నిరుద్యోగులారా అధైర్యపడకండి .. మీ సమస్యలు పరిష్కరిస్తాం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఎల్బీ స్టేడియంలో హోంశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలను ఆయన అందజేశారు. తెలంగాణ కోసం పోరాడిన యువత ఇవాళ ఉద్యోగాలు సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎంగా ప్రమాణం చేసినప్పుడు తనకు ఎంత ఆనందం కలిగిందో.. ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తున్నప్పుడు అంతే సంతోషం వస్తోందన్నారు. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుంచి యువతను గట్టెక్కిస్తామని చెప్పారు. స్వరాష్ట్రం వచ్చాక బాధలు తీరుతాయని నిరుద్యోగులు ఆశించారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని గత ప్రభుత్వానికి తొమ్మిదిన్నరేళ్లపాటు ఆలోచన రాలేదు. అధికారులతో సమీక్షించి అన్ని ఆటంకాలు తొలగించాం. నియామక పత్రాలు ఇంటికే పంపొచ్చు కదా? అని హరీశ్‌రావు అంటున్నారు. ఉద్యోగాలు పొందిన మీ కళ్లలో ఆనందం చూస్తూనే నాకు నిద్ర పడుతుంది. మీరంతా మా తమ్ముళ్లు.. మీ ఆనందాన్ని మేమూ పంచుకుంటాం. కుటుంబ సభ్యులకే కేసీఆర్ పదవులు, ఉద్యోగాలు ఇచ్చారు. రాష్ట్ర యువత ఏం పాపం చేసిందని ఉద్యోగాలు ఇవ్వలేదు.
తెలంగాణలో హాట్ హాట్‌గా రాజకీయం
ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా.. కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు. శాసనసభకు రమ్మంటే కేసీఆర్ రాలేదు. నల్గొండకు వెళ్లి బీరాలు పలికారు. పాలిచ్చే బర్రెను ఇంటికి పంపి.. దున్నపోతును తెచ్చుకున్నారన్నారు. కంచర గాడిదను ఇంటికి పంపి.. రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని ఇవాళ అసెంబ్లీలో ఓ అటెండర్ నాకు చెప్పారు. చంపితే చంపండని కేసీఆర్ అన్న విషయాన్ని కూడా ప్రస్తావించిన రేవంత్ రెడ్డి.. చచ్చిన పామును ఎవరైనా చంపుతారా అంటూ ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో తీవ్ర విమర్శలు చేయటంతో బీఆర్‌ఎస్ నేతలు వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన పోలీస్ కానిస్టేబుళ్ల నియామక ప్రతాల పంపిణీ కార్యక్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ టార్గెట్‌గా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాబోయే పదేళ్లు తాను సీఎం పదవిలోనే ఉంటానని.. వీలైతే ఒక్క వెంట్రుకైన పీక్కొమ్మను చూస్తా అంటూ కేసీఆర్‌కు సవాల్ విసిరారు . వచ్చే పదేళ్లే కాదు.. అందరి ఆశీర్వాదం ఉంటే మరో పదేళ్లు కూడా ఇందిరమ్మ రాజ్యమే ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
బీఆర్‌ఎస్ పాలనలో యువతకు అన్యాయం !
బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రంలోని యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని.. ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుదోగ్యులను ఇబ్బంది పెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వరాష్ట్రం వస్తే.. బాధలు తీరుతాయని నిరుద్యోగులు ఆశించారని.. కానీ ఉద్యోగాలు భర్తీ చేయకుండా యువతను మోసం చేసిందని ఆరోపించారు. తమది ప్రజా ప్రభుత్వమని.. యువత ఎలాంటి ఆందోళన పడొద్దని ధైర్యం చెప్పారు. ఎన్నికల సందర్భంగా చెప్పినట్లుగానే ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామన్నారు. గత ప్రభుత్వం వేసిన చిక్కుముళ్లను ఒక్కొక్కటిగా విప్పుకుంటూ.. ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. టీఎస్పీఎస్పీ బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేశామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు లేకపోతే కేసీఆర్ 100 రోజులు కూడా ఆగలేదని.. వెంటనే వాళ్లందరికీ ఉద్యోగాలు ఇచ్చాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. మరి తెలంగాణ యువత ఏం అన్యాయం చేసిందని ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రశ్నించారు. అందుకే.. కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజలు తిరస్కరించారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ డ్రామాలన్నీ తెలంగాణ ప్రజలు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ను బయట తిరిగితే ఊరుకోరని.. తమను మోసం చేసినందుకు కొత్తగా ఎంపికైన ఈ పోలీసులే కేసీఆర్‌ను తీసుకెళ్లి లాకప్‌లో వేస్తారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
యువకులారా ఈ రాష్ట్రం మీదే..
కృష్ణాలో నీటి వాటాలపై సీఎంగా కేసీఆర్ పెట్టిన సంతకాలు తెలంగాణ ప్రజల మరణశాసనాలు. అవి మనపాలిట గుదిబండలుగా మారాయి. అయినా.. మళ్లీ నీళ్ల అంశాన్నే ఎత్తుకుంటున్నారు. దిల్లీతో కొట్లాడదామంటే కేసీఆర్ ఇంటి నుంచి బయటకు రావట్లేదు. మేడిగడ్డ మేడిపండు.. పొట్టవిప్పితే అన్నీ పురుగులే ఉన్నాయి. తెలంగాణను కబళించడానికి గంజాయి ముఠాలు తిరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో గంజాయి మొక్కలు ఉండొద్దు. నిరుద్యోగ యువకులారా ఈ రాష్ట్రం మీదే. సాధించుకున్నది మీరు. మీకోసం పనిచేయడానికి, మీ సమస్యలు పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పదేళ్లు ఈ బాధ్యతలోనే ఉండి మీకోసం 24గంటలూ కష్టపడి పనిచేస్తా. మీరు ఆశీర్వదిస్తే మరో పదేళ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. కేసీఆర్ మళ్లీ మేమే అధికారంలోకి వస్తా అంటున్నారు. ఎలా వస్తారో నేనూ చూస్తా’’ అని సవాల్ విసిరారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతి కుమారి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.