NGT REPORT ON SAND : ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీకి నివేదిక !

0

ఎన్జీటీలో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీ మండిపడిరది. ఏపీలో అక్రమ మైనింగ్‌పై సుప్రీంకోర్టుకు నేడు ఎన్జీటీ నివేదించింది. ఏపీలో అక్రమ మైనింగ్‌పై ఎన్జీటీలో సామాజిక కార్యకర్త పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌పై విచారించి ఏపీలో ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని గతంలో ఎన్జీటీ ఆదేశించింది. ఏపీలో అక్రమ మైనింగ్‌పై నేడు ఎన్జీటీకి కేంద్ర పర్యావరణ అటవీశాఖ కమిటీ నివేదిక ఇచ్చింది. పర్యావరణ అనుమతులు లేకుండా ఏపీలో ఇంకా భారీగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు నివేదికలో కేంద్ర కమిటి నిర్ధారించింది.  గుంటూరు, కృష్ణా జిల్లాల్లో యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఎలాంటి అనుమతులు లేకుండా 24 గంటలూ తవ్వకాలు చేపడుతున్నారని.. ఒక్కో రీచ్‌లో రోజుకు 2 వేల టన్నుల మేర తవ్వకాలు కొనసాగుతున్నాయని వెల్లడిరచింది. శాటిలైట్‌ చిత్రాల ద్వారా తవ్వకాల ఆధారాలు సేకరించామని వివరించింది. ఎలాంటి ఈసీలు లేకుండా తవ్వకాలు చేస్తున్నారని తెలిపింది. ఫోటోలతో పాటు ఇతర సాక్ష్యాధారాలతో నివేదికను కేంద్ర కమిటి ఎన్జీటీకి అందజేసింది.

18 కోట్ల జరిమానా..

కేంద్ర కమిటి నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించాలని కేంద్ర పర్యావరణ అటవీశాఖకు ఎన్జీటీ ఆదేశాలను జారీ చేసింది. యంత్రాలతో ఇసుక మైనింగ్‌కు అనుమతులు లేనప్పటికీ భారీ యంత్రాలతో భారీగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు నివేదికలో కేంద్ర కమిటి పేర్కొంది. గతంలో ఇసుక అక్రమాలపై జేపీ పవర్‌ వెంచర్స్‌ కి 18 కోట్లు తాత్కాలికంగా ఎన్జీటీ జరిమానా విధించింది. మొత్తం ఎన్ని రీచ్‌లలో అక్రమ మైనింగ్‌ జరుగుతుందో తేల్చాలని కమిటీని కూడా నియమించింది. అక్రమాలు జరిగినట్లు నివేదికలో వెల్లడైతే ప్రతి రీచ్‌ కి కోటి రూపాయల చొప్పున జరిమానా చెల్లించాలని కూడా ఎన్జీటీ ఆదేశించింది.

సుప్రీంలో సవాల్‌ చేసిన జేపీ పవర్స్‌..

ఏపీలో 40 రీచ్‌లలో మ్యానువల్‌ మైనింగ్‌కి ఈసీ అనుమతులుంటే 500 లకు పైగా రీచ్‌లలో ఈసీ అనుమతులు లేకుండా యంత్రాలతో ఇసుక మైనింగ్‌ చేస్తున్నట్లు కేంద్ర కమిటీ నివేదికలో బట్టబయలు చేసింది. కేంద్ర కమిటీ నివేదిక ప్రకారం జేపీ పవర్‌ వెంచర్‌ కంపెనీ రూ.500 కోట్లకు పైగా జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఎన్జీటీ అభిప్రాయపడిరది. గతంలో ఎన్జీటీ ఆదేశాలను జేపీ పవర్‌ వెంచర్స్‌ సుప్రీంలో సవాలు చేసింది. ఎన్జీటీ విధించిన జరిమానాను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు షరతులు విధించింది. మైనింగ్‌ను వెంటనే నిలిపివేయడమే కాకుండా అసలు ఎంతమేరకు అక్రమ మైనింగ్‌ జరిగిందో కేంద్ర కమిటి ద్వారా నిగ్గు తేల్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతవరకూ ఎన్జీటీ విధించిన జరిమానాపై తాత్కాలికంగా సుప్రీంకోర్టు స్టే విధించింది.

ఎన్జీటీ ఆదేశాలు అమలు కావటం లేదు..

గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను సుప్రీంలో సవాలు చేసినందున ఇసుక మైనింగ్‌ అక్రమాలపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ కమిటీ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించాలని నేడు ఎన్జీటీ ఆదేశించింది. ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలు అమలు కావట్లేదని పేర్కొంది. విచారణ సందర్భంగా ఎన్జీటీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంలో కలెక్టర్ల నివేదిక, కేంద్ర మంత్రిత్వ శాఖ నివేదిక పూర్తి భిన్నంగా ఉన్నాయని పేర్కొంది. సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు విచారణ జరుగుతోందని.. ఏం చేయాలనేది న్యాయస్థానమే తేలుస్తుందని స్పష్టం చేసింది. నివేదికను సర్వోన్నత న్యాయస్థానానికి అందజేస్తామని తెలిపింది. వచ్చే వారం సుప్రీంకోర్టులో ఏపీ అక్రమ ఇసుక తవ్వకాలపై విచారణ జరిగే అవకాశం ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !