IT Layoffs : ఈ జనవరిలో ఎన్ని ఐటీ జాబ్స్‌ పోయాయో తెలుసా?

0

  • జనవరిలో మొత్తం 32 వేల మంది ఐటీ జాబ్స్‌ కోల్పోయారన్న Layoffs.fyi 
  • గతంతో పోలిస్తే ఈసారి లేఆఫ్స్‌ తీవ్రత తక్కువగా ఉంటుందని వెల్లడి 
  • అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించే వరకూ అనిశ్చితి కొనసాగే అవకాశం

ఈ ఏడాది ప్రారంభం నుంచి ఐటీ రంగంలో లేఆఫ్స్‌ మొదలయ్యాయి. ఇప్పటికే అనేక కంపెనీలు ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని ప్రకటించాయి. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడంతో.. వ్యయ నియంత్రణలో భాగంగా అదనంగా, కంపెనీకి భారంగా అనిపిస్తున్న ఉద్యోగుల్ని కంపెనీలు తొలగిస్తున్నాయని Layoffs.fyi  వెల్లడిరచింది. 2024లోనూ లేఆఫ్స్‌ కొనసాగుతున్నట్లు పేర్కొంది. ఈ సంవత్సరం ఆరంభం నుంచి ఇప్పటివరకు అంటే కేవలం నెల వ్యవధిలోనే 32 వేల మంది ఉద్యోగులకు టెక్‌ కంపెనీలు ఉద్వాసన పలికినట్లు తెలిపింది. తాజాగా స్నాప్‌చాట్‌ పేరెంట్‌ కంపెనీ స్నాప్‌ కూడా 540 మందిని తీసేసింది. అంతకుముందు ఓక్టా అనే సాఫ్ట్‌వేర్‌ సంస్థ 400 మందిని ఇంటికి పంపించింది.

ఆశాజనకంగా లేని పరిస్థితులు

కరోనా సంక్షోభ సమయంలో వచ్చిన డిమాండ్‌కు అనుగుణంగా టెక్‌ కంపెనీలు పెద్ద మొత్తంలో ఉద్యోగుల్ని నియమించుకున్నాయి. ఈ మేరకు Layoffs.fyi  ఫౌండర్‌ రోజర్‌ లీ తెలిపారు. ఇప్పుడు ఆర్థిక మాంద్యం భయాలు, అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో.. ఆర్థిక పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవని.. ఇందులో భాగంగానే ఖర్చుల నియంత్రణలో అదనంగా ఉన్న ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ ఏడాది తొలగింపులు మునుపటి కంటే తక్కవ స్థాయిలో ఉంటాయని చెప్పారు. అయితే, గతంలో కంటే ఎక్కువ కంపెనీలు ఈసారి లేఆఫ్స్‌ ప్రకటిస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు. టెక్‌ ఇండస్ట్రీలో డిమాండ్‌ కొరత ఊహించిన దాని కంటే ఎక్కువ కాలం కొనసాగడమే ప్రస్తుత పరిస్థితుల్ని మరింత దిగజార్చినట్లు వివరించారు.కృత్రిమ మేధ వైపు రూపాంతరం చెందాల్సిన అవసరం ఉన్నందువల్లే మానవ వనరుల్ని క్రమబద్ధీకరించాల్సి వస్తున్నట్లు కొన్ని కంపెనీలు చెబుతున్నాయని గుర్తు చేశారు లీ. టెక్‌ పరిశ్రమలో నియామకాల్ని వివరాల్ని వెల్లడిరచే ఒక CompTIA అనే సంస్థ ఇదే విషయాన్ని నొక్కిచెప్పింది. 

ఏఐ ఉద్యోగులకు డిమాండ్‌

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఆధారిత ఉద్యోగులకు డిమాండ్‌ పెరిగిందని పేర్కొంది. పలు రకాల పోస్టుల్ని తీసేస్తున్నప్పటికీ.. ఇంకొన్ని రంగాల్లో నియామకాలు పుంజుకుంటున్నట్లు వివరించింది. ఏఐ నైపుణ్యాలు కావాల్సిన పోస్టుల సంఖ్య డిసెంబర్‌ నుంచి జనవరి మధ్యలో 2 వేల నుంచి 17479కి పెరిగాయని తెలిపారు. టెక్‌ రంగంలో తొలగింపులు కొనసాగుతున్న ఏఐ లాంటి విభాగాల్లో నియామకాలు కొనసాగుతున్నాయని అన్నారు. అయితే, చాలామటుకు లేఆఫ్స్‌ ముగిశాయని, కంపెనీలు మళ్లీ కోలుకోవడం ప్రారంభిస్తాయని ఇన్‌సైట్‌ గ్లోబల్‌ సంస్థ సీఈఓ బెర్ట్‌ బీన్‌ తెలిపారు. రాబోయే రెండు త్రైమాసికాల్లో మార్కెట్లో కొంత అనిశ్చితి కొనసాగుతుందని చెప్పారు. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌..వడ్డీ రేట్లలో కోత పెట్టే వరకూ ఒడిదుడుకులు తప్పవని అన్నారు.ఇక గతేడాది అంటే 2023లో మెటా, ట్విట్టర్‌, గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి పెద్ద పెద్ద కంపెనీలు వేలకు వేల మంది ఉద్యోగుల్ని తొలగించిన సంగతి తెలిసిందే. కొత్త సంవత్సరంలో కూడా అమెజాన్‌, గూగుల్‌, ట్విట్టర్‌, సేల్స్‌ ఫోర్స్‌ వంటి కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించాయి. ఇక దేశీయంగా కూడా పలు స్టార్టప్స్‌లో లేఆఫ్స్‌ జరుగుతున్నాయి. దీంట్లో ఫ్లిప్‌కార్ట్‌, స్విగ్గీ వంటివి ఉన్నాయి. ఐటీ సంస్థల్లో విప్రోలో కూడా ఇటీవల అంత పనితీరు కనబర్చని ఫ్రెషర్లను తొలగిస్తున్నట్లు తెలిసింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !