KCR : కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తెలివి లేదు

0

  • కాంగ్రెస్‌ నాయకులకు ప్రాజెక్టులపై అవగాహన లేదని వ్యాఖ్య
  • ప్రాజెక్టులు కేంద్రం పరిధిలోకి వెళ్తే తెలంగాణకే నష్టమన్న మాజీ సీఎం
  • బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు తీసుకోవడం పైనే ఇక బీఆర్‌ఎస్‌ పోరాటమని స్పష్టీకరణ
  • 13న నల్లగొండలో బహిరంగ సభ
  • కోలుకున్నాక తెలంగాణ భవన్‌లో తొలి సమావేశంలో బీఆర్‌ఎస్‌ అధినేత

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 3 నెలల విరామం అనంతరం పార్టీ కార్యాలయానికి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్‌కు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. జై తెలంగాణ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రజాప్రతినిధులతో మాట్లాడిన కేసీఆర్‌.. కృష్ణా జలాల పరిరక్షణ సభ ఏర్పాట్లపై సమీక్షించారు. బీఆర్‌ఎస్‌కు పోరాటం కొత్త కాదని.. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే అంతిమంగా మనకు ముఖ్యమని బీఆర్‌ఎస్‌ నేతలతో ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. కేఆర్‌ఎంబీ అంశంపై మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన పార్టీ నేతలతో భేటీ జరిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తెలివి లేదు. సీఎం రేవంత్‌రెడ్డికి ప్రాజెక్టులపై అవగాహన లేదు. ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టం కూడా వారికి తెలియదు. కేంద్రం పెత్తనం వస్తే మనం అడుక్కు తినాల్సి వస్తుంది. అందుకే మన ప్రభుత్వం ఉండగా ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆ అవగాహన లేకే అప్పగింతకు ఒప్పుకున్నారు. బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు తీసుకోవడం పైనే ఇక మన పోరాటం.  ‘‘నల్లగొండ సభకు నల్లగొండతో పాటు మహబూబ్‌ నగర్‌, ఖమ్మం జిల్లాల నుంచి ప్రజలు తరలించాలి. 

కేంద్రం గేమ్‌ స్టార్ట్‌ చేసింది

ఇప్పుడున్న పాలకులకు ప్రాజెక్ట్‌ లు, నీళ్ళ గురించి అవగాహన లేకపోవడంతో కేంద్రం గేమ్‌ స్టార్ట్‌ చేసింది. ప్రాజెక్ట్లు కేంద్రం ఆధీనంలోకి వెళితే తెలంగాణ నష్టపోతుంది. ప్రజలకు ఈ విషయాన్ని వివరించి చెప్పాలి. కాంగ్రెస్‌ నేతలకు అవగాహన లేక ఏదేదో మాట్లాడుతున్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా నల్లగొండ లో సభ జరిగి తీరుతుంది అని కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ నేతలతో స్పష్టం చేశారు. ఇక ఈ భేటీలో కేఆర్‌ఎంబీ వివాదంతో పాటు కాంగ్రెస్‌ ఆరోపణలపైనా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర ప్రయోజనాలే బీఆర్‌ఎస్‌కు ముఖ్యం. కృష్ణా బోర్డు (కేఆర్‌ఎంబీ) పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్తే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుంది. చివరకు డ్యామ్‌కు సున్నం వేయాలన్నా బోర్డు అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. బీఆర్‌ఎస్‌కు పోరాటం చేయడం కొత్త కాదు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించ వద్దనే మా పోరాటం. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తెలివి లేదు. ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం రైతుల సాగునీటి హక్కులకు గొడ్డలిపెట్టు లాంటిది. నల్గొండ జిల్లాలో ఈ నెల 13న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం. రాష్ట్ర హక్కులు కాపాడేందుకు ఎంతకైనా పోరాడుతాం. కాంగ్రెస్‌ రైతు వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజా క్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడతాం. మరో ప్రజా ఉద్యమంతో తెలంగాణ ప్రజల హక్కులు కాపాడుతాం’’ అని అన్నారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !