YS Sharmila : అన్నకు వ్యతిరేకంగా చెల్లెలు పోరాటం !

0

  • మెగా డీఎస్సీ కోసం షర్మిల ధర్నా...
  • జగన్‌ను తీవ్ర స్థాయిలో విమర్శించిన షర్మిల 
  • అరెస్ట్‌ చేసిన పోలీసులు ! 
  • తాలిబాన్లలా వ్యవహారిస్తున్నారని ఘాటు వ్యాఖ్య !

మెగా డీఎస్సీ డిమాండ్‌తో ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల చేపట్టిన ఛలో సెక్రటేరియెట్‌ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ర్యాలీగా సచివాలయానికి బయలుదేరారు. పలుచోట్ల పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో షర్మిల రోడ్డుపై బైఠాయించారు. అనంతరం అమరావతి కరకట్టపై భారీగా మోహరించిన పోలీసులు.. తొలుత కార్యకర్తలు, నాయకులను బలవంతంగా వాహనాల్లో తరలించారు. గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. షర్మిల కారు దిగగానే చుట్టుముట్టి బలవంతంగా అరెస్టు చేసి పోలీసు వాహనం ఎక్కించారు.  ఈ క్రమంలో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ‘సీఎం డౌన్‌ డౌన్‌’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. షర్మిలతో పాటు కార్యకర్తలు, నాయకులను దుగ్గిరాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.


6000 ఉద్యోగాలేనా...దగా డిఎస్సీ !

అంతకుముందు మీడియాతో మాట్లాడిన వైఎస్‌ షర్మిల.. సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  23వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ వేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్‌..ఇప్పుడు కేవలం 6వేల ఉద్యోగాలతో దగా డీఎస్సీ వేశారని విమర్శించారు. జగన్‌ కన్నా చంద్రబాబే నయమని.. ఆయన గతంలో 7వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వేశారని అన్నారు. నిరుద్యోగుల కోసం గళమెత్తిన తమను అడ్డుకుంటున్నారని.. ఇదేమైనా ఆఫ్ఘానిస్తానా? అని  విరుచుకుపడ్డారు. తాలిబాన్లలా వ్యవహరిస్తున్నారని ఏపీ ప్రభుత్వంపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు షర్మిల. 23వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. 23వేలు ఖాళీగా ఉన్నప్పుడు 7వేల ఉద్యోగాలే ఎందుకు వేస్తున్నారని అప్పుడు చంద్రబాబు నాయుడుని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు మీరు 6వేల ఉద్యోగాలే ఎందుకు వేశారు. మరి మీ కంటే చంద్రబాబు నాయుడే మేలు కదా. మీ కంటే చంద్రబాబు నాయుడే ఎక్కువ ఉద్యోగాలిచ్చారు. ఆయన కంటే ఘోరం అని మిమ్మల్ని మీరే నిరూపించారు. మాట తప్పం..మడమ తిప్పం అన్నవారు..ఇప్పుడు మాటను మడతపెట్టారు. రాజశేఖర్‌ రెడ్డి వారసత్వమంటే ఇదేనా? వైఎస్‌ జగన్‌ సమాధానం చెప్పాలి. మీరు సీఎం అయినప్పుడు 2 లక్షల 30వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మరి అందులో ఎన్ని భర్తీ చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలి. 30వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ వేయాలని కాంగ్రెస్‌ పార్టీ తరపున డిమాండ్‌ చేస్తున్నా. వెంటనే జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలి.’’ అని విమర్శించారు షర్మిల.షర్మిల అరెస్ట్‌తో సీఎం వైఎస్‌ జగన్‌పై కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా లేదా? అని విమర్శిస్తున్నారు. జగన్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !