టు చేశారు గచ్చిబౌలి పోలీసులు. డ్రగ్‌ సప్లయర్‌ వేధింపులు తట్టుకోలేక ఒక యువతి బాచుపల్లి మహిళా పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించింది. సదరు యువతీకి డ్రగ్స్‌ను సులేమాన్‌ అనే వ్యక్తి అలవాటు చేశాడు. మొదటి దశలో ఆ యువతీకి ఫ్రీగా డ్రగ్స్‌ ఇచ్చేవాడు. క్రమక్రమంగా డ్రగ్‌ సప్లయర్స్‌ తో.. ఆ యువతీకి పరిచయాలు పెంచాడు. పలువురు డ్రగ్‌ పెడ్లర్ల్‌ టార్చర్‌ తట్టుకోలేక యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఇచ్చిన ఇన్‌ఫర్మేషన్‌తో.. కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే.. తాజాగా.. శేరిలింగంపల్లిలో.. కొకైన్‌, ఎండిఎంఏ డ్రగ్స్‌ అమ్మేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు యువతులు పట్టుబడ్డారు. పోలీసుల విచారణలో మిధున, కొనగల ప్రియ, డాక్టర్‌ చల్ల చైతన్య పోలీసులకు పట్టుబడ్డారు. బెంగళూరు, గోవాలో ఉన్న డ్రగ్‌ సప్లయర్స్‌తో సంబంధాలు ఉన్నట్టు వీరు ఒప్పుకున్నారు. కొద్ది రోజులుగా వరుసగా మత్తు దందాలో యువతులు పట్టుబడుతూ ఉన్నారు. జనవరిలో సంతోష్‌ నగర్‌ లో ఎండిఎంఏ డ్రగ్‌ ను డ్రగ్స్‌ మాఫీయా తో కలిసి సప్లై చేస్తున్న అయేషా ఫిర్థోస్‌ అనే యువతిని అరెస్ట్‌ చేశారు. గత డిసెంబర్లో పలువురు కస్టమర్స్‌ కి డ్రగ్స్‌ అమ్మేందుకు ప్రయత్నించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సంధ్యాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇక నిజామాబాదులో అల్పురాజోలం అమ్ముతున్న సావిత్రి అనే మహిళను అక్కడి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించారు. బోయిన్‌పల్లిలో పలువురు యువకులకు గంజాయి అమ్ముతున్న మరో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మాన్సీ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించారు. ఇలా డ్రగ్‌ మాఫియా యువతులను అడ్డం పెట్టుకొని వ్యాపారం చేస్తూ వారి భవిష్యత్తును కటకటాల్లోకి నేడుతోంది.. ముఖ్యంగా.. పార్టీలకు వెళ్లే యువతులు.. డ్రగ్‌ మాఫియా డ్రాప్‌ లో పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !