ఆరు నూరైనా తెలంగాణకు అన్యాయం జరగనివ్వనని భారాస అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. నల్గొండ శివారులోని మర్రిగూడ బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కృష్ణా జలాల కోసం చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రజలకు పిలుపునిచ్చారు.‘‘కాలు విరిగినా కట్టె పట్టుకుని నల్గొండకు వచ్చాను. ఇది రాజకీయ సభ కాదు - ఉద్యమ సభ, పోరాట సభ’’ అని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించిందని చెబుతున్న బీఆర్‌ఎస్ ప్రజాఉద్యమానికి శంఖారావం పూరించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్ని కేఆర్‌ఎంబీకి అప్పగించినందుకు నిరసనగా నల్గొండలో బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న కేసీఆర్, కృష్ణా జలాలు పరిరక్షించుకునేందుకు అనారోగ్యాన్ని లెక్క చేయకుండా వచ్చానని తెలిపారు. తన కాలు సహకరించకపోవడంతో కుర్చీలో కూర్చొనే ప్రసంగించారు.
ఇదీ రాజకీయ సభ కాదు, పోరాటసభ !
కృష్ణా జలాల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఇదని కేసీఆర్ అన్నారు. నీళ్లు లేకపోతే తెలంగాణ ప్రజలకు బతుకు లేదని 24 ఏళ్లుగా పక్షిలాగ తిరగుతూ రాష్ట్రం మొత్తం చెప్పానని తెలిపారు. ఫ్లోరైడ్ వల్ల నల్గొండ ప్రజల నడుములు వొంగిపోయాయని, బాధితులను దిల్లీకి తీసుకెళ్లి అప్పటి ప్రధానికి చూపించినా వారు పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం వచ్చాకే నల్గొండలో ఫ్లోరైడ్ సమస్య పోయిందని వెల్లడిరచారు. ఇప్పుడు నల్గొండ జిల్లా పూర్తిగా ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మారిందని వివరించారు. పోరాటం చేసి.. రాష్ట్రం తెచ్చి పదేళ్లు పాలించా. నా పాలనలో ఎవరికీ తక్కువ చేయలేదు.కొందరు ఓట్లు వచ్చినప్పుడే ప్రజల వద్దకు వస్తారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల జీవన్మరణ సమస్య కృష్ణా జలాలు. పోరాటం చేసి రాష్ట్రం తెచ్చి పదేళ్లు పాలించాను. నా పాలనలో ఎవరికీ ఏమీ తక్కువ చేయలేదు. నా ప్రాంతం, నా గడ్డ అనే ఆరాటం ఉంటే ఎక్కడివరకైనా పోరాడవచ్చు. పక్కనే కృష్ణమ్మ ఉన్నా ఫలితం లేకపాయే అని నేనే పాట రాశాను. బస్వాపూర్ ప్రాజెక్టు పూర్తయ్యింది, డిరడి ప్రాజెక్టు పూర్తి కావొచ్చింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయ్యాయి.ఏడాది పాటు తాత్కాలిక ప్రాతిపదికన కృష్ణా జలాలు కేటాయించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు సగం వాటా కేటాయించాలని కేంద్రాన్ని ఎన్నో సార్లు అడిగాం. ఇప్పుడు కృష్ణా జలాల్లో వాటా కోసం ట్రైబ్యునల్ ముందు పోరాడాలి. తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస వరకు పులిలా కొట్లాడతా.. పిల్లి మాదిరిగా ఉండను’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.