కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (37) శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సికింద్రాబాద్ నుంచి సదాశివపేటకు వెళ్తుండగా పటాన్ చెరు ఓఆర్‌ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టి.. అదుపుతప్పి రెయిలింగ్ ను ఢీకొట్టింది. ప్రమాదం సమయంలో కారులో డ్రైవర్, ఎమ్మెల్యే ఉన్నారు. అతివేగమే కారు ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. డ్రైవర్ పక్క సీట్లోనే కూర్చున్న లాస్య నందిత.. సీటుబెల్టు పెట్టుకోలేదని పోలీసులు గుర్తించారు. సీటు బెల్టు పెట్టుకొనిఉంటే ఆమె గాయాలతో బయటపడి ఉండేవారని స్థానికులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే లాస్య నందిత మరణించగా.. డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.. అతని పరిస్థితికూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 1987లో హైదరాబాద్‌లో జన్మించిన లాస్య నందిత.. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేశారు. 2015లో రాజకీయాల్లోకి వచ్చారు. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. 2016లో సాయన్నతోపాటు బీఆర్‌ఎస్‌లో చేరారు. 2016-20 మధ్య కవాడిగూడ కార్పొరేటర్‌గా పనిచేశారు. 2021 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ నుంచి ఓటమి పాలయ్యారు. 2023 ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. భాజపా అభ్యర్థిపై 17 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న కారు..
ఎమ్మెల్యే లాస్య నందిత సికింద్రాబాద్ నుంచి సదాశివపేట వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఓ ఫంక్షన్‌కు వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. కొత్తకారులో బెలూన్లు తెరుచుకున్నాయా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.రోడ్డు ప్రమాద సమయంలో లాస్య కారు 120 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. లారీని ఢీకొట్టాక నేరుగా వెళుతున్న కారు కుదుపుకు గురై అదుపుతప్పింది. పక్కనే ఉన్న రెయిలింగ్‌ను వేగంగా ఢీకొట్టింది.
ఏడాది వ్యవధిలో ఇంట్లో ఇద్దరు మృతి..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత..దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె. .బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. 1986లో జన్మించిన లాస్య గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సాయన్న రాజకీయ వారసత్వాన్ని అందుకున్న లాస్య..ప్రజల్లోకి చురుగ్గా వెళ్లారు. అదే ఆమె గెలుపుకు దోహదం చేశాయి. గతేడాది ఫిబ్రవరి 19న లాస్య తండ్రి సాయన్న మృతి చెందారు. ఈలోపే ఆ ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది.
లిఫ్ట్ లో ఇరుక్కున్న లాస్య
గతేడాది డిసెంబర్ 24న సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో ఓ కార్యక్రమానికి హాజరైన లాస్య నందిత లిఫ్ట్ లో ఇరుక్కున్నారు. ఓవర్‌లోడ్ అవ్వడంతో లిఫ్ట్ ఒక్కసారిగా గ్రౌండ్‌ఫ్లోర్ వరకు దూసుకుపోయింది. ఆ తర్వాత లిఫ్ట్ డోర్లు ఎంత తెరిచినా ఓపెన్ కాలేదు. దీంతో డోర్లను పగలగొట్టి లాస్య నందితను బయటికి తీశారు సెక్యూరిటీ సిబ్బంది.
నల్గొండ సభకు వెళ్లి వస్తుండగా
లిఫ్ట్ ప్రమాదం నుంచి తప్పించుకున్న లాస్య నందితను నెలన్నర గ్యాప్‌లోనే మరోసారి మృత్యువు వెంటాడిరది. ఈనెల 13న నల్గొండలో నిర్వహించిన బీఆర్‌ఎస్ సభకు వెళ్లి వస్తుండగా ఆమె కారు ప్రమాదానికి గురైంది. లాస్య ప్రయాణిస్తున్న కారు ముందు భాగం దెబ్బతింది. కారు టైర్ సైతం ఊడిపోయింది. ఈ ప్రమాదంలో కూడా స్వల్ప గాయాలతో బయటపడిరది లాస్య.
కబళించిన మృత్యువు
నల్గొండ యాక్సిడెంట్ జరిగిన పది రోజుల్లోనే మరోసారి మృత్యువు తరుముకొచ్చింది. అయితే ఈసారి మృత్యువు నుంచి ఆమె తప్పించుకోలేకపోయింది. ఇవాళ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌పై జరిగిన కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది లాస్య. కారానా గృహలక్ష్మి కాలనీలోని లాస్య నందిత ఇంటిదగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదిలాఉంటే లాస్య నందిత రోడ్డు ప్రమాదంపై అమీర్ పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీటు బెల్టు పెట్టుకోకపోవడంతోనే ఆమె మృతిచెందినట్లు గుర్తించారు. లాస్య నందిత తల్లి గీత ఇంట్లోనే ఉన్నారు. లాస్య అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కుటుంబ సభ్యులు, అభిమానులు. భారీగా లాస్య ఇంటికి చేరుకుంటున్నారు.
సీఎం రేవంత్ దిగ్భ్రాంతి..
నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నందిత తండ్రి సాయన్నతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. లాస్య నందిత మృతిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అతి పిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందారని.. రోడ్డు ప్రమాదంలో అకాల మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు.