టీడీపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాలో కొంతమందికి అనూహ్యంగా చోటుదక్కింది. సామాజిక సమీకరణాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా ఇటీవలే పార్టీలో చేరిన అమరావతి రైతు ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు, మహాసేన రాజేష్‌లకు తొలి జాబితాలోనే చోటు దక్కింది. వీరికి టికెట్లు వస్తాయని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. పార్టీలో సీనియర్ నాయకులకు సైతం స్థానం దక్కని తొలి జాబితాలోనే వీరి పేర్లు ఉండటం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.
ఎస్.సి. రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో బలమైన నాయకులు !
తిరువూరు నుంచి కొలికపూడి శ్రీనివాసరావును బరిలో దించుకున్నట్లు టీడీపీ ప్రకటించింది. కొలికపూడి శ్రీనివాస్ గతంలో సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహించేవారు.. ఆ తర్వాత అమరావతి రైతుల ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ఆంధ్ర ప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు ఉన్నారు. ఇక ఇటీవలే కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీ కండువా కప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు. దీంతో తిరువూరు నుంచి ఆయన పోటీ చేయడం ఖాయమనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అప్పటికి తిరువూరు టీడీపీ ఇంఛార్జిగా ఉన్న నల్లగుట్ల స్వామిదాస్.. జగన్‌ను కలిసి వైసీపీలో చేరిపోయారు. దీంతో టీడీపీ నుంచి తిరువూరు టికెట్ కొలికిపూడి శ్రీనివాసరావుకు ఖరారైంది. మరోవైపు మహాసేన రాజేష్‌గా ఫేమస్ అయిన సరిపెళ్ల రాజేష్‌ను పి.గన్నవరం నియోజకవర్గం నుంచి బరిలో నిలుపుతున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 2019 ఎన్నికల సమయంలో రాజేష్ వైఎస్‌ఆర్సీపీకి అనుకూలంగా వ్యవహరించారు. వైఎస్ జగన్‌కు మద్దతుగా ప్రచారం కూడా చేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకీ రాజేష్ దూరమయ్యారు. ఆ తర్వాత మహాసేన పేరుతో సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానెళ్లలో వైసీపీ సర్కారు మీద విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఆ రకంగా మహాసేన రాజేష్‌గా గుర్తింపు పొందారు. సుమారు ఏడాది కిందట మహాసేన రాజేష్ టీడీపీలో చేరారు. జనసేనలోకి వెళ్తారనే ప్రచారం జరిగినప్పటికీ ఆయన సైకిలెక్కారు. ఈ నేపథ్యంలో మహాసేన రాజేష్‌కు సైతం తొలి విడతలోనే టీడీపీ టికెట్ ఇచ్చింది.
సీనియర్‌లకు మొండిచేయి !
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి జాబితాలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన పలువురు సీనియర్లకు చోటు దక్కలేదు. బండారు సత్యనారాయణమూర్తి, గంటా శ్రీనివాసరావు లాంటి బడా నేతలతో పాటు పల్లా శ్రీనివాస్‌కు కూడా తొలి జాబితాలో చంద్రబాబు మొండిచేయి చూపించారు.మరోపక్క అనకాపల్లిలో పీలా గోవింద్, బుద్ధ నాగ జగదీష్ అనకాపల్లిలో సీటు ఆశించి భంగపడ్డారు. పొత్తులో భాగంగా అనకాపల్లి సీటు జనసేనకు కేటాయించడంపై తమ్ముళ్లు ఆగ్రహంతో ఉన్నారు. అసలు బలమేలేని జనసేనకు అనకాపల్లి సీటు ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. పార్టీకి వీరవిధేయలైన నాయకులు బుద్దావెంకన్న, ఏపీ టీడీపీ మాజీ చీఫ్‌గా పనిచేసిన కిమిడి కళా వెంకట్రావు, గుంటూరు జిల్లాలో యరపతినేని, ఆలపాటి రాజా, పెద్దకూరపాడు నుంచి కొమ్మాలపాటి శ్రీధర్, ఉండి నుంచి వేటుకూరి శివరామరాజు పేర్లు తొలి జాబితాలో లేవు. ఈ ఎన్నికల్లో వీరందరికీ బాబు హ్యాండిచ్చినట్లేనన్న ప్రచారం జరుగుతోంది. విజయనగరం గజపతినగరం టీడీపీలో ఇప్పటికే అసంతృప్తి రగిలింది. కొండపల్లి శ్రీనివాసరావుకి టికెట్ కేటాయించి డా.కె.ఎ.నాయుడుకి టికెట్ ఇవ్వకపోవడంపై కేడర్ లో అసంతృప్తి భగ్గుమంది. భవిష్యత్ కార్యాచరణపై డా.కె.ఎ.నాయుడు కేడర్‌తో చర్చిస్తున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న పార్టీ సూపర్ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరికి ఈసారి నో ఛాన్స్ అన్నట్లే కనిపిస్తోంది. రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ, జనసేన ఆశావహులు ఇద్దరూ పోటీ చేస్తారని బాబు అన్నారు. వీరిలో ఒకరు రాజమండ్రి రూరల్, మరొకరు వేరే చోట పోటీ చేస్తారని చెబుతున్నారు. ఈ జాబితాలో వేద వ్యాస్ పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఆయన అభిమానులతో మాట్లాడుతూ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఆయనను పాండ్రాక పీహెచ్‌సీకి తరలించి వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు. శనివారం నాడు పెడన నియోజవర్గం కృత్తివెన్ను మండలంలో వేదవ్యాస్ పర్యటించారు. చినపాండ్రాక గ్రామంలో ఉండగా ఈ సంఘటన జరిగింది.